రజని, గోపి తోటలో బంతాట ఆడుతున్నారు.

అంతలో ఆ బంతి పోయి ముళ్ళకంపలో పడింది.

రజని, గోపి ఇద్దరూ ఆ బంతి కోసం వెళ్ళారు. బంతి కనిపించింది- అయితే బంతి పక్కనే అందమైన సీసా ఉంది.

"అరే, సీసా భలే అందంగా ఉంది" బంతితో పాటు సీసా కూడా తీసుకున్నారు పిల్లలిద్దరూ.

"సీసాలో ఏముందో చూద్దామా?!" అడిగాడు గోపి ఉత్సాహంగా.

"సరే మూత తీయ్" అంది రజని, తనూ ముందుకి వంగి.

మూత తీశాడు గోపి- అంతే- భగ భగ మని నల్లని పొగలు.... భయంకరమైన నవ్వు.... భయంకరమైన ఆకారంతో ఓ పె..ద్ద భూతం బయటికి వచ్చింది సీసాలో నుంచి. "ఆకలి... ఆకలి...మీ ఇద్దరినీ తింటాను" అన్నదది.

రజని, గోపిలకు భయంవేసింది. అయినా రజని "భయం వద్దు గోపీ! నిన్న టీచర్ చెప్పిందికదా- ఆపదలు వచ్చినప్పుడు భయపడ వద్దని? భూతాన్ని మాటల్లోకి దించుదాం. తప్పించుకునేందుకు ఏదో ఒక ఉపాయం తట్టకపోదు" అన్నది.

"ఓ భూతమా! నీకు ఆకలి అయితే మా ఇద్దరినీ తీనేసెయ్. కానీ, నీకు తెలుసో తెలీదో- మేం ఇద్దరం చాలా తెలివైన వాళ్లం. అట్లాం టి మమ్మల్ని ఒక తెలివిలేని భూతం తినటం ఉన్నదే- అది మటుకు చాలా బాధగా ఉంది" అంది రజని.

"ఏమిటీ! నేను- తెలివి లేని దాన్నా?!" అంది భూతం, కోరలు చాపి.

"ఏమో, మాకైతే అట్లాగే అనిపిస్తున్నది. చేతనైతే మేం అడిగే పొడుపు కథలు విప్పు. నువ్వు తెలివిగల దానివి అని మేం ఒప్పుకొని, సంతోషంగా నీకు ఆహారం అవుతాం. నువ్వు సరైన జవాబులు చెప్పలేకపోతే మమ్మల్ని ఇద్దర్నీ తినకుండా విడిచిపెట్టాలి మరి" అన్నది రజని.

భూతానికి తన తెలివితేటలపైన చాలా నమ్మకం. "సరే చెప్పండి- చూద్దాం" అంది అది.

రజని ఇలా అడిగింది: 'రాజా వారి తోటలో రోజా పువ్వులు- చూసేవారే కానీ కోసేవారు లేరు' భూతం ఎంత ఆలోచించినా సమాధానం దొరకలేదు. "ఈమాత్రం తెలీదా? ఆకాశంలో నక్షత్రాలు" అంది రజని.

ఈసారి గోపి అడిగాడు ఓ పొడుపుకథ: "గోడ మీద బొమ్మ -గొలుసులు బొమ్మ -వచ్చేపోయె వారికి -వడ్డించుబొమ్మా" "ఓస్!‌ఇది తెలుసు నాకు- తేలు!" అంది భూతం.

"మరి నేను అడిగిన దానికి చెప్పు" అంటూ రజని ఇంకో పొడుపు కథని విడిచింది: 'పచ్చటి పొలంలో ఒంటికాలి రైతు- ఉలకడు-పలకడు' అని.

భూతం బిక్క మొహం వేసింది. "అయ్యో, దిష్టిబొమ్మ , తల్లీ!" అంది రజని చేత్తో నుదుటిని కొట్టుకుంటూ.

"అవునవును- ఇంకోటి అడుగు చెబుతాను- ఈసారి సరిగ్గా చెబుతాను" అంది భూతం ఉత్సాహంగా.

గోపి అడిగాడు ఈసారి- "కిరీటం‌ పెట్టు కుంటాడు, కత్తితో పోరాడతాడు- కానీ రాజుకాదు- ఎవరది?" అని. భూతానికి ఇదీ రాలేదు.

"నేను చెబుతానులే- కోడి పుంజు" అన్నది రజని.

"మీరు చాలా మంచి పిల్లలు. నాకు ఇంకొక్క పొడుపుకథ వినిపించండి. ఆ తర్వాతనే మిమ్మల్ని తింటాను" అంది భూతం నవ్వుతూ. పిల్లలిద్దరూ అదిరి పడ్డట్లు చూశారు.

"మమ్మల్ని వదిలేస్తానన్నావుగా?" అంది రజని.

"ఊరికే అన్నాను" ఇకిలించింది భూతం.

"సరే అయితే ఇది చెప్పు: చేత్తో చల్లుతారు, నోటితో‌ ఏరతారు- ఏమిటవి?" అడిగాడు గోపి. భూతం బుర్ర గోక్కున్నది.

ఆలోగా రజని "అక్షరాలు" అని ఒక కాగితం మీద రాసి, ఆ కాగితాన్ని గబుక్కున సీసాలో వేసేసింది "సమాధానం నేను చెప్పను- కాగితంలో రాసేసా- కానీ అది నీకు అందదు!" అని ఊరిస్తూ.

"ఎందుకు అందదు? నేను చదివేసి వస్తాను క్షణంలో" అని భూతం నల్లటి పొగలాగా మారి సీసాలోకి దూరింది- అంతకంటే చలాకీగా ఉన్న రజని అరక్షణంలో సీసాకు మూత పెట్టేసింది!

పిల్లలిద్దరూ చలాకీగా నవ్వుతూ ఇంటికి పోతుంటే సీసాలో భూతం మటుకు గందర గోళంగా అటూ‌ఇటూ తిరిగింది.