అనగా అనగా ఓ వసంతకాలంలో చిట్టి కోయిల ఒకటి కొత్తగా గొంతు విప్పింది.

కుహూఁ.. కుహూఁ... అని కూస్తూ పోయింది.

చుట్టు ప్రక్కల వాళ్లందరికీ దాని గొంతు చాలా నచ్చింది. మరీ కీచుగా కాకుండా, మరీ మందంగా కాకుండా, సరైన 'పంచమం'లో కూస్తూంటే ఆ సంగీతం ఎవరికి నచ్చదు మరి?! అందరికీ నచ్చింది. ఎవరికి వాళ్ళు, అందరూ రోజూ దాని కూత కోసం ఎదురు చూడటం మొదలు పెట్టారు. ఆసారి మామిడి చిగుర్లు, వేప పూతలు అన్నీ చాలా ఇడిగాయేమో, కోయిలగొంతుకు అన్నీ కలిసి వచ్చి, అది ఇంకా ఇంకా ఇంపుగా కూయటం మొదలు పెట్టింది.

రానురాను చుట్టుప్రక్కల వాళ్లంతా ఆ కోయిల కూతకు అలవాటు పడిపోయారు. పిల్లలకైతే ఇప్పుడు రోజూ దాని కూతతోటే మెలకువ! అందరూ దానిలాగానే 'కుహూఁ.. కుహూఁ..." అని కూయటం మొదలెట్టారు. వాళ్లని చూసి చిట్టికోయిల కూడా- వాళ్ళు తనకు తోడు వస్తున్నారనేమో, మరింత ఉత్సాహంతో పాడటం మొదలెట్టింది.

ఇట్లా కొన్నాళ్ళు గడిచేసరికి ఊళ్ళో లేత చిగుళ్ళు తగ్గిపోయాయి. చిగుళ్ళన్నీ ఆకులౌతాయి కదా, అందుకని చిట్టికోయిలకు కష్టం అయింది. మెల్లగా అది పాడటం తగ్గించింది. పిల్లలంతా దాన్ని ఉత్సాహపరచారు- వాళ్ళు అరిచినప్పుడు అదీ కూసింది; అయితే వాళ్ళు ఆపగానే అదీ ఆపేయటం మొదలు పెట్టిందిప్పుడు!

ఇట్లా కొన్నాళ్ళు గడిచేసరికి చిట్టికోయిల గొంతు మూగపోయింది. ఎటుపోయిందో గానీ, ఇక అది ఎవ్వరికీ కనబడటంకూడా మానేసింది.

పిల్లలు దాన్నితలచుకొని 'బలే కూసేది కదా!' అని చెప్పుకునేవాళ్ళు. పెద్దవాళ్ళు ఏదైనా మంచిపాట విన్నప్పుడు 'మా ఊళ్ళో కోయిల కూడా బలే పాడేది!' అనుకుని నిట్టూర్చేవాళ్ళు.

అంతలో ఏమైందో తెలుసుగా, మళ్ళీ వసంత ఋతువు దగ్గరపడింది. వేపలు, మావులు చిగుళ్ళేసాయి. రకరకాల చెట్లు మొగ్గలు తొడిగాయి. వాతావరణం మారింది. మారిన ఆ వాతావరణంలోకి అనుకోకుండానే వచ్చి చేరుకున్నది కోయిల. ఇప్పుడది పెద్దదైంది. గట్టిపడింది. అయినా దాని స్వరం ఇంకా చక్కగానే ఉంది. మామిడి చెట్లో కొమ్మ మీద కూర్చుని అది ఓసారి'కుహూఁ.." అన్నదో లేదో ఊళ్ళోని చిన్నోళ్ళంతా గంతులు వేస్తూ "కుహూఁ..కుహూఁ.."మన్నారు. పిట్టలన్నీ ఆశ్చర్యంగా చూసాయి. కొత్తగా పుట్టిన లేగలు చెవులు రిక్కించి 'ఎవరిదీ..?' అనుకున్నాయి. పిల్లల ఉత్సాహాన్ని చూసి పెద్దవాళ్ళంతా ముసి ముసిగా నవ్వారు.

'ఈసారి కోయిల ఎన్నాళ్ళుంటుందో..?' అన్నాడో తాత.

'దాని ఇష్టం. మనదేముంది?" అంది అమ్మ.

'మన కోయిల బలే పాడుతుంది కదే అమ్మా?!" అంటూనే చిట్టి "కుహూఁ.."మంటూ బయటికి పరుగు తీసింది.

నాలుగు నెలల విరామం తర్వాత, ఇదిగో- మళ్ళీ ఈ అరవైనాలుగో పుస్తకంగా మీ ముందుకొస్తోంది కొత్తపల్లి. చిన్న చిన్న మార్పులతో, నిర్వహణ పరంగా ఇంకొంచెం కట్టుదిట్టంగా, కొంచెంగా ఎదిగిన బృందంతో వస్తున్న ఈ కొత్త కొత్తపల్లి మిమ్మల్ని గతంలోలానే అలరిస్తుందని ఆశ. ఎప్పటిలాగే మీరంతా కథలూ-కబుర్లూ అన్నీ మీకు తోచిన విధంగా రాసి పంపిస్తూండండి మరి! బాగున్నవాటిని అన్నిటినీ ప్రచురిద్దాం.

నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో,

కొత్తపల్లి బృందం