చక్రవాక మంత్రి సర్వజ్ఞుడు హంసరాజుతో "ప్రభూ! ముందుగా మన వీరుల బలాబలాలను పరీక్షించాలి; ఎవరికి తగినట్లు వారిని సన్మానించాలి. దానివల్ల వాళ్లకు ఉత్సాహం కలుగుతుంది; ప్రాణాలను కూడా లెక్కించనంత ధైర్యం వస్తుంది. దానం కంటే కూడా సన్మానమే వెయ్యిరెట్లు ఎక్కువ ఫలాన్నిస్తుంది- సన్మానమే అన్ని విధాలుగా మేలు. సమర్థులైన సైనికులను వారి పనితీరుకు తగినట్లు సన్మానించటాన్ని మించిన పని రాజులకు మరేదీ లేదు" అన్నది.
వెంటనే మంత్రి మాటను అనుసరించి హిరణ్యగర్భుడు తన సైనిక బృందాలను వెంటనే అక్కడికి పిలిపించి, బహుమతులు ఇచ్చి, బాగా ఉత్సాహపరచి, వాటినన్నిటినీ యుద్ధానికి ప్రేరేపించింది. అంతలోనే దూరంగా దుమ్మురేపుకుంటూ వస్తున్న శత్రుసైన్యం అందరికీ కనబడింది.
అప్పటివరకూ ఉరికే కూర్చున్న టక్కరి కాకి నీలవర్ణుడు సమయం మించిపోతున్నట్లు వచ్చి హిరణ్యగర్భుడి ముందు నిలబడి, "ప్రభూ! ఈ సేవకుడి పలుకులనూ కొంచెం దయతో వినండి. నా అభిప్రాయాన్ని పలచనగా చూడకండి. ఈ చిన్న విన్నపాన్ని వినండి- అదిగో, శత్రువు కయ్యం కోసం కాలు దువ్వుతూ మన కోట వాకిలి దగ్గరికి వస్తున్నాడు. అతడు మన కోటనుండి బయటికి పోయే దారిని ఎక్కి వచ్చాడంటే, మనం అందరం కాళ్ళు తెగినట్లు ఇక్కడే ఉండి పోయి, ఊరూ పేరూ లేని వాళ్ల మాదిరి చావాల్సి వస్తుంది.
ఈ సమయంలో నన్ను ఖాళీగా ఉంచకండి. 'పంపవచ్చు-పంపరాదు' అనే అనుమానాన్ని విడచి, నన్ను తమరి ఇష్టం వచ్చిన పనికి పంపండి. తమరి ఆజ్ఞ అయిందంటే నాకు ఎదురైన ఈ గోరువంకల గుంపును నేను అస్సలు లక్ష్యపెట్టకుండా ముందుకు దూసుకుపోతాను. ఇవేవో నేను కండకావరంతో మాట్లాడే పిచ్చి మాటలు అనుకోకండి. నేను యుద్ధంలో పోరాడే-టప్పుడు ఎదురువచ్చిన శత్రువులందరూ ఎట్లా చస్తారో; ఏవిధంగా చెల్లాచెదరై పారిపోతారో తమరు స్వయంగా చూడగలరు.
నా మాటను ఈ ఒక్కసారికీ మన్నించి చూడండి- వడ్డీతో సహా నా రుణాన్నంతా ఆ మొరటు శత్రువులచేత కక్కిస్తాను; ఆ విధంగానైనా తమరి రుణం నుండి విముక్తుడినౌతాను- సరేనన్నట్లు కనీసం తమరి కనుబొమ్మను ఓమారు కదల్చండి- చాలు" అన్నది.
చక్రవాకమంత్రి సర్వజ్ఞుడు ఆ మాటలకు ముఖంలో నవ్వు కాని నవ్వును పులుముకొని, వెటకారంగా- "ఔనౌను. నువ్వు ఎంతకైనా సమర్ధుడివే. ఊరికే శ్రమపడకు; ఇంతటితో చాలించుకో. 'ఏమి చేయచ్చు; ఏమి చెయ్యకూడదు' అనేది తెలీక ఊరికే మాటలు ప్రేలటమే తప్ప, నీకు బుద్ధి అణువంత కూడా ఉన్నట్లు లేదు. ఎప్పుడూ నువ్వు 'యుద్ధం-యుద్ధం' అనే కలవరిస్తూ వస్తున్నావు. ఇదిగో ఇవాల్టికి అది నిజమైంది. నువ్వే దీనికంతటికీ కారణం. నిష్కారణంగా ఈ వైరాన్ని పెంచుతూ వచ్చింది అసలు నువ్వే. దీనివల్ల మా అందరి మీదా ప్రళయం విరుచుకు పడుతుంది గానీ, నీ ఒక్కడితోటీ పోయేది కాదిది.
