అమ్మ ఏదైనా పని చెప్పిందనుకో, మనకేమో బద్ధకం-"ఆ పని చేస్తే ఏం వొస్తుంది?" అని ఊరికే కూర్చుంటాం. అప్పుడేమౌతుంది? ఒకటి, పని అవ్వదు. రెండు, మనకి ఆ పని చేసిన అనుభవంరాదు: అంటే ఆ పని నుండి మనం దేన్నో నేర్చుకోగలమే- అది నేర్చుకోలేం. ఇంక మూడోది , ఆ పని చేసేటప్పుడు ఇంకో పని ఏదో మొదలవ్వొచ్చు చూడు, అది మొదలవ్వదు.

పని చేస్తే ఏం వొస్తుంది? 'పని నుండి పని మొదలవుతుంది'- ఆ ఒక్క కారణమూ చాలు, పని చేసేందుకు.

దానికి ఉదాహరణ, 'నికొలస్' కథ.

చాలా కాలం క్రితం 'నికొలస్' అనే పిల్లవాడు ఊళ్ళో అందరికీ బాగా సాయం చేస్తూ ఉండేవాడట. పేదవాళ్లందరినీ పిలిచి, తన వాటా రొట్టెల్ని వాళ్లతో పంచుకొని తింటూ ఉండేవాడట. 'అట్లాంటి మంచి పిల్లవాడిని ఏం చెయ్యాలి?' అని ఆలోచించి, వాళ్ల అమ్మవాళ్ళు వాడిని చర్చిలో చేర్పించారు- 'కొంచెం భక్తి, కొంచెం శాస్త్రాలు, అన్నీ నేర్చుకుంటాడులే' అని.

నికోలస్ అన్నీ నేర్చుకున్నాడు. దాంతోపాటు ఏమయింది? -వాడి మంచితనం కూడా పెరిగింది. కష్టాల్లో ఉన్నవాళ్ళకు సాయం చేసే గుణం గట్టి పడింది. ఎవరు కనిపించినా వాళ్లకి సంతోషం కలిగేట్లు 'ఏవో చిన్న బహుమతులు ఇద్దాం' అనిపించసాగింది అతనికి.

'అరే, వీడు చిన్నవాడే, కానీ చాలా గట్టివాడు' అని చర్చివాళ్లు వాడికి పెద్ద ఉద్యోగం ఇచ్చారు. చిన్న వయసులోనే అతను కాస్తా 'బిషప్ నికొలస్' అయిపోయాడు. ఎర్ర అంగీ వేసుకొని, ఎర్ర కుచ్చు టోపీ పెట్టుకొని, గుర్రం మీద ఊరూరా తిరిగి, బిషప్ నికొలస్ కష్టాల్లో‌ ఉన్నవాళ్లకు ఏవేవో సాయాలు అందిస్తూ వచ్చాడు. జేబులో‌ చాక్లెట్లు, బిస్కెట్లు నింపుకొని, కనబడిన పిల్లాడికల్లా వాటిని పంచుతూ వచ్చాడు. ఎక్కడికి వెళ్తే అక్కడ, పిల్లలు ఈ 'చిన్న బిషప్' చుట్టూ గుమిగూడేవాళ్ళు . అతను వాళ్లని ముద్దు చేసి, నవ్వి, నవ్వించి- సంతోష పెట్టేవాడు.

ఒక పని ఇంకో పనిని ఇస్తుంది- చిన్న నికొలస్ అలాగే బిషప్ నికొలస్ అయ్యాడు.

ఒకరోజున బిషప్ నికొలస్‌కి ఎవరో ఒక పేదవాడి గురించి చెప్పారు. ఆ పేదవాడికి ముగ్గురు కూతుళ్ళు. పేదరికం వల్ల అతను వాళ్లకు కడుపునిండా అన్నంకూడా పెట్టలేకుండా ఉన్నాడు. అందుకని, ఎవరు కొంటే వాళ్ళకు, వాళ్లని అమ్మేద్దామనుకుంటున్నాడట, అతను!

