అనగా అనగా ఒక అడవిలో మిణుగురు పురుగు ఒకటి ఉండేది.

అది అడవిలో స్వేచ్ఛగా, సంతోషంగా తిరుగుతూ హాయిగా కాలం గడిపేది.

ఒకరోజు రాత్రి కాకి ఒకటి వచ్చి దాన్ని మింగబోయింది.

"ఆగు- నా మాటలు వింటే నీకే లాభం" అంటూ గట్టిగా అరిచింది మిణుగురు పురుగు.

'సరే, ఇది ఏం చెబ్తుందో చూద్దాం" అనుకున్న కాకి దాన్ని మింగటం ఆపి- "సరే,చెప్పు, ఏం చెబుతావో చూస్తాను" అన్నది. నువ్వు ఇప్పుడు నన్ను తినకుండా వదిలేశావంటే, తెల్లవారు జామునే నీకు బోల్డన్ని మిణుగురు పురుగులు ఉండే చోటొకటి చూపిస్తాను. అక్కడ నీకు కావలసినన్ని మిణుగురు పురుగులు ఉంటాయి; నువ్వు కడుపు నిండా హాయిగా తినొచ్చు!" అంటూ ఊరించింది.

కడుపునిండేన్ని మిణుగురు పురుగులనేసరికి, కాకికి ఆశ మొదలైంది. "దాని మాటలు నమ్ముదాం" అనిపించింది. "కావాలంటే ఆ తర్వాతే తింటాను దీన్ని!" అనుకున్నది. పైకి మటుకు "సరే, చూపించు!" అన్నది.

మిణుగురు పురుగు కాకిని అడవి అంచుకు తీసుకెళ్ళింది. అక్కడ, ఊళ్ళో జనాలు కొందరు కూర్చొని వెచ్చగా చలికాగుతున్నారు- వాళ్ళకెదురుగా పెద్ద చలిమంట ఒకటి, రగులుతున్నది. చలిమంట మీదినుండి, కొన్ని నిప్పురవ్వలు పైకి ఎగురుతున్నాయి- అచ్చం మిణుగురులలాగానే!

మిణుగురుపురుగు కాకి వైపుకు చూస్తూ ఉత్సాహంగా "చూడు! ఎన్ని మిణుగురు పురుగులో! నీ ఆకలి తీర్చుకో, ఇంకెందుకు ఆలస్యం?" అన్నది.

నిప్పు రవ్వలను 'మిణుగురు పురుగులు' అనుకున్న కాకి ఆత్రంగా నోరు తెరుచుకొని పోయి, గబగబా ఓ పది నిప్పు రవ్వల్ని మ్రింగేసింది. దాని నోరు చురుక్కుమనటమే కాదు, ఇంక నెలరోజులపాటు అది ఏమీ తిననే లేని పరిస్థితి ఏర్పడ్డది! ప్రాణాలు కాపాడుకున్న మిణుగురు పురుగు వెంటనే అక్కడినుండి తప్పుకున్నది!