ఒక ఊళ్ళో సిద్ధార్థ్, సిరి అనే అన్నాచెల్లెళ్ళు ఉండేవాళ్ళు. ఓసారి వాళ్ళిద్దరూ అనుకున్నారు- 'పుట్టినరోజునాడు నాన్నకి ఏదైనా కానుక ఇవ్వాలి' అని .
'మరి, ఎట్లాంటి బహుమతి ఇస్తే బాగుంటుంది?!" అని ఆలోచించడం మొదలు పెట్టారు. 'బొమ్మలు, చాక్లెట్లు...' ఇట్లా రకరకాల ఆలోచనలు వచ్చాయి వాళ్లకి. అయితే సిరి తన పాఠాల్లో అప్పుడప్పుడే తెలుసుకుంటూ ఉంది- ప్రాణం ఉన్నవాటి గురించీ, ప్రాణం లేనివాటి గురించీ! అందుకని ఆ పాప సిద్ధార్థ్ తో అన్నది కదా, "అన్నా! నాన్నకు పుట్టిన రోజు బహుమతిగా మనం ప్రాణం ఉన్న వాటిని ఏమైనా ఇచ్చామనుకో, అప్పుడు అవి కూడా మనతో పాటు పెరుగుతాయి కదా, మనం పెరిగినట్లే?!" అని.
అన్నకు కూడా చెల్లి ఆలోచన నచ్చింది. "అవును సిరీ! నువ్వు చెప్పింది బాగుంది. ప్రాణం ఉన్న బహుమతి దేన్నైనా వెతుకుదాం ఆగు" అన్నాడు సిద్ధార్ధ్.
కొంచెం ఆలోచించాక, "మంచి పూలమొక్కలు కొన్ని తెచ్చి ఇద్దాం, నాన్నకు అవి చాలా నచ్చుతాయి" అనుకున్నారు ఇద్దరూ. మొక్కలు కొనాలంటే చాలా దూరం వెళ్ళాలి.మరి వాళ్ళిద్దరే వెళ్ళలేరు కదా; అందుకని అమ్మను తోడు తీసుకొని మొక్కలు కొని తేవడానికి బయలుదేరారు. అక్కడ రెండు అందమైన పూల మొక్కలు కొని తెచ్చి వాళ్ళ నాన్నకు కానుకగా ఇచ్చారు.వాళ్ళ నాన్నకు కూడా వాళ్ళిచ్చిన కానుక బాగా నచ్చింది. మీ గుర్తుగా వీటిని బాగా పెంచుకుంటాను అని ఆయన పిల్లలకు మాటిచ్చేశారు. పిల్లలిద్దరూ భలే సంతోషపడ్డారు.
"నాన్న పుట్టినరోజు నాడు కేక్ కూడా చేసిపెడితే బాగుంటుందిరా, అన్నా" అన్నది సిరి. “ఓ, చేద్దాం! కానీ సరుకులు లేవే?!” అన్నది అమ్మ.
"నేను తెస్తాగా?" అని, కావలసిన సరుకుల పట్టిక రాసుకొని, అంగడికి బయలుదేరాడు సిద్ధార్థ్. కానీ, ఇంటికి దగ్గరలో ఉన్న అంగళ్ళలో ఆ సరుకులు దొరకలేదు! మరేం చెయ్యాలి?
ఓసారి తను నాన్నతో వెళ్ళాడు- అప్పుడు రోడ్డు అవతల ఉన్న అంగడిలో సామాన్లు కొన్నాడు నాన్న! గుర్తొచ్చింది వాడికి. కానీ ఆ రోడ్డేమో వచ్చీ పోయే వాహనాలతో బాగా రద్దీగా ఉంటుంది. తను ఒక్కడే రోడ్డు దాటలేడు. 'మరి ఎలాగ?' అని కాసేపు ఆలోచించాడు వాడు. 'పోనీలే, అక్కడికి వెళ్ళి చూద్దాం, రోడ్డు దాటలేకపోతే వెనక్కి వచ్చేస్తాను. అప్పుడు అమ్మను తీసుకుని మళ్ళీ వెళ్తాను" అనుకొని రోడ్డు దగ్గరికి వెళ్ళాడు.
చూస్తే నిజంగానే రోడ్డు చాలా రద్దీగా ఉంది. వాహనాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి వస్తూ పోతూనే ఉన్నాయి. సిద్ధార్థ్ దాటలేకపోయాడు. 'ఇప్పుడెలా' అని బిక్క మొహం వేసుకుని నిల్చున్నాడు.
అప్పుడే రోడ్డు దాటడానికి ఇంకొకాయన ఎవరో వచ్చారు. బిక్కమొహం వేసుకొని నిల్చున్న సిద్ధార్థ్ ను చూడగానే ఆయనకు పరిస్థితి అర్థం అయ్యింది. చేయి పట్టుకొని రోడ్డు దాటించటమే కాదు; వాడు అంగట్లో సామాన్లు కొనుక్కుని తిరిగి వచ్చే వరకు వేచి ఉండి, వాడిని మళ్ళీ రోడ్డు దాటించి వెళ్ళిపోయారాయన! సిద్ధార్థ్ కు ఆయన చేసిన పని చాలా నచ్చింది. ఆయనకు కృతఙ్ఞతలు చెప్పి సంతోషంగా ఇల్లు చేరుకున్నాడు.
ఇంట్లోకి రాగానే సంతోషంగా అరిచాడు-"అమ్మా, ఇప్పుడేం అయ్యిందో తెలుసా? నేను రోడ్డు దాటలేక అక్కడే నిల్చుండిపోతే, ఎవరో తెలీదు- ఒకాయన నా చెయ్యి పట్టుకొని దాటించారమ్మా! నాకు చాలా సంతోషంగా అనిపించింది. 'ఎదుటివారి నుండి ఏమీ ఆశించకుండా సహాయం చేయాలి' అని నువ్వెప్పుడూ చెప్తుంటావే, అది ఇప్పుడు నాకు బాగా అర్థం అయ్యింది. నేను కూడా ఇలాగే ఎవరికైనా సహాయం చేస్తే వాళ్ళు కూడా నాలాగే చాలా సంతోషపడతారు కదమ్మా?!" అన్నాడు.
"అవునురా సిద్ధూ, ఇవాళ్ళ నీకు సాయం చేసారే, ఆయనకు నువ్వు నోటితో కృతఙ్ఞతలు చెప్పావు కదా? మంచిదే; కానీ నీకు సహాయం చేసినవాళ్ళను మర్చిపోకుండా నువ్వు కూడా నీకు చేతనైనంత మందికి తిరిగి సహాయం చెయ్యడమే అసలైన కృతఙ్ఞత" అని చెప్పింది అమ్మ చిరునవ్వుతో.
"మీకు తెలీదుగానీ, ఇవాళ్ళ మీరు నాకు రెండు గొప్ప బహుమతులు ఇచ్చారురా!” అని నాన్న సంతోషంగా పిల్లలిద్దర్నీ ఒకేసారి ఎత్తుకున్నాడు!