“సంధ్యా! టీవీ చూసింది చాలు, భోంచేద్దువు రా!” అమ్మ వంటింట్లోంచి కేక పెట్టింది. నాకు ఇష్టమైన షో వస్తోంది టీవీలో .
“ఐదు నిమిషాలు మమ్మీ!” సమాధానం ఇచ్చాను నేను.
“సమయానికి తినకపోతే ఆరోగ్యం పాడవుతుందమ్మా!” అంటూ అమ్మ వచ్చి టీవీ ఆపేసింది.
నేను కోపంగా డైనింగ్ టేబుల్ దగ్గరకి వచ్చి కూర్చున్నాను.
'ఛా! ఈరోజు షో ఎంత బాగుందో! నాకు ఆకలి కూడా లేదు. నేను భోంచేయకపోతే అమ్మకి ఏమిటట?' విసుక్కుంటూ వేడి వేడి అన్నం గబగబా మింగేసి టి.వి పెట్టాను. అయితే ఆస రికే షో పూర్తి అయిపోయింది.
“సంధ్యా! చదువుకోమ్మా!” పెద్ద గొంతుతో అరిచింది అమ్మ. నాకు తిక్క రేగింది. 'పొద్దున నిద్ర లేచినప్పటినుండి రాత్రి పడుకునే వరకూ ఈ గోలే!' అమ్మ మాట వినకుండా నేను నా గదిలోకి వెళ్ళి నిద్రపోయాను.
మాది మదనపల్లె. నేను బోర్దింగ్ స్కూల్లో చదువుకుంటున్నాను. సెలవలని ఇంటికి వచ్చా. అమ్మ ఎప్పుడూ చదువుకోమని ప్రాణం తీస్తుంది. నాన్న ఏదో ఒక పని మీద ఉంటాడు. నాకు టీవీ షోలంటే భలే ఇష్టం. కానీ అమ్మ వాటిని పూర్తిగా చూడనివ్వదు.
'రేపు మా దూరపు బంధువుల పెళ్ళికి అమ్మ-నాన్న వెళుతున్నారు. నా అదృష్టం బాగుంది- నన్ను రమ్మని అడగలేదు. రేపంతా హాయిగా టీవీ చూడొచ్చు' అని సంతోషపడుతూ నిద్రపోయాను.
పొద్దున ఎనిమిది గంటలకు గడియారం పాటకి నిద్ర లేచాను. ఆవలిస్తూ బాత్ రూమ్‌కి వెళ్ళి పళ్ళు తోముకుని, ముఖం కడుక్కుని సోఫాలో కూర్చుంటూ "అమ్మా! కాఫీ!” అని అరిచాను. ఎవరూ పలకలేదు.
“మమ్మీ! కాఫీ పెట్టావా?” ఇంకోసారి అడిగాను. అయినా సమాధానం రాలేదు. "ఏమైందబ్బా ......?” అనుకుంటుంటే పెళ్ళి సంగతి గుర్తుకొచ్చింది. నా నిద్ర మత్తు అంతా ఠకీమని ఎగిరి పోయింది. 'ఈరోజంతా నా ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చ' అని భలే ఆనందం వేసింది.
ఇంటి ముందర పడిన వార్తా పత్రికను తెచ్చుకుని కాసేపు పేజీలు తిరగేశాను. నెట్ ఓపెన్ చేసి కాసేపు మెయిల్స్ చూసుకున్నాను. హోం వర్క్స్ గురించిన మెయిల్స్ ఉన్నాయి. 'అబ్బ! స్కూల్ కి వెళ్ళే ముందు వీటిని చూద్దాంలే' అనుకుని నెట్ మూసేసి వంటింట్లోకి వెళ్ళాను. రాత్రి అమ్మ కలిపి పెట్టిన దోశ పిండితో పెనం మీద ఓ దోశ పోశాను.
