ఇరవైరెండేళ్ళ రచయిత్రి సమంతా షానన్ గురించి పత్రికల్లో చదివాను ఈమధ్యే. ఆమె ఒక ప్రముఖ ప్రచురణ సంస్థతో ఏడు నవలలు రాయడానికి ఒప్పందం కుదుర్చుకోవడంతో చాలా పేరు తెచ్చుకుంది. పత్రికల్లో ఆమెని హ్యారీ పోటర్ నవలా రచయిత్రితో పోల్చడం కూడా కనబడ్డది. ఆమె గురించి, ఆమె తొలి పుస్తకం అచ్చవడం గురించి ఈ వ్యాసం.
1991లో పుట్టిన షానన్ బ్రిటన్ దేశస్థురాలు. అక్కడే పుట్టి పెరిగింది. ఇటీవలే ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి ఆంగ్ల సాహిత్యంలో డిగ్రీని పొందింది. 15 ఏళ్ల వయసులో మొదటిసారి 'అరోరా' అన్న నవల రాసింది. అది ప్రచురింపబడలేదు; కానీ ఆమెలో ఆ ఆసక్తి అలాగే ఉండింది. తరువాత 19 ఏళ్ళ వయసులో మళ్ళీ మరొక నవల రాసింది. పగలు కాలేజీకి వెళ్తూ, రాత్రుళ్ళు నవల మీద పనిచేస్తూ, నెలల తరబడి రాసింది. 'ఈసారి దీన్ని పుస్తకంగా చూడాలి' అనుకుంది.
కానీ, నవలల్ని ప్రచురించటం ఏమంత సులభమైన విషయం కాదు. 'ఎక్కే గడప-దిగే గడప' అన్నట్లు, చాలా మంది ప్రచురణకర్తల చుట్టూ తిరిగింది షానన్. ఎట్టకేలకు, ప్రముఖ ప్రచురణ సంస్థ 'బ్లూంస్బర్రీ' సమంతాతో ఏడు నవలల కాంట్రాక్టుకు ఒప్పుకుంది! అంటే, ఈ అమ్మాయి భవిష్యత్తులో రాయబోయే ఏడు నవలలను ఆ సంస్థే ప్రచురిస్తుంది, మార్కెట్ చేస్తుంది అన్నమాట. ఆ నవలలమీద వచ్చే లాభాలుగానీ, నష్టాలు గానీ అన్నీ ఆ సంస్థవే! ఆ కాంట్రాక్టును అనుసరించి ఆమె రాసిన మొదటి నవల "ది బోన్ సీజన్" ఇట్లా వెలువడిందో లేదో, చాలామంది దాన్ని కొన్నారట, చదివి మెచ్చుకున్నారట. భారత దేశంతో సహా మరో 20 దేశాల్లో ఈ నవల హక్కులు కొనుగోలు చేశారనీ, సినిమా హక్కులు కూడా కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నారనీ పత్రికల్లో రాశారు. మొత్తానికి బ్లూంస్బరీ సంస్థకు మంచి లాభమే రావచ్చు.
ఈ నవలలో కథ ఏంటి? 2059లో-లండన్‌నగరంలో-కథానాయకురాలు పందొమ్మిదేళ్ళ ఐరిష్ యువతికి- జరగబోయే విషయాలన్నీ ముందే తెలుస్తూ ఉంటాయి. (ఇట్లా మనకూ జరిగితే?!) అయితే ఇట్లా ముందుగా తెలీటం వల్ల ఆమెజీవితంలో ఎంతో గందరగోళం, మార్పులు వచ్చేస్తాయి. అదన్నమాట ఈ కథ. వాస్తవికతనూ, కాల్పనికతనూ ఆమె కథలో బలే తెలివిగా కలిపిందనీ, పాతకాలం నాటి ప్రముఖ ఆంగ్ల నవలాకారుల శైలిని గుర్తుచేసిందనీ, బ్లూంస్బరీ సంస్థ ప్రధానసంపాదకులు ఓ ఇంటర్వ్యూలో సమంతాను మెచ్చుకున్నారు.
ఈ నవల "ది బోన్ సీజన్" గురించి చెబుతూ సమంతా అన్నది:"నేను కథల గురించి ఆలోచించని క్షణం అంటూ అసలు లేనే లేదు. 'ది బోన్ సీజన్'లో ఉన్నదాంట్లో 90శాతం నా మెదడే. మిగిలిన పది శాతం బయటి ప్రపంచంతో దానికున్న సంబంధం " అని. మరి మనలోనూ చక్కర్లు కొడుతున్నాయిగా, లెక్కలేనన్ని కథలు? మనం కూడా చెయ్యాల్సింది, సమంతాలాగే వాటిని కాయితం మీద పెట్టటం. ఆ తర్వాత వాటిని వేరేవాళ్ళెవరైనా ప్రచురిస్తారో, మనమే సొంతగా ప్రచురించుకుంటామో మన ఇష్టం. ఏమంటారు? రాయటం మొదలు పెట్టెయ్యండి ఇక!