"ఒరేయ్! పిల్లలూ! ఈ రోజుతో 2013 పూర్తయి, 2014- అదేరా, కొత్త సంవత్సరం- మొదలవుతున్నది కదా?! ఇంకో 4 నెలల్లో మీరంతా పై తరగతులకు కూడా వెళ్ళ బోతున్నారు! మరి మీరు ఒక్కోరూ చెప్పండి- ఏమేం చదువులు చదవాలనుకుంటున్నారు, పెద్దయ్యాక ఏ ఏ ఉద్యోగాలు చేద్దా-మనుకుంటున్నారు? కొత్త ఏడాదిని కొత్త ఆలోచనలతో మొదలెట్టాలిగా, మరి?! ముందుగానే మీ లక్ష్యాలను నిర్ణయించుకుని, ఆ వైపుగా అడుగులు వేయాలి. రామూ! నువ్వు మొదలుపెట్టు, ముందు!" పెద్ద పంతులుగారు రామూ వైపు చూడగానే వాడు లేచాడు-
"మా నాయనగారు నన్ను ఒక పెద్ద డాక్టర్‌ను చేయాలనుకుంటున్నారు పంతులుగారూ! అట్లా అని ఆయన రోజూ మా అమ్మతో అంటుంటారు”
అవునా! ఆయన అట్లా ఎందుకు అనుకుంటున్నారో తెల్సా, నీకు?"
"పంతులుగారూ! డాక్టరైతే, ఎంచక్కా బోలెడంత డబ్బు సంపాదించవచ్చుటండీ! ఒట్టి కడుపునొప్పితో వచ్చినవాళ్ళకైనా సరే, ఆపరేషన్ చేసి, వేలకు వేల రూపాయల బిల్లు వేయవచ్చట! అందుకని మా నాన్న నన్ను డాక్టర్‌ను చేసి, నేను సంపాదించే డబ్బుతో నగరంలో పెద్ద బంగళాలు కట్టిస్తారట!" నిజాయితీతో చెప్పాడు రాము.
"ఓహో! మరి నీ మాటేంటి , మాధవ్?!"
"పంతులుగారూ! మా నాయన నన్ను పెద్ద లాయర్‌ను చేసేస్తారట"
"అవునా! బాగుంది బాగుంది! ఎందుకో తెలుసా, నీకేమన్నా?”
"ఓ! లాయరైతే ఒక్కో కేసూ ఐదు నుంచీ పదేళ్ళు నడిపి, ఊరికే బోలెడంత ఫీజు వసూలు చేసేయొచ్చు! చాలా డబ్బులు వస్తాయి. దాంతో మేం చక్కని పెద్దపెద్ద మేడలు కట్టుకోవచ్చు!" చేతులు త్రిప్పుతూ అమాయకంగా చెప్తున్న మాధవను చూసి నవ్వారు పంతులుగారు. "మరి నీ సంగతేంటి ఆనంద్?" అన్నారు.
ఆనంద్ లేచి "పంతులుగారూ! మా నాయన నన్ను ఇంజనీర్‌ను చేస్తారుట! బిల్డింగులూ, ప్రాజక్టులూ కడితే దొంగడబ్బు కూడా చాలా వస్తుందట. సిమెంటుకు బదులు బూడిద, ఇంకా ఏవేవో కలపవచ్చట.. ఇంకా.." సిగ్గుపడుతూ తలవంచుకున్నాడు వాడు. "చెప్పవోయ్! సిగ్గెందుకూ?.." అని ప్రోత్సహించారు పంతులుగారు.
"మరీ.. మరీ.. నా పెళ్ళప్పుడు మరింత కట్నం తీసుకోవచ్చట పంతులుగారూ!" అన్నాడు వాడు. తరగతిలో పిల్లలంతా ఫక్కున నవ్వారు.
"సరి సరి. మరి నీమాటేంటి, వాసూ?"
"పంతులుగారూ! మా అమ్మ నన్ను ఒక పెద్ద పోలీసాఫీసర్‌ను చేస్తుందిట! అప్పుడు ఎంతో మంది నన్ను చూసి భయపడతారట! తమ మీద కేసులు తప్పించమని చెప్పి చాలామంది డబ్బులు కూడా తెచ్చిఇస్తారట!" చాలా ఉత్సాహంగా చెప్పాడు వాసు.