ఇంతలో 'పోస్ట్' అని కేకతో పాటు ఓ ఉత్తరాన్ని తలుపు దగ్గర పడేసి వెళ్ళిపోయాడు పోస్టుమాన్. నేను తలుపు తీసి ఉత్తరం చూశాను. నాన్నకి ఉత్తరం వచ్చింది. దాన్ని టేబుల్ మీద పెట్టాను. ఏదో మాడుతున్న వాసన. పెనం మీద వేసిన దోశ గుర్తొచ్చి వంటింట్లోకి పరిగెత్తాను. మాడిన వాసన భరించలేక ముక్కు మూసుకుని స్టవ్ ఆఫ్ చేశాను. పెనం మీద దోశ నల్లగా నిగనిగ-లాడుతోంది. నిట్టూరుస్తూ దానిని చెత్త కుండీలో వేశాను. 'అమ్మ చక్కగా దోశలు పోసి, కొసరి కొసరి వేస్తుంటే కమ్మకమ్మగా లాగించేదాన్ని కదా!' అనుకున్నాను.
'ఆకలేస్తోంది బాబోయ్!' అనుకుంటూ మ్యాగీ పొట్లాన్ని తీసుకుని దాన్ని చేసుకున్నాను. అది బాగా కుదిరింది. వేడి వేడిగా నూడిల్స్ తింటూ టీవీ చూద్దామని ప్లేట్ తీసుకుని వచ్చి సోఫాలో కూర్చున్నాను. పాదాలపై ఏదో ఉందనిపించి చూద్దును కదా, కాలి మీద బొద్దింక!!
“బొద్దింక! బొద్దింక!” అంటూ పెద్దగా అరిచి కాలు విదిలించాను. అది కాలు మీద నుండి జారి నేల మీద పాకుతూ పోతోంది. 'ఇప్పుడు అమ్మ ఉంటే ఆ బొద్దింకని బయట పారేసి ఉండేది కదా!' అనుకున్నాను దాని వైపే భయంగా చూస్తూ.
గబగబా తినేసి స్నానం చేసి 'హాయిగా టీవీ చూద్దాం' అనుకుంటుండగా బయట నుండి పాలాయన కేకేశాడు. తింటూనే వెళ్ళి తలుపు తీశాను.
“పొద్దున్నే పిలిస్తే పలకలేదు ఎవురూ. మళ్ళీ వచ్చా. తొందరగా గిన్నె తే పాపా!" అన్నాడు హడావుడి పడుతూ.
పాలు పోయించుకుని ఫ్రిజ్ లో పెడుతుంటే 'ట్రింగ్! ట్రింగ్!' మంటూ ఫోన్ మోగింది. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఫోన్ తీశాను. “జ్యోత్స్నా! ఎలా ఉన్నావు?” అని ఫోన్ లోంచి ఎవరో పెద్దగా మాట్లాడుతున్నారు.
“రాంగ్ నంబర్!" అంటూ ఫోన్ పెట్టేశాను. మళ్ళీ మోగింది. ఎత్తితే మళ్ళీ అదే గొంతు. “జ్యోత్స్నా! నేను - గుర్తు పట్టలేదా?” అంటూ. “రాంగ్ నంబర్ అండీ!" విసుక్కున్నాను.
అది మళ్ళీ రింగ్ అవుతుంటే కోపంగా ఫోన్ వైర్లు పీకేశాను.
'ఇంతకు ముందు నాకీ సమస్య ఎప్పుడూ రాలేదు. ప్రతి కాల్ అమ్మ ఎత్తేది. ఇలా రాంగ్ కాల్స్ వస్తున్నా అమ్మ నెమ్మదిగానే ఉండేది ఇలా వైర్లు పీకేది కాదు...' నా ఆలోచనల్లో నేనుండగా డోర్ బెల్ మోగింది. చూస్తే కూరగాయలతను.
“మీరు తెమ్మన్న వంకాయలు, కాకరగాయలు, టమాటాలు, నిమ్మకాయలు తెచ్చానమ్మా. బీరకాయలు మాత్రం దొరకలా!" అన్నాడు. బ్యాగ్ తీసుకుంటుంటే "మొత్తం 78 రూపాయలు అయిందని అమ్మతో చెప్పు పాపా!" అన్నాడు.
“అమ్మ లేదులే, నేనే ఇస్తా ఉండు!" అని బీరువాలోనుండి డబ్బులు తీసి ఇచ్చా.
“కూరలన్నీ ఫ్రిడ్జిలో పెట్టమ్మా పాపా" అంటూ అతను డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు.