యుద్ధం అంటే ఏంటో తెలీనివాళ్ళు ఇంటి దగ్గర ఎన్నో బీరాలు పలుకుతారు కానీ, నిజంగానే గాలి అటు మళ్ళి పోరాడాల్సి వస్తే చూడాలి- వాళ్ల క్రింది దవడల కీళ్ళు పడిపోతై; ఇక నోట్లోంచి మాట పెగలదు. నేను చెప్పే మంచి మాటలను తక్కువగా చూడకు- నీ దుర్మార్గ పు బుద్ధిని కట్టిపెట్టు. కొంచెం మంచివాడివవ్వు!" అని, రాజువైపుకు తిరిగి "ప్రభూ! ఈ మోసగాడి గొప్పలు అన్నీ నిజం అనుకొని, మన గౌరవాన్నీ, ప్రాణాలనూ కోల్పోవటం మంచిది కాదు. వీడికి బాగా క్రొవ్వెక్కి, నోటికి వచ్చినట్లల్లా కూస్తున్నాడు తప్పిస్తే, ఏ కొంచెం కూడా పనికి రాడు. జాగ్రత్తగా చూస్తే వీడు స్నేహితుడి వేషంలో చరిస్తున్న శత్రువు.
తమరు మంచితనానికి పోయి, ఈ మోసగాడి శుద్ధ దండగమారి సేవలను కూడా తియ్యతియ్యగా వర్ణిస్తుంటారు. ఈ దుర్మార్గుడి మాటలను కొంచెం కూడా చెవిన వేసుకోకూడదు. మన సైన్యం ఈ కోటను విడిచి బయటికి వెళ్లిందంటే, ఇక మనం అసలు కోటలోకి చేరిన ప్రయోజనమే నెరవేరదు- దీనికోసం మనం పడ్డ శ్రమ అంతా కూడా పూర్తిగా నిష్ప్రయోజనం అవుతుంది.
'నీళ్లలో ఉండి ఏనుగును కూడా పీనుగును చేయగల్గిన మొసలి, ఆ నీళ్ల బయట ఉన్నప్పుడు కుక్క పాటి కూడా చేయదు -అదంతా స్థానభ్రంశం వల్లనే కదా? కోట బయటికి వెళ్ళినట్లయితే యుద్ధంలో మన గువ్వలన్నీ గవ్వకు కూడా కొరగావు. ఈ నీలవర్ణుడు అనుకూల శత్రువు. వీడి మాటలు తమరి చెవులకు అమృత సమానాలుగా తోస్తున్నట్లున్నది- అందుకే తమ మతికి అవే సరయినవి అనిపిస్తున్నాయి. ఇంతకీ మనవాళ్లకు కాలం మూడినట్లున్నది; అందుకే మీ మనసులో ఈ మోసపు మాటలు వాటంగా నాటుకుంటున్నాయి.." అంటూ ఇంకా ఏదో చెప్పబోయిన మంత్రి మాటలకు అడ్డం వచ్చింది కాకి.
ఆ సరికి దానికి అర్థమైంది- 'హిరణ్యగర్భుడు తన మీద 'నమ్మకం' అనే ఉరిలో ఇప్పుడు పూర్తిగా చిక్కుకొని ఉన్నాడు' అని! అందుకని అది మనసులో సంతోషిస్తూ, సర్వజ్ఞుడిపై కోపంతో విరుచుకుపడింది:
హంసరాజుతో అన్నదది: "మహారాజా! నా మాటలను తక్కువ చేయక, తమరి దివ్య చిత్తంలో కొద్దిగా తావిచ్చి వినండి. ఈ సర్వజ్ఞుడు మేకవన్నె పులి. మనకు ఏమైనా సరే, తన ప్రాణాలను మాత్రం కాపాడుకుందామని వీడి ఆశ- అందుకనే ఇప్పుడు ఇన్ని పోకడలు పోతున్నాడు. వీడు మన దగ్గర ఉంటే మన ఒళ్ళో పాము ఉన్నట్లే.
