అనగా అనగా ఓ అడవి అంచున ఒక ఊరు ఉండేది. ఆ ఊళ్ళో చంద్రదీప్ అనే మేదరి ఒకడు ఉండేవాడు . అతని భార్య సీత చాలా తెలివైనదీ, మంచిదీనీ.

చంద్రదీప్ ప్రతిరోజూ ప్రొద్దునే బయలుదేరి అడవికి వెళ్ళేవాడు. ఆ రోజుకు అవసరమైనన్ని వెదుర్లు మటుకు కొట్టుకొని తెచ్చుకునేవాడు. అడవి బాగా దట్టంగా ఉండేది కదా, లోపల రకరకాల క్రూరమృగాలు నివసించేవి. అందుకని అందరూ అడవిలోపలికి పోయేందుకు జంకేవాళ్ళు. సాధారణంగా చంద్రదీప్‌కి కావలసిన వెదుర్లు అడవిలో ఎక్కువ లోపలికి పోకుండానే సులభంగా దొరికేవి. అందువల్ల పెద్ద సమస్యగా ఏమీ ఉండేది కాదు.

అయితే ఒక రోజున అతనికి సన్నగా ఉండే ప్రత్యేకమైన వెదురు కావలసి వచ్చింది. అది అడవిలోపల మాత్రమే దొరికే రకం. అందుకని వాటికోసం చంద్రదీప్ ఉదయాన్నే బయలుదేరి అడవిలోపలికల్లా పోయాడు. అయితే అతనికి ఆ వెదురు అంత సులభంగా దొరకలేదు.. మెల్లగా చీకటి కూడా‌ పడసాగింది.

చంద్రదీప్ ఇక వెనక్కి తిరిగి వచ్చేద్దామనుకున్నాడుగానీ, అతని పాదాలు ఎందుకనో అతన్ని ముందుకే తీసుకెళ్ళాయి. అడవిలోని ఆ ప్రాంతంలో చెట్లు మరీ దట్టంగా పరచుకొని ఉన్నాయి. తనకు భయం వేసినప్పుడల్లా చంద్రదీప్‌ తనకు దొరకనున్న సన్నటి వెదురును గుర్తు చేసుకొని ధైర్యం తెచ్చుకుంటున్నాడు.

చివరికి అతనికి తను వెతుకుతున్న వెదురుపొద ఒకటి కనబడింది. దాన్ని చూడగానే చంద్రదీప్‌కు ప్రాణం లేచి వచ్చినట్లయింది. అతను గబగబా వెళ్లి దాన్ని నరికేందుకు కత్తి ఎత్తాడు- అంతలోనే అతని వెనక ఏదో అలికిడి అయ్యింది. చంద్రదీప్ గబుక్కున వెనక్కి తిరిగాడు; కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. అక్కడ నివసిస్తున్న భూతం ఒకటి అతన్ని పట్టుకొని, వంచి నేలమీద పడుకోబెట్టేసింది. మరుక్షణంలో అతను స్పృహ కోల్పోయాడు!

ఆ భూతం చాలా కాలంగా మనుషుల్ని పట్టుకోవటం కోసమే వేచి ఉన్నది. దానికి నరమాంసం అంటే చాలా ఇష్టం. అయితే, దాని తత్వం పిల్లి మాదిరిదే- చడీ చప్పుడు లేకుండా తన వేటని తినటం దానికి ఇష్టం లేదు. తినేముందు కొంచెం ఏడుపూ, హడావిడీ, రొదా, గందరగోళమూ లేకపోతే దానికి అసలు తిన్నట్టుండదు. అందుకని, ఏం చేద్దామా అని అది కొంచెంసేపు ఆలోచించింది. ఆ పైన వెంటనే తన రూపం మార్చుకొని, అచ్చం చంద్రదీప్‌లా తయారైంది!

ఒకసారి అట్లా రూపం మార్చుకోగానే దానికి చాలా ఉత్సాహం వచ్చింది. అది నిజం చంద్రదీప్‌ని అట్లాగే నేలమీద వదిలి, ఈ వేషంలో ఊళ్ళోకి బయలుదేరింది. అదృష్టం బాగుంటే ఈ వేషంలో తనకు సాయంత్రంకల్లా మరింతమంది మనుషులు దొరికే వీలుంది!