'నన్ను చూస్తే కూరలు ఫ్రిడ్జిలో పెట్టనేమోనని అతనికి ఎందుకనిపించిందో? ఈరోజుల్లో పిల్లలందరూ ఇలాగే ఉన్నారేమో!!! ఏమిటి ఈ రోజు నాకు ఇన్ని ఆలోచనలు కలుగుతున్నాయి? ఒంటరిగా ఉండటం వల్లనా?'
కూరగాయలన్నీ ఫ్రిడ్జిలో పట్టలేదు. దానిలో సామానంతా తీసి సర్దితే కూరలన్నింటినీ పట్టించగలిగాను. 'హమ్మయ్య! ఇక స్నానం కుదరదులే, టీవీ షో మొదలయ్యే టైము అయ్యింది' అనుకుంటూ టీవీ ఆన్ చేయబోయా. అంతలోనే మళ్ళీ డోర్ బెల్ మోగింది. విసుక్కుంటూ వెళ్ళి తలుపు తీశాను.
“అమ్మ ఉందా బుజ్జీ!" అంటూ ఒకావిడ నన్ను తోసుకుంటూ లోపలకి వచ్చింది. ఆమె వెనకాల పెద్ద గ్రూపు ఉంది. అందరూ పట్టు చీరలు, నగలతో పెళపెళలాడుతున్నారు.
“లేదాంటీ - పెళ్ళికెళ్ళారు!" అన్నాను.
“మా అమ్మాయి పెళ్ళి- వచ్చే మంగళ బుధవారాల్లో. కార్డు ఇవ్వడానికి వచ్చాం!" అంటూ కార్డు తీసి ఇచ్చిందావిడ. వాళ్ళు ఎవరో తెలియకపోయినా తల ఊపాను.
మధ్యాహ్నం దాటి పోయింది. వంట చేసుకుని తినే ఓపిక లేక, పాలు తీసి వేడి చేసుకుని తాగాను.
ఇంతలోనే మళ్ళీ ఎవరో తలుపు తడుతున్నారు. తీశాను- నీరసపడిపోతూ.
వచ్చింది చాకలి. చేతిలోని ఇస్త్రీ మూటతో లోపలకి వచ్చి మూటని హాల్లో కింద పెట్టి యముడు చిత్రగుప్తుడిని లెక్క చూడమన్నట్లు "లెక్క చూడమ్మా!" అన్నాడు.
పద్దు పుస్తకం కోసం వెతుకుతున్న నన్ను చూస్తూ "పాపా! చూస్తా ఉండాది లెక్కల పుస్తకం కోసమేనా?! - అదిగో, ఆ టివి కిందేసిన గుడ్డ ఉళ్ళా - దాని కింద చూడు ఉంటది!" అన్నాడు.
'నాకు తెలియని విషయాలు బయటివాళ్ళకి బాగా తెలుసే' అని నవ్వుకుంటూ పుస్తకం తీసి లెక్క చూశాను.
చాకలి వెళ్ళిపోయాక అలసటతో, ఖాళీ కడుపుతో అలాగే సోఫాలో పడి నిద్రపోయాను.
“సంధ్యా, లేమ్మా! " అని అమ్మ నన్ను నిద్ర లేపింది.
“వచ్చేశావా మమ్మీ" అంటూ అమ్మని గట్టిగా కౌగలించుకున్నాను. “మమ్మీ! ఈరోజు నేనస్సలు టీవీ చూడలేదు. ఎప్పుడూ ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు. పైగా ఫోన్ కాల్స్! నువ్వు రోజూ ఎన్ని పనులు చేయాలో ఇప్పుడు నాకు తెలిసింది. నువ్వు ఈ పనులన్నీ చేసుకుంటున్నావు కాబట్టే, నాకు అన్నీ చక్కగా జరిగిపోతున్నాయి. నీవల్లే టివి చూడటానికి టైమ్ దొరుకుతోంది. ఇదంతా తెలుసుకోకుండా, నీమీదికే ఎగిరిపడు-తుంటాను. ఇప్పుడు బుద్ధి వచ్చింది. ఇంకెప్పుడూ విసుక్కోను - నువ్వు చెప్పిన మాటల్లా వింటాను!" అన్నాను.
అమ్మ చిరునవ్వు నవ్వింది. ఆ నవ్వులో చాలా అర్థం తోచింది నాకు .