హైదరాబాదు ఎన్ టి ఆర్ పార్కులో ఒక బెంచీ మీద కూర్చొని ఉన్నాడు ఆకాష్. సాయంత్రం 6.30 అయింది. పార్కంతా ప్రశాంతంగా ఉంది. రోజూ ఇలాగే వచ్చి బెంచీ మీద కూర్చుంటాడు ఆకాష్. ఎవరినీ చూడకుండా, ఎవరితో మాట్లాడకుండా తనలో తాను ఆలోచించుకుంటూ, పుస్తకాలు చదువుకోవడం అంటే అతని కి చాలా ఇష్టం.
చిన్నప్పటినుండీ వాడు అంతే. ఇప్పుడు అయితే హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నాడు. ఆఫీసు నుండి రాగానే ఏదో ఓ పుస్తకం పట్టుకుని ఇలా వస్తాడు.
ఈరోజు ఆకాష్ పార్కుకి వచ్చేప్పటికి అతను ఎప్పుడూ కూర్చునే బెంచీ మీద ఒక మనిషి కూర్చుని ఉన్నాడు. అతనికి 25-30 ఏళ్ళ వయస్సు ఉంటుంది. ఆకాష్ అతని ప్రక్కనే కూర్చున్నాడు. “ఛీ! నేనెంత తెలివితక్కువ వాడిని! ఊరుగాని ఊరికి వచ్చేప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి- థూ థూ!' తనలో తనే గొణుక్కుంటున్నాడతను.
'వీడెవడ్రా బాబూ!' అనుకున్నాడు ఆకాష్. అయినా అతనితో మాట్లాడాలనిపించింది- ఎందుకనో మరి! "మీరు మంచి మూడ్లో లేనట్లున్నారు?” అడిగాడు అతన్ని.
“మీరు నా స్థితిలో ఉంటే ఇలానే ఉంటారు" అరిచాడు ఆ వ్యక్తి.
“ఏమైంది మీకు?” అడిగాడు ఆకాష్.
“నా జీవితంలో నేనెప్పుడూ ఇంత తెలివితక్కువ పని చేయలేదు"
“అదే! ఏమిటండీ ఆ పని?”
“నేను మచిలీపట్నం నుండి ఆఫీసు పని మీద వచ్చా. నాకు హైదరాబాదులో ఎవరూ లేరు. పద్మినీ హోటల్లో రూము అద్దెకు తీసుకున్నా. సబ్బు తీసుకురావడం మర్చిపోయాను. నాకు హోటల్ సబ్బు నచ్చదు. అందుకని కొంచెం దూరంలో ఉన్న కొట్టుకెళ్ళి సబ్బు కొన్నా. ఆ తర్వాత, పద్మినీలో తినేందుకేమీ దొరకదు కాబట్టి, టిఫిన్ కోసం అటూ ఇటూ తిరిగాను. మళ్ళీ పద్మినీకి వెళ్ళాలంటే దారి తప్పిపోయాను. ఇప్పుడు చూసుకుంటే ఆటోకి డబ్బులు లేవు. అలిసిపోయాను. ఇక్కడ కూర్చున్నాను. నా దగ్గర రెండు రూపాయలు ఉన్నాయి అంతే" కళ్ళలో నీళ్ళు తిరిగాయి అతనికి.
'వీడు దొంగా, లేకపోతే ఇదంతా నిజమా? ' అని ఆలోచించాడు ఆకాష్.
“నాకు ఇట్లా జరిగిందంటే మీరు నమ్మట్లేదు కదూ? నా మాట ఎవరు నమ్ముతార్లే..”
"అబ్బే! అట్లా ఏం లేదు. నాకు కూడా ఇలాగే జరిగింది- ఇక్కడ కాదు, ఇటలీలో. చివరికి ఫోన్ చేసి అడ్రస్ కనుక్కున్నాను. కానీ- కానీ … మీరు కొన్న సబ్బు చూపిస్తే .. ఎవరైనా నమ్ముతారు" అన్నాడు ఆకాష్ కొద్ది బిడియంగా.
ఆ వ్యక్తి లేచి బెంచీ అంతా వెతికాడు. తెల్లబోయాడు. 'అయ్యో ఎక్కడో పడిపోయి ఉంటుంది' అన్నాడు తత్తరపడుతూ.
“మీకు చాలా నిర్లక్ష్యమనుకుంటాను. ఒకే రోజులో హోటల్నీ, సబ్బునీ పోగొట్టుకున్నారే!" నవ్వాడు ఆకాష్.
“హు!” అని వెళ్ళిపోయాడు అతను.