అది మెల్లగా నడచుకుంటూ చంద్రదీప్‌ వాళ్ల ఇల్లు చేరుకునే సరికి సాయంత్రం కావొస్తున్నది. అతని భార్య సీత వంటగదిలో అన్నం వండుతున్నది. అక్కడినుండి వెలువడుతున్న ఘుమఘుమలకు మామూలుగా ఎవరి నోరైనా ఊరాల్సిందే. భూతానికి కూడా నోరు ఊరింది. అయితే దాని నోరు ఊరేందుకు కారణం వేరు: చంద్రదీప్ భార్య సీత, పిల్లలు చాలా చక్కని వాసన వచ్చారు, దానికి! సాయంత్రం కొంచెం చీకటి పడ్తుండగా అది వీళ్లనందరినీ తినేయనున్నది!

అయితే చంద్రదీప్ భార్య సీత మటుకు అతని ప్రవర్తనలో తేడాని ఏమాత్రం‌ గుర్తించలేదు. "ఏది, వెదురు తేలేదా?" అని ఆమె అడిగితే అతను ఊరికే నవ్వాడు తప్పిస్తే ఇంకేమీ మాట్లాడలేదు. ఇంకా చీకటి పడకనే ఆమె అందరికీ అన్నం వడ్డించింది. భూతం కూడా అన్నం తినేసింది. ఆ తర్వాత దానికి కంటినిండా నిద్రవచ్చేసింది. పొయ్యికి దగ్గరలోనే వెచ్చగా పడుకొని, అది తన కాళ్ళకు నూనె రాయమని సీతను ఆజ్ఞాపించింది. అంతలోనే దానికి కునుకు పట్టేసింది.

సీత నూనె తీసుకొనివచ్చేసరికి చంద్రదీప్ రూపంలోని భూతం గురకపెట్టి నిద్రపోతున్నది. ఆమె అతని కాళ్ల దగ్గర కూర్చొని నూనె రాయబోతూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డది: ఇవి తన భర్త కాళ్ళు కాదు! బయటినుండి చూసేందుకు భూతం అచ్చం చంద్రదీప్ లాగా తయారైంది; కానీ దుస్తుల లోపల మటుకు దాని శరీరంలో ఏ మార్పూ లేదు!

దాంతో ఒక్కసారిగా సీతకు వణుకు వచ్చినట్లయింది. ఇది తన భర్త కాదు- భర్త వేషంలో‌వచ్చిన ఏదో భూతం! అయినా ఆమె క్షణంలో తెప్పరిల్లి, ఏం చేయాలో ఆలోచించింది. ముందుగా పిల్లల్ని లేపి, "చప్పుడు చేయకండి, రండి!" అని సైగలు చేసి, వాళ్లను దూరంగా తీసుకెళ్ళి కూర్చోబెట్టింది. అటుపైన వెనక్కి తిరిగి వచ్చి, అంతకు ముందు వాళ్ళు పడుకున్న చోట దిండు ముక్కలు పెట్టి, వాటికి దుప్పటి కప్పేసింది. ఆ తర్వాత వంట ఇంట్లోంచి రెండు దోసిళ్ల బఠానీలు తెచ్చి, వాటిని ఇల్లంతా చల్లింది. తర్వాత కణకణా మండుతున్న బొగ్గులు తీసుకొచ్చి వంటగది వాకిలికి ప్రక్కగా పోసి, అవి కనబడకుండా వాటి మీద ఓ ఇనప పెనం పెట్టింది. ఈ పనులన్నీ చెయ్యగానే పిల్లలతో కలిసి ఇంట్లోంచి దూరంగా వెళ్ళిపోయి, ఏం జరుగుతోందో గమనించసాగింది.

బాగా రాత్రయ్యాక భూతానికి మెలకువ వచ్చింది. మేలుకోగానే దానికి నరమాంసం గుర్తుకు వచ్చింది. సీత-పిల్లలు తన ప్రక్కనే ఉన్నారనుకొని, అది గబుక్కున దిండ్లలోకి గోర్లను గుచ్చింది. తీరా చూస్తే అక్కడ ఉన్నవి ఒట్టి దిండ్లే! తను మోసపోయానని గుర్తించగానే, దానికి ఎక్కడలేని ఆవేశం వచ్చింది. ఒక్క ఉదుటన లేచి ముందుకు దూకబోయిన భూతం నేలమీద ఉన్న బఠానీలమీద కాలు వెయ్యగానే ఒక్కసారిగా జారింది. దభాలున క్రింద పడబోతూ, దాన్ని ఆపుకునే క్రమంలో మరింత గందర గోళపడి, రెండు పల్టీలు కొట్టి, నేరుగా పెనం క్రింద పెట్టిన నిప్పుల్లో పడింది. ఆ రకం భూతాలకు నిప్పు సరిపోదు- నిప్పుని ముట్టుకోగానే అది కాస్తా తన సొంత రూపాన్ని పొంది, చచ్చిపోయింది!