అసలు ఇతను యుద్ధానికి రాకపోవటమే మేలు. ఇతను ఒక్కడూ లేనంత మాత్రాన మనకేమీ కొరత రాదు. బాసికాలు దాచినంత మాత్రాన పెళ్ళి ఆగుతుందా? ప్రభువులవారి ముందు గొప్పలు చెప్పుకోకూడదు గాని, తమరికి గెలుపు సాధించి పెట్టేందుకు నేను ఒక్కడినీ చాలు. నా గొప్పతనాన్ని చూడలేక, లేని తక్కువ తనాన్ని నామీద మోపి, నన్ను తిడుతున్నాడు వీడు.
అయ్యో, వినేందుకు ఇది ఎంత రోతగా ఉన్నది! నిజంగా చూస్తే ఇవన్నీ నన్ను దగ్గరివాడుగా భావించి ఆదరిస్తున్న ప్రభువులవారిని అనటమే తప్ప, నన్ను అనటం అవుతుందా?! ఇతనివంటి సేవకులకు ఎట్లానో తెలీదుగాని, శరీరంలో పిరికి కండ లేని ధీరులకు ప్రాణాలకంటే అభిమానాలే ఎక్కువ. ఆత్మ గౌరవమే ప్రాణాలకంటే అధికం. అందువల్ల లోకంలో అభిమానవంతులు నీచపు పనులకు తల ఒగ్గరు. ప్రాణాలనైనా వదులుతాను గానీ, ఆత్మగౌరవాన్ని విడచిపెట్టి లోకంలో 'పిరికి పంద' అనే అపవాదును మోసుకోలేను.
కుండను మూసేందుకు మూకుళ్ళు కావాలంటే దొరుకుతాయి గానీ నోటిని మూసేందుకు మూకుళ్ళు ఎక్కడా దొరకవు. సమయం వచ్చినప్పుడు ప్రాణాలు కాపాడుకొని, ప్రళయ కాలం వరకూ ఈ గొప్పాయనే బ్రతుకుతాడేమో మరి, బ్రతకనివ్వండి!" అని, మోసపు నవ్వు ఒకటి నవ్వుతూ "ఆహాహా! వీడి మాటల్ని నమ్మాలట! మన గువ్వలట, కోటను దాటి బయటికి వెళ్తే గవ్వకు కూడా కొరగావట! కొద్ది రోజుల క్రితమే అనంతమైన శత్రు సైన్యాల మీద పడి, ఊచకోత కోసి వచ్చిన మన సైన్యం ఇప్పుడు ఈ కొద్దిపాటి సైన్యానికి ఎదురొడ్డి నిలువవట! దీన్ని మించిన అపహాస్యం వేరే ఏముంటుంది? పనికిమాలిన ఈ అనుమానాలన్నిటినీ కట్టిపెట్టి, సైన్యంతో సహా బయటికి ఉరికి, ఇప్పటికే చచ్చి ఉన్న ఆ కొద్దిపాటి శత్రు మూకలనూ తుదముట్టించి వద్దాం" అంటూ శూలాల్లాంటి మరిన్ని పొడుపులతో ఆ చక్రవాకాన్ని పీడించి, హంసరాజుకు పొగరు ఎక్కించింది.
ఈ విధంగా నీలవర్ణుడితోబాటు విధి కూడా తనను ప్రేరేపించినట్లయి, "ఇది నీళ్ళలోని ముల్లు" అనీ, "ఇట్లా అనిశ్చితితో ఊరికే కాలాన్ని వృధా చెయ్యరాదు" అనీ కొంచెం సేపు ఊగిసలాడి కూడా, చివరికి ఆ హంసరాజు ఊరకే ఉండిపోయింది.
దాంతో నీలవర్ణుడికి కూడా హంసరాజునుండి పూర్తి అంగీకారం దొరకలేదు. అయినా అది ఆవేశాన్ని నటిస్తూ తన చేతికి అందినంత సైన్యాన్ని వెంట బెట్టుకొని కోట వెలుపలికి పరుగు పెట్టి, శత్రుసైన్యంతో తలపడింది.
