ఒకూర్లో ఇద్దరు అన్నదమ్ములు వుండేటోళ్ళు. ఇద్దరూ చిన్నప్పటి నుంచీ కలసిమెలసి వుండేటోళ్ళు, ఇద్దరికీ పెళ్ళిళ్ళయినాయి.

పిల్లలూ పుట్నారు. చిన్నోడి పెండ్లాం బిడ్డలేమో చానా మంచోళ్ళు, ఎప్పుడూ పన్నెత్తి ప్రశ్నించేటోళ్ళు కాదు. కన్నెత్తి చూసేటోళ్ళు గాదు. ఏది చెబితే అది- ఇట్లా చెప్పడం ఆలస్యం అట్లా పరుగెత్తి చేసేటోళ్ళు.

కానీ పెద్దోని పెండ్లాం మాత్రం పెద్ద గయ్యాలిది. ఎప్పుడూ మొగునితోనూ, మరిదితోనూ, తోడికోడలితోనూ ఏదో ఒక దానికి వూకూకెనే కొట్లాట పెట్టుకొనేది. నోటికొచ్చినట్టల్లా తిట్టేది.

దాంతో చిన్నోడు లాభం లేదనుకోని పెండ్లాం బిడ్డలతో కలసి వేరు కాపురం పెట్టాలనుకున్నాడు. కానీ అట్లా పోయేటప్పుడు ఇంట్లోంచి ఒక్క సామాను గూడా తీసుకోని పోకుండా పెద్దోని పెండ్లాం అడ్డం పడింది. దాని నోటికి భయపడి పెద్దోడు గూడా కిమ్మనకుండా కుక్కిన పేను లెక్కవుండి పోయినాడు. దాంతో చిన్నోడు కట్టుబట్టలతో చేతిలో పైసా గూడా లేకుండా బైటపన్నాడు.

బతకాలంటే ఏదో ఒక పని చేసి పైసలు సంపాదించాలగదా. దాంతో పెండ్లాం బిడ్డలను తీసుకొని ప్రక్కనే ఉన్న పెద్ద అడవిలోనికి బయలుదేరినాడు. అడవిలో పోతావుంటే ఒకచోట ఒక పెద్ద మర్రిచెట్టు కనబడింది. దాని కింద వాళ్లని కూర్చోబెట్టి పెండ్లాం తో "ఏమే...నేనుపోయి చుట్టు పక్కల ఏవైనా మంచి చెట్లేమన్నా ఉన్నాయేమో చూసొస్తా. అంతలో నువ్వు అన్నం వండు " అన్నాడు.

ఆమె సరేనని వెంటనే మూడు రాళ్ళుతీసుకోనొచ్చి పయిన మూకుడు పెట్టి కింద మంట వెలిగించింది. చిన్నోడు చుట్టుపక్కల అంతా వెతికి ఒకచెట్టు కనబడితే దాన్ని నరికి ముక్కలు చేసి మరలా మర్రిచెట్టు దగ్గరికి వచ్చినాడు.

ఆ మర్రి చెట్టు పైన ఒక దయ్యం ఉంది . అది ఉత్త పిరికిది. ఎవరైనా గట్టిగా ఒక్కరుపు అరిస్తే చాలు గజగజలాడిపోతాది. అది వీళ్ళని చూసి భయపడి చిటారుకొమ్మకు చేరి దాక్కొని చూడ సాగింది. చిన్నోడు చెట్టుకింద కూర్చొని కొడుకుతో " రేయ్... పోయి అక్కడ కట్టెలన్నీ తీసుకోనొచ్చి చిన్నచిన్న తుంటలు చేయి" అన్నాడు. వెంటనే వాడు "అట్లాగే నాన్నా" అని ఉరుక్కొంటూ పోయి కట్టెలన్నీ తీసుకోనొచ్చి చిన్నచిన్న ముక్కలుగా నరక సాగినాడు.

చిన్నోడు కూతురికేసి తిరిగి "పాపా... ఆ కట్టెల పైనున్న నార తీసి పక్కన పెట్టు. మంచి మంచి తాళ్ళు పేనుతాను" అన్నాడు. దానికా పాప "ఎందుకు నాన్నా తాళ్ళు?" అనడిగింది. దానికి వాడు "చెట్టు మీద ఒకడున్నాడులే... వాన్ని కట్టి తీసుకుపోడానికి.... ఐనా నీకెందుకే అవన్నీ... నోర్మూసుకోని చెప్పిన పని చెయ్యక?" అన్నాడు. వెంటనే ఆ పాప వురుక్కుంటా పోయి గబగబా నార తీసి అందించసాగింది. అది చూసి దయ్యం అదిరిపడింది.