బయటినుండి దాన్ని గమనిస్తున్న సీత ఇప్పుడు తృప్తిగా ఊపిరి పీల్చుకొన్నది. పిల్లలూ, తనూ లోపలికి వచ్చి ఆ భూతపు శరీరాన్ని ఏం చెయ్యాలా అని ఆలోచించారు. దాన్ని అట్లా ఇంట్లో వదిలేసేందుకు వీలులేదు! సీత దగ్గర తను పుట్టింటినుండి తీసుకు వచ్చిన ఇనప భోషాణం ఒకటి ఉండేది. దానిలో అంత విలువైనవస్తువులేవీ లేవుగానీ, చూసేందుకు మటుకు అది గొప్పగా ఉండేది. ఇప్పుడు వీళ్ళు దాన్ని భూతం శరీరం దగ్గరికి లాక్కొచ్చి, అతి కష్టం మీద భూతం శరీరాన్ని దానిలోకి నెట్టి మూత వేసేశారు.

ఒక సారి ఆ పనయ్యాక, సీతకు చంద్రదీప్ గుర్తుకొచ్చాడు. భర్త ఏమయ్యాడోనని ఆందోళన మొదలైంది ఆమెకు. ఈ భూతం అతన్ని తినెయ్యలేదు గద, లేకపోతే అతని పోలికలు ఎలావచ్చాయి, దీనికి?!

వెంటనే ఆమె పిల్లల్ని వెంటబెట్టుకొని, చేతిలో ఓ లాంతరు పట్టుకొని, ఆ రాత్రి వేళనే అడవిలోకి బయలుదేరింది. సీత చాలా ధైర్యం గలది. అంతేకాక ఆమెకు అడవంతా కొట్టిన పిండి. నేరుగా ఆమె అడవి మధ్యలో సన్నటి వెదుళ్ళు ఉన్న పొద దగ్గరికి వెళ్ళేసరికి, అక్కడ నేలమీద పడి ఉన్న భర్త కనిపించాడు. ఆమె గబుక్కున వంగి చూసింది. చూడగా అతని శ్వాస ఇంకా ఆడుతూనే ఉన్నది. ఆమె తన చీర చెంగుతో భర్త ముఖం తుడిచి, అతన్ని మూడుసార్లు కొట్టేసరికి చంద్రదీప్ టక్కున తేరుకొని, లేచి కూర్చున్నాడు-"నా కొడవలి ఏది, వెదుళ్ళు కొట్టాలి" అంటూ.

"చాల్లే, ఇప్పటికే చీకటి పడింది- పోదాం పద" అని, భర్త చెయ్యి పట్టుకొని లేవదీసింది సీత. అందరూ‌కలిసి అడవి దాటి తెల్లవారు జాముకల్లా భద్రంగా ఇల్లు చేరుకున్నారు. ఇంటి పరిస్థితిని చూసి సీత నిర్ఘాంత పోయింది. మధ్య గదిలో తాము వదిలి వచ్చిన భోషాణం అదృశ్యం అయ్యింది!

నిజానికి జరిగిందేంటంటే, ఆ రోజున ఇంట్లో ఎవ్వరూ లేకపోవటం చూసి, నలుగురు దొంగలు ఇంట్లోకి ప్రవేశించారు. మధ్య గదిలో వాళ్లకోసమే పెట్టినట్లున్న భోషాణాన్ని చూసే సరికి వాళ్లకు ఎక్కడలేని సంతోషం కలిగింది. దాన్ని ఎత్తి చూసుకొని,"బరువుగా కూడా‌ఉందిరా!" అని మురిసిపోయారు వాళ్ళు.

అంతలో దూరంగా ఏదో అలికిడి అయినట్లనిపించి, వాళ్ళు నలుగురూ కూడబలుక్కున్నట్లు ఆ భోషాణాన్ని ఎత్తుకొని ఆయాసపడుతూనే గబగబా చాలా దూరం పోయారు. అక్కడ వాళ్ళు మూత తెరిచి చూసుకుంటే ఏముంది, కొమ్ములూ, కోరలూ పెట్టుకున్న పెద్ద భూతం బయటపడ్డది!

ఆ దెబ్బకు వాళ్ళలో ఒకడు అక్కడే మూర్ఛపోయాడు; మిగతా వాళ్లంతా‌ తలొక దిక్కుకూ పరుగు తీశారు. తర్వాత కొత్వాలు మనుషులకు మూర్ఛపోయినవాడూ, వాడిద్వారా మిగిలినవాళ్లూ అందరూ చిక్కారు. భూతం బెడద వదిలించటమే కాక, దొంగల్ని కూడా పట్టించినందుకు సీతకు రెట్టింపు సన్మానాలు చేశారు ఊళ్ళోవాళ్ళు!