ఆగష్టు సంచిక ముఖ చిత్రం మీద భారత దేశ పతాకానికి శాల్యూట్ చేస్తున్న పిల్లలను చూడగానే కొంచెం బాధ కలిగినా (పెరిగిన తలలతో, పుల్లల్లాంటి కాళ్ళూ చేతులతో, కొద్దిగా మాసినట్లున్న బట్టలతో), వీళ్ళే కదా ఎక్కువ మంది పిల్లలకీ, భారత దేశపు గ్రామీణ సమాజానికి నిజమైన ప్రతినిధులు అనిపించింది.
కుందేలు బొమ్మకు వ్రాసిన కథ (వీరనరేశ్ కథ - సాయిక్రిష్ణ) కూడా స్వాతంత్ర్య దినోత్సవ సందర్భానికి చక్కగా సరిపోయింది. కుందేళ్ళ రాజ్యానికి "కుందేకొండ" అని పేరు పెట్టడం కూడా ఎంతో బాగుంది. పేర్ల తోనే నడిపించి, బాగా చదివించిన ఇంకో కథ హర్షవర్థన రెడ్డి వ్రాసిన "తిండిపోతు చెప్పిన కథ". ఉల్లిపాయంత ఊళ్ళో ఉన్న దొండకాయంత దొంగ, బీరకాయంత బీరువా, వంకాయంత వజ్రం అని చెప్పుకునే చిన్నప్పటి కథని గుర్తుకి తెస్తూ (కానీ ఆ పాత పోలికలు ఏవీ వాడకుండా) చాలా కొత్తగా ఉండి బాగా చదివించింది. మొద్దు నిద్ర పోతున్న దధ్యోజనం, జంతికల పడవలు, చింత పులుసంత చింతాక్రాంతం, అప్పడం మీద డప్పు కొట్టించడం, దోసెల వల వెయ్యడం - భలే నవ్వించాయి.
ఈ నెలలో స్వాతంత్ర్యం గురించిన కథలు ఎక్కువ లేకపోయినా, సంపాదకీయంలో ఎంతో ముఖ్యమని చెప్పిన సంస్కృతి, చరిత్రకి సంబంధించిన జానపద కథలు నాలుగు ఉండడం విశేషం. వంట పాత్రలనే 'పాత్రలు' గా చేసి దొంగల బారి నించి తప్పించుకున్న తెలివైన ముసలమ్మ కథ ( నేపాలీ జానపద కథ)లో చివరలో దొంగలు వదిలి వెళ్ళిన దానిని తీసుకుంటూ వంట పాత్రల తో ఆ సంతోషాన్ని పంచుకోవడం, ఆ తరవాత పనికి, తోడుకి మనుషుల్ని ఇంట్లో పెట్టుకోవడం బాగున్నాయి. "కోతి మనసు" కోతిని ఎలా నాశనం చేసిందో రాయల సీమ జానపద కథ చెపితే ( కోతి మనసు తెచ్చిన తంటా - వెంకట సాయి ), బౌద్ధ కథ (జెన్ సన్యాసి - పులి) ధ్యానంలో కుదురుకున్న మనసు యొక్క శక్తి ని ఎంతో చక్కగా చెప్పింది. 'చక్రి' కథనంలో భారత దేశపు జానపద కథ ('తూర్పు దేశంతో వ్యాపారం') కొంచెం పెద్ద కథ అనిపించినా బాగానే చదివించింది.
ఈ అన్ని కథలకీ చక్కగా కుదిరిన ఇంకో విశేషం బొమ్మలు. వీటికి వేసిన బొమ్మలన్నీ ఎంతో బాగున్నాయి.
జానపదకథ అని చెప్పక పోయినా అలానే అనిపించిన ఇంకొక కథ మాయమంత్రాల కథ (బాల మణికంఠ). ఈ కథకి కూడా బొమ్మలు బాగున్నాయి. బొమ్మల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన ఇంకొక కథ సమయస్ఫూర్తి. కొత్తగా ఉన్న ఈ కథలో సైక్లిష్టుల వెనక ఉన్న జనసమూహాలు చిన్న చిన్న చుక్కలతో గీతలతో ఎంతో చక్కగా కుదిరాయి. 'నీతి చంద్రిక'కి వేస్తున్న బొమ్మలు మాత్రం తేలిపోతున్నాయి అనిపిస్తోంది ప్రతి నెలా. చిట్టి పాటా, దానికి వేసిన బొమ్మా రెండూ బాగున్నాయి.
దయ్యాల కథ లేకుండా పోతుందేమో అన్న లోటుని తీర్చింది వేణుగోపాల్ వ్రాసిన 'భయం' కథ. లలిత గారు వ్రాసిన 'వజ్రపుటుంగరం' కథ ఎన్నో ఆసక్తికరమైన మలుపులతో వేగంగా సాగింది. కానీ పేరు "వజ్రాలహారం" అనో "రాణీ గారి నగలు" అనో ఉండాలేమో..
ఇష్టమైనవి చేస్తుంటే, కష్టమైన పనులు కూడా అంత కష్టమనిపించవని చెప్పిన కథ జాహ్నవి వ్రాసిన 'సంగీతం'. యువ కెరటాలు లో 'కెల్విన్ డో' గురించి ( పశ్చిమ ఆఫ్రికా లోని చిన్న దేశం సియర్రా లియోన్ కి చెందిన యువ మేధావి) సౌమ్య గారు చెప్పిన విధానం ఎంతో స్పూర్తి దాయకం గా ఉంది. చివరి అట్ట మీద సంభాషణలో చెప్పినట్లు అయస్కాంతం కోసం బండి స్పీకర్లని విప్పేసే పిల్లల్నీ, లోపల బల్బు ఎలా వెలుగుతోందో చూద్దామని రోబాట్ బొమ్మని విరిచి ముక్కలు చేసి పెట్టే "నిలకడ లేని పిల్లల్ని" అట్లాగే స్వేచ్ఛగా, సంతోషంగా ఎదగనిస్తే కొంతమంది కెల్విన్ డో లైనా దొరుకుతారేమో మనకి !