పూర్వం వారణాసిలో కృపాలుడనే నిరుపేద ఒకడు ఉండేవాడు. పసితనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న అతడిని, అతడి బామ్మ పెంచిపెద్ద చేసింది.

ఒకసారి అతని బామ్మ తీవ్ర అనారోగ్యానికిగురైంది. అవసాన దశలో ఉన్న ఆమె కృపాలుడిని దగ్గరికి పిలిచి, "నాయనా, నేనుగానీ, నీ తల్లిదండ్రులుకానీ, నీకు గొప్ప ఆస్తులేవీ ఇవ్వలేకపోయాం. కానీ నువ్వు జీవితాంతం సంతోషంగా బ్రతికేందుకు మార్గాలు మాత్రం నీకు చెబుతాను: నిజాయితీ, గుండెధైర్యం, ఏది జరిగినా మన మంచికే అనుకోగల తత్వం- ఈ మూడింటినీ నీలో నిలుపుకో. ఏ పని చేసినా నిజాయితీతో చెయ్యి. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ గుండె ధైర్యాన్ని చెదిరి పోనీకు. నీకు ఎదురయ్యేది మంచైనా-చెడైనా, అది నీ మంచికోసమేనని నమ్ము. ప్రతీ చెడులోనూ ఎంతోకొంత మంచి ఉంటుందన్న విషయాన్ని గ్రహించు!" అని చెప్పి కన్నుమూసింది.

బామ్మను కోల్పోయిన తర్వాత కృపాలుడు పనికోసం వారణాసిలో పేరుగాంచిన వర్తకుడైన భూపాలునివద్దకు వెళ్ళాడు. కృపాలుడిని పరీక్షించిన భూపాలుడు అతని పనితీరుకు, నిజాయితీకి మెచ్చి అతన్ని పనిలో చేర్చుకున్నాడు. కృపాలుడి జీవితం గాటిలో పడ్డట్లయింది. అతను యజమాని తనకిచ్చిన పనిని నమ్మకంగా చేస్తూ మంచి పేరు తెచ్చుకోసాగాడు.

భూపాలుడి దగ్గర మయూఖుడు అనేవాడు కూడా పనిచేస్తూండేవాడు. అతను మొదట్లో కృపాలునితో స్నేహంగానే ఉండేవాడు; అయితే రాను రాను కృపాలుడి నిజాయితీనీ, మంచితనాన్నీ యజమాని పదేపదే అందరిముందూపొగడటం , తనమీదకంటే కృపాలునిమీదే ఎక్కువ అబిమానం చూపడం తట్టుకోలేకపోయాడు. కృపాలునిపట్ల తీవ్రమైన అసూయాద్వేషాలను పెంచుకొని, పైకి స్నేహం నటిస్తూనే, లోపలలోపల 'అతన్ని ఎలా దెబ్బతీయాలా?'అని యోచన చేస్తూ ఉండేవాడు.

అన్ని రోజులూ ఒక్కలాగా ఉండవు కదా, కొన్ని మాసాల తర్వాత, భూపాలుని ఒక్కగానొక్క కుమారుడు సుజనుడు ప్రాణాంతక వ్యాధితో మరణించాడు. కొడుకు మరణంతో కృంగిపోయిన భూపాలుడు ఇక ఆఊరిలో ఉండలేకపోయాడు. తన దగ్గర నిజాయితీగా పనిచేసి, తన సంపదను- గౌరవాన్నీ పదింతలు చేసిన కృపాలుడికి తన భవనాన్నీ, కొంత సంపదను ఇచ్చాడు.

మయూఖుడికి కూడా ఏదైనా వ్యాపారం చేసుకొమ్మని కొంత బంగారాన్ని ఇచ్చి, అక్కడినుండి వెళ్ళిపోయాడు.

అంత సంపద, అంతపెద్ద భవనం లభించినందుకు కృపాలుడిని అందరూ పొగిడారు - 'బలే అదృష్టవంతుడు' అన్నారు. అయితే కృపాలుడు మాత్రం మురిసిపోలేదు; మారిన తన స్థాయిని చూసి గర్వపడలేదు- ఎప్పటిలాగే నిజాయితీగా పనిచేయసాగాడు. తనని మెచ్చుకునేవారినిచూసి నవ్వి ఊరుకునేవాడు.