ఇదంతా చూసి, అక్కడ చేరిన పక్షులన్నీ రహస్యంగా తమలో తాము గుసగుసలు పోవటం మొదలు పెట్టినై. చక్రవాక మంత్రి సేనాపతిని సమీపించి "నీలవర్ణుడితో స్నేహాన్ని మాన్పించటంకోసం మన రాజుతో నేను ఏమేం అనాలో అవన్నీ అనేశాను. నేను ఎంత చెప్పినా తన దారిని విడువక, మన రాజు "నేను పట్టిన పిట్టకు నాలుగు కాళ్ళు" అనే అంటున్నది. మన మీదికి నింద రాకుండా, చేతనైనంత వరకూ మనం నిలిపి చూశాం. ఇక మీద దేవుని చిత్తం ఎలా ఉంటే అలా జరగక మానదు. మనకి కాలం-కర్మం కలిసి రాకపోతే మన రాజుకు మంచి బుద్ధి ఎలా పుడుతుంది? మన రాజుకు క్రొత్తవాళ్లే తనవాళ్ళు. మనం అందరం పరాయి వాళ్లం!" అన్నది.
ఆ విధంగా మాట్లాడుకుంటూనే, దగ్గరగా వస్తున్న హంసరాజుని చూసి, కళ్లతోటే సైగలు చేసుకుంటూ, ఏదో యుద్ధోత్సాహంతో పని చేస్తున్నట్లు నటించటం మొదలు పెట్టాయి పక్షులన్నీ.
అంతలోనే తెల్లని తన రెక్కల కదలికవల్ల పుట్టిన గాలి వేగానికి రేగిన దుమ్ము భూమిని, ఆకాశాన్ని కప్పివేస్తుండగా గొప్ప కోపంతో, ఆవేశంతో ఒళ్ళు తెలీనట్లు యుద్ధం చేసేందుకు పరుగున వచ్చింది హంసరాజు. కళ్ళలో నిప్పు కణాలు వెలువడుతుండగా అది శత్రుసమూహాల ఎదుట నిలబడ్డది. ఆ వెనుకనే హిరణ్యగర్భుడి సేనా సమూహాలు ఆకాశం దద్దరిల్లేట్లు ఒకళ్లనొకళ్ళు ముందుకు రమ్మని పిలుచుకుంటూ, సింహాల్లాగా గర్జిస్తూ, ముందుకురికి, శత్రు సైన్యంతో తలపడ్డాయి.
వాళ్లలో దీర్ఘముఖుడు మొదలైన కొంగలు మునుపటి తమ పగను గుర్తుకు తెచ్చుకొన్నాయి. రోషంతోటీ, ఆవేశంతోటీ ప్రాణాలకు తెగించి శత్రు సైన్యం లోనికల్లా చొరబడ్డాయి. దారుణమైన గోళ్లతో రక్తం వచ్చేట్లు గీకుతూ, పొడుస్తూ, అతి కఠినమైన కాళ్ల దెబ్బలతోటీ, పిడికిలి గ్రుద్దులతోటీ, శత్రువులను ఘోరంగా నొప్పించాయి. అద్భుతమైన ఆ చర్యతో నెమలి రాజు సైన్యాలన్నీ నశించి, 'కేవలం కొన్ని పక్షులు మాత్రమే ప్రాణాలతో మిగిలినాయా' అనిపించింది. అంతలోనే- తను కూడా ఒక విధమైన ఎగిరే పక్షే కదా, అందుకని- "ఈ పక్షుల దారుణ మరణాన్ని నేను చూడలేను" అన్నట్లు సూర్యుడు అస్తమించాడు. పడమటి కొండల మరుగుకు పోయి దాక్కున్నాడు. చిరుచీకట్లు కమ్ముకుంటున్న ఆ సమయంలో పక్షుల గుంపులన్నీ యుద్ధాన్ని చాలించి తమ తమ ఇళ్ళకు పోయినై.
ఆ రాత్రికి అన్నీ నిద్రపోయి మరునాడు ఉదయం తిరిగి యుద్ధాన్ని మొదలు పెట్టాయి పక్షులు. ఆనాడు సాయంత్రం ఇంకా యుద్ధం భీకరంగా జరుగుతుండగానే, ఒంటరిగా కోటలోకి చొరబడింది కాకి- మేఘవర్ణుడు. మండుతున్న కట్టెపుల్ల ఒకటి దాని ముక్కున... ! (తర్వాత ఏమైందో..?!)