అది విని నికొలస్‌కి చాలా బాధ వేసింది. 'పిల్లల్ని అమ్ముకోవడం ఏంటి, నేను వీళ్లకు ఏమైనాసాయం చేస్తాను' అని, ఆరోజు రాత్రి అందరూ నిద్రపోతున్న సమయంలో- మెల్లగా- ఆ పేదవాడి గుడిసె మీదికి ఎక్కాడు నికొలస్... గుడిసె పై కప్పుకు ఓ పొగ గొట్టం ఉంది... నికొలస్ తను తీసుకొచ్చిన బంగారు నాణాల సంచీలు మూడింటిని, ఒకదాని వెనుక ఒకటిగా ఆ పొగగొట్టంలోంచి క్రిందికి వదిలేసి, చప్పుడు చెయ్యకుండా చూరుదిగి వెళ్లిపోయాడు.

అది చలికాలం. ఆ రోజుల్లో అక్కడి ఆడపిల్లలు సాక్సులు(మేజోళ్ళు) లేకుండా బయట తిరిగేవాళ్లు కాదు. మరి, ఈ పేదవాడి కూతుర్లు ముగ్గురికీ తలా ఒక్క జత మేజోళ్లే ఉన్నాయి. వాళ్ళు వాటిని రోజూ రాత్రిపూట ఉతుక్కునేవాళ్లు. ఉతికాక, 'ఉదయంలోగా ఆరాలి కదా' అని వాటిని పొయ్యి మీద వ్రేలాడదీసుకునేవాళ్ళు.

ఆరోజున కూడా వాళ్ళు అదే పని చేశారు: మేజోళ్ళని పొయ్యి మీద వ్రేలాడదీసుకున్నారు. అలా నికొలస్ వదిలిన బంగారపు మూటలు నేరుగా ఆ మేజోళ్లలో వచ్చి పడ్డాయి!

తెల్లవారగానే మేజోళ్లకోసం వచ్చిన పిల్లలు ముగ్గురికీ బంగారపు మూటలు దొరికాయి. వాళ్ల కష్టాలన్నీ తీరిపోయాయి. ఇంకేముంది, ఈ వార్త ఊరూరా ప్రాకింది. రాత్రి అవ్వగానే అందరూ తమ మేజోళ్ళను తెచ్చి పొయ్యి మీద వ్రేలాడదీసుకోవటం మొదలుపెట్టారు. "ఏదో‌ మ్యాజిక్ జరుగుతుందట. మేజోళ్లలోకి ఏవేవో బహుమతులు వచ్చి పడతాయట!" అని అందరూ చెప్పుకోవటం మొదలు పెట్టారు.

ఇట్లా‌ పిల్లలు ఆశ్చర్యపోవటం , ఆశ్చర్యపోవటం కోసం ఎదురుచూడటం- రెండూ బిషప్ నికొలస్‌కి చాలా నచ్చాయి. ఇక అప్పటినుండీ ఆయన రాత్రిపూట తిరగటం, పిల్లలకి తెలీకుండా‌ ఆశ్చర్యం గొలిపేటట్లు బహుమతులిస్తుండటం మొదలు పెట్టేశాడు.

పని పనిని ఇస్తుంది, నిజంగానే. చూస్తూండగానే బిషప్ నికొలస్ పెద్దాయన అయిపోయాడు.

బిషప్ నికొలస్‌కి ఆ తర్వాత ఎంత పేరు వచ్చిందంటే, ఆయన్ని చర్చి వాళ్ళు 'సెయింట్ నికొలస్' (నికొలస్ మహాత్ముడు) అనేశారు.

సంతోషానికి, ప్రేమ-ఆప్యాయతలకు మారు పేరు 'సంట్ కొలస్' అని దేశ దేశాల్లోనూ ప్రజలు చెప్పుకోవటం మొదలెట్టారు. అట్లా, చిన్న నికొలస్ కాస్తా మెల్లిగా సంట్‌కలస్ అయిపోయి, చివరికి 'సాంతాక్లస్' అయిపోయాడు!

క్రిస్మస్ రోజున పిల్లలందరికీ కోరుకున్న బహుమతులిచ్చి సంతోష పెట్టేది ఆ 'సాంతా'నే! అయితే ఇప్పుడు ఆయన ఇచ్చే బహుమతులకోసం పొయ్యిలమీద మేజోళ్ళుకూడా వ్రేలాడదీయనవసరం లేదు. పనుల్ని ఇష్టంగా చేస్తూపోతుంటే చాలు! పనిని వెతుక్కుంటూ‌ పని - ఆ పనికి బహుమతిగా మరో పని- ఇట్లా వరసపెట్టి వస్తూనే ఉంటాయి.

ఇష్టంగా పనులు చేసేవాళ్ళు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు !

-కొత్తపల్లి బృందం.