అటు మయూఖుడు, యజమాని భవనాన్ని తనకి ఇవ్వకుండా కృపాలుడి పరం చేసినందుకు నొచ్చుకున్నాడు. అయితే యజమాని తనకిచ్చివెళ్ళిన బంగారంతో వ్యాపారం చేసి , అతను కూడా త్వరలోనే గొప్ప లాభాలనుగడించాడు- పెద్ద ధనవంతుడైపోయాడు.
అంతలోనే కృపాలుడికి ఎదురు దెబ్బ తగిలింది. కృపాలుడి భార్యకు తీవ్రమైన జబ్బు చేసింది. ఆమె వైద్యం నిమిత్తం కృపాలుని వద్దనున్న సంపదంతా హరించుకుపోవటమే కాక, మరింత ధనంఅవసరమైంది.

మొదటినుండీ మయూఖుడిని స్నేహితుడిగా భావించిన కృపాలుడు, అప్పుకోసం అతని దగ్గరకెళ్లాడు. అదే అదనుగా భావించిన మయూఖుడు - 'యజమాని ఇచ్చిన భవనాన్ని తనకు అమ్మితేనే ధనమిస్తాను; లేకపోతే లేదు'అని ఖరాఖండిగా చెప్పాడు.

చేసేదిలేక కృపాలుడు, యజమాని తనకెంతో అభిమానంతో ఇచ్చిన ఆ భవనాన్ని మయూఖుడికి అమ్మేశాడు. తాననుకున్నది సాధించిన మయూఖుడు గర్వంతో పొంగిపోయాడు.

కృపాలుడిభార్యమాత్రం దీనంతటికీ తానే కారణమని ఎంతో బాధపడింది. కృపాలుడుమటుకు-" 'ఏది జరిగినా అంతా మన మంచికే' అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను; నువ్వుకూడా నమ్ము. 'ఏదో మంచికోసమే మనకిలాజరిగింది'అనుకో. ఊరికే బాధపడకు!" అని భార్యతో చెప్పాడు. ఆరోజే వైద్యంకోసమని పట్నం బయలుదేరారిద్దరూ.

దారిలో వాళ్ళిద్దరూ ఒక భయంకరమైన వానలో చిక్కుకున్నారు . వర్షం విరుచుకుపడుతుండటంతో, దగ్గరలోనే కనిపించిన ఓ
పాడుబడ్డ కోటలో తలదాచుకున్నారు. కృపాలుడి అవస్థను చూసి, అతని భార్య ఎంతగానో దు:ఖించింది: "అంత గొప్ప భవనంలో ఉండాల్సిన మీరు, అన్నీ కోల్పోయి ఇలా పాడుబడ్డ కోటలో తలదాచుకోవాల్సిన అగత్యం ఏర్పడిందే- ఇదంతా నావల్లనేగా?" అని కంటతడిపెట్టింది.

అప్పుడు కూడా కృపాలుడు బామ్మచెప్పిన మాటనేగుర్తుచేశాడు: "ఇదికూడా మనమంచికే అనుకో! ధైర్యాన్ని కోల్పోకు. ధైర్యం మనతో ఉన్నంతవరకూ, మనకు అన్ని ఆస్తులూ ఉన్నట్లే" అని చెప్పాడు ప్రేమగా.

చూస్తూండగానే వర్షం తీవ్రరూపం దాల్చి, తుఫానుగా మారింది. ఆ తుఫాను ధాటికి అడవిలోని మహావృక్షాలు సైతం కూకటి వ్రేళ్లతో పెకలించుకు పోయాయి. కృపాలుడు, అతని భార్య తలదాచుకున్న కోటకూడా సగం కూలిపోయింది. అదృష్టం కొద్దీ కోటగోడ రాళ్ళు వాళ్ళ మీద పడలేదు. తెల్లవారి, వర్షం తగ్గాక, బయటికి వెళ్ళేందుకు అడ్డం పడిన రాళ్లను తొలగిస్తున్న కృపాలుడికి ఆ రాళ్లలో ఏదో వెలుగు కనిపించింది. 'ఏమిటా' అని చూస్తే అక్కడ కోటగోడలో వెలలేని బంగారు ఇటుకలు, వజ్రాల హారాలు ఉన్నాయి!

వాటిని చూసి కృపాలుడి భార్య ఎంతగానో సంతోషించింది. మళ్ళీ తమ భవనాన్ని తాము కొనుక్కోవచ్చని సంబరపడింది. ఆ సంతోషంలో ఆమె ఆరోగ్యం కూడా బాగైంది! బంగారు ఇటుకలతో, వజ్రాలహారాలతో ఊరికి తిరిగివెళ్లిన కృపాలుడికి, అక్కడ తుఫాను ధాటికి నేలమట్టమైన తమ భవనం కనిపించింది!

ఆనాడు అందులో ఉండి ఉంటే తాము ప్రాణాలతో మిగిలేవాళ్ళు కారు!

అటు తర్వాత కృపాలుడి భార్య "అంతా మన మంచికే" అని పూర్తిగా విశ్వసించింది.