"అబ్బో పోలీసాఫీసర్! సలాం!" అంటూ ఎగతాళి చేశారు పిల్లలంతా.
"మరి నీ సంగతేంటిరా, నాగరాజూ?"
"పంతులుగారూ ! ఈ చదువులేవీ నా వంటికి పడవంటండీ! అందుకని కాస్త హైస్కూల్ దాకా వచ్చాక, మానాయన చేసే సరుకుల వ్యాపారం నాకు అప్పజెపుతారటండి! బియ్యంలో ఎంత చెత్త కలపచ్చో, ఎన్ని రాళ్ళు కలపచ్చో అప్పుడు నేర్పిస్తారట! నూనెలో కూడా బాగా కల్తీ చేయవచ్చు! ఏ ఉద్యోగం చేసినా ఇంత లాభం రాదట అయ్యవారూ!" అన్నాడు నాగరాజు. తర్వాత మరికొందరు అబ్బాయిలు కాంట్రాక్టర్లం అవుతామనీ, కొందరు మంత్రులం అవుతామనీ- ఇట్లా రకరకాలుగా చెప్పారు.
"ఇక అమ్మాయిల వంతు- అమ్మా, లావణ్యా! నీ ఆలోచన ఏంటో చెప్పు, మీ అమ్మానాన్నలు నిన్ను ఏం చదివిస్తారట?”
"పంతులుగారూ! నాకు హైస్కూల్ వరకూ చదువు చెప్పించి, అటుపైన పెళ్ళిచేసేస్తారుట. అమ్మాయిలు ఎక్కువ చదువుకో-కూడదటండి!" చెప్పింది లావణ్య.
ఇలాగే మరి కొంత మంది అమ్మాయిలు చెప్పాక- సుగుణ లేచి నిల్చుని చెప్పసాగింది: "పంతులుగారూ! మా అమ్మా-నాన్నా నన్ను ఒక మంచి టీచరును చేయాలను-కుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు పిల్లలకు చాలామందికి మానవతా- విలువలైన సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలు తెలీవుట. అందుకని వాళ్లంతా పెద్దయ్యాక అబద్ధాలు చెప్తున్నారట; అన్యాయాలు చేస్తున్నారట; లంచాలు తీసుకుని, మోసాలు చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారుట.
చిన్నతనంలోనే, ప్రాధమిక పాఠశాలలోనే మంచి అలవాట్లు నేర్పితే, సమాజం మొత్తం బాగుపడుతుంది కదా; ఇప్పుడు జరిగే అన్యాయాలన్నీ ఆగిపోతాయి! అందుకే మా అమ్మా నాన్నా నన్ను మంచి టీచరుగా తీర్చి దిద్దుతామనేది. పెద్దయినాక నేను పిల్లలందరికీ మంచి నేర్పాలట!" అన్నది.
పంతులుగారు చప్పట్లు కొట్టారు. "చూడండి పిల్లలూ, సుగుణవాళ్ళ అమ్మానాన్నల ఆలోచనలు ఎంత గొప్పగా ఉన్నాయో చూశారా? మీరందరూ మంచివాళ్ళయి, తోటివారికి, పేదలకు సాయం చేస్తూ సమాజానికి మేలు చేస్తే అంతా సుఖ సంతోషాలతో ఉంటారు కదా! ఏం చదువుకున్నా, ఏ వృత్తి చేపట్టినా న్యాయంగానే చేయాలి. గాంధీ మహాత్ముడు 'లాయరే కదా, అయినా ఆయన ఎన్నడూ అసత్య వాదనలు చేయలేదు. సత్యంగా ‘అహింసా పరమో ధర్మః' అనే సూక్తిని పాటించి స్వతంత్య్రం సాధించాడు.. మరి మీరంతా..." అంటున్న పంతులుగారు మాట పూర్తిచేయకుండానే, పిల్లలంతా ఒక్క గొంతుగా అరిచారు- " అర్థం అయ్యింది పంతులుగారూ! ఈ నూతవ సంవత్సరం నుండీ మేమంతా మంచితనం కోసం పాటు పడతామని, మానవతా విలువలు పాటిస్తామని ప్రమాణం చేస్తున్నాం. సత్య మార్గాన్నే అనుసరిస్తాం, ప్రామిస్!" అని.