'మోసగాడు. నాకే టోపీ వేయాలని చూస్తాడా! ఈ నగరాల్లో అంతే. అంతా దోపిడీలు, దొంగతనాలు. అందుకనే అందరూ తెలివిగా ఉండాలి నాలాగా. మొదటి చూపులోనే పట్టేశా …. వీడు మోసగాడని. అయినా మోసం చేయాలంటే అలాంటి కథ ఎందుకు అల్లాడు? ఎవరైనా పట్టేసుకోరూ? సబ్బుని గురించి ఎవరూ అడగరనుకున్నాడా!!! ఏమో … సబ్బంట సబ్బు! గాడిద గుడ్డేం కాదూ!' అని నవ్వుకుంటూ కూర్చున్నాడు ఆకాష్.
“ఏమటంత నవ్వుతున్నావు నాయనా?” అన్నాడు అప్పుడే అక్కడకొచ్చిన ముసలి తాత. తాత ఎప్పుడూ అక్కడే తిరుగుతుంటాడు.
“ఏం లేదు తాతా! ఒకడు నాకు టోపీ వేయాలని చూశాడు - నేను పట్టేసుకున్నా"
“ఓహో! ఈ పార్కులో జాగ్రత్తగా ఉండాలి నాయనా. అందరికీ టోపీ వేయాలని చూస్తారు" అన్నాడు తాత బెంచీ మీద కూర్చుంటూ.
"అవును తాతా! నేను మోసగాళ్ళను చిటెకెలో పట్టేస్తా" అన్నాడు ఆకాష్.
“అందరూ అలాగే అనుకుంటారు నాయనా" అనుకుంటూ తాత లేచి అక్కడనుండి వెళ్ళిపోయాడు.
'ఈయనొకడు!' అనుకుంటూ ఆకాష్ కూడా లేచి, చెప్పులు సరి చేసుకోవడానికి కిందికి వంగాడు. బెంచీ కింద ఏదో పాకెట్టు ఉంది. ఆకాష్ దానిని తీసి చూస్తే – సబ్బు బిళ్ళ.
'అయ్యో! తప్పయిపోయిందే …. అతని కథ నిజమేనన్నమాట. నేనేదో అనుకుని నానా మాటలు అనేశానే. ఇప్పుడు అతను ఎక్కడున్నాడో!' అనుకుంటూ ఆకాష్ రోడ్డు దాటి అటూ ఇటూ తిరిగాడు. 'అతని దగ్గర డబ్బులు కూడా లేవు కదా పాపం!' అనుకుంటూ ఓ బ్రిడ్జి మీదకు వచ్చాడు. బ్రిడ్జి చివర కూర్చుని ఉన్నాడు ఆ వ్యక్తి. చాలా దు:ఖంలో ఉన్నట్లున్నాడు.
“ఏమండీ! ఏమండీ! మీ సబ్బు దొరికింది!" ఆకాష్ పెద్దగా అరిచాడు. ఆ వ్యక్తి వైపుకి పరిగెత్తి "మీ కథకి ఋజువు దొరికింది. ఇదిగోండి, మీ సబ్బు!" అంటూ సబ్బుని అతనికి ఇచ్చాడు.
“మీకెలా దొరికిందిది?!” అన్నాడు ఆ వ్యక్తి ఆశ్చర్యంగా.
“బెంచీ కింద ఉంది. సారీ - మీరు అబద్ధం చెప్తున్నారని అనుకున్నాను. సబ్బు దొరికిన వెంటనే మీ కోసం పరిగెత్తుకొచ్చాను.. సరే, ఈ వంద రూపాయలుంచండి. నేను బంగాళా ఫ్లాట్స్ నెం 39 లో ఉంటాను. రేపు వచ్చి ఇచ్చేద్దురుగాని!” అంటూ జేబులోనుండి 100 రూపాయలు తీసి అతని చేతిలో పెట్టాడు ఆకాష్.
“థాక్స్ అండీ! వెళ్ళొస్తానండీ!” అంటూ అతను వెళ్ళిపోయాడు.
'పాపం నేను ఆ డబ్బులు ఇవ్వకపోతే ఎంత బాధ పడి ఉండేవాడో' అనుకుంటూ పార్కుకి వచ్చాడు ఆకాష్. అక్కడ ముసలి తాత బెంచీ కిందకి వంగి దేనికోసమో వెతుకుతున్నాడు.
“ఏం తాతా! దేని కోసం వెతుకుతున్నావు" అన్నాడు ఆకాష్.
“ఏం లేదు నాయనా - నా సబ్బు బిళ్ళ ఇక్కడేమైనా పడిపోయిందేమోనని....”
“ఆఁ !!!!!