"ఓరి నాయనోయ్...వీడు తాళ్ళు పేనుతా వుంది నా కోసమేనా...అదీగాక వీడు ఏం చెబ్తే అది పెండ్లాం బిడ్డలు నోరెత్తకుండా చేస్తా వున్నారంటే వీడు మామూలోడు గాదు. ఎట్లాగో ఒకట్లా వీన్ని మంచి చేసుకోవాల. లేకుంటే కష్టం" అనుకోని ఆ తెలివిలేని దయ్యం గజగజగజ వణుక్కుంటూ కిందికి దిగింది.

దయ్యాన్ని చూసి అందరూ అదిరిపోయినారు. కానీ అది గజగజా వణికిపోతా వుంది గదా, అది చూసి చిన్నోడు ధైర్యాన్ని కూడగట్టుకున్నాడు. దయ్యం వణికిపోతా చేతులు కట్టుకోని "అయ్యా నేను నీకేం అపకారం చేసినాను, నా చెట్టు కింద కూచున్నారు. వంట చేసుకున్నారు. అన్నం తిన్నారు. కట్టెలు కొట్టుకున్నారు. నేనేమైనా అంటినా, ఐనా నన్ను కట్టెయ్యడానికి తాళ్ళు పేనుతా వున్నారు. ఇది న్యాయమేనా" అనింది.

దాంతో చిన్నోనికి విషయమంతా అర్థమైంది. తానేదో తమాషాగా అంటే ఇది నిజమనుకోనింది అను కోని "ఏయ్... దొరక్క దొరక్క దొరికినావు. నిన్ను వదిలే ప్రసక్తే లేదు. కట్టి వూర్లో పెద్దోళ్ళ దగ్గరికి తీసు కోని పోతే అందరూ మెచ్చుకోని తలా ఇంత వేసుకోని పెద్ద బహుమతే ఇస్తారు" అంటూ మరింత బెది రించినాడు.

దానికా దయ్యం మరింతగా వణికిపోతా "వద్దొద్దు...అంత పనిచెయ్యొద్దు. ఐనా వాళ్ళెంతిస్తారు. మహా అయితే పదివేలో ఇరవైవేలో ఇస్తారు... అంతే గదా... అదే నన్ను గనుక ఏమీ చెయ్యకపోతే ఈ మర్రి చెట్టు కింద ఏడు మూటల బంగారముంది. అందులో సగమిస్తా, కానీ మరలా ఎప్పుడూ ఇటువైపు రాగూడదు. సరేనా" అనింది. దానికి వాడు సరే అన్నాడు. దాంతో దయ్యం పోయి మూడున్నర మూటల బంగారం తీసుకోనొచ్చి వాని ముందు కుప్ప పోసింది.

వాడు సంబరంగా ఆ బంగారమంతా తీసుకోని వూరు చేరుకున్నాడు. దాంతో పెద్ద ఇండ్లు కట్టుకోని, నలభై ఎకరాల నీళ్ళు పారే పొలం కొనుక్కోని, పదిమంది పనివాళ్ళను పెట్టుకోని హాయిగా వ్యవసాయం చేసుకుంటా కాలం‌ గడపసాగినాడు.

వాని వైభోగం చూసి వదినకు కన్ను కుట్టింది. ఇదేందబ్బా వీడు వుత్తచేతులతో వూపుకుంటా పోయి నెల తిరిగేసరికల్లా పెద్ద జమీందారులెక్క తయారయినాడు. ఇందులో ఏదో‌ కథుంటాది. కనుక్కోవాల అనుకోని మొగున్ని పంపిచ్చింది. పెద్దోడొచ్చి అడిగే సరికి తమ్ముడు జరిగిందంతా పూసగుచ్చినట్టు వివరించినాడు.

తరువాత రోజు పెద్దోడు పెండ్లాం బిడ్డలను తీసుకోని అడవికి బైలుదేరినాడు. మర్రిచెట్టు పైనున్న దయ్యం వీన్ని చూసింది.

"అరే...మరలా ఎవడో ఈ చెట్టు కిందకే వస్తున్నాడే... ఎందుకైనా మంచిది దాచిపెట్టుకోవాల" అనుకోని చిటారు కొమ్మకు చేరుకోనింది. వీడు సక్కగా ఆ మర్రిచెట్టు కిందకే చేరుకున్నాడు, నెమ్మదిగా తలెత్తి జాగ్రత్తగా‌ పైకి చూసినాడు. చిటారు కొమ్మన దయ్యం కనబడింది. "ఆహా... తమ్ముడు చెప్పింది నిజమే... ఈ రోజు నా పంట పండినట్టే" అనుకునాడు.

పెద్దోడు పెండ్లాంకేసి తిరిగి "నేను పోయి యాడన్నా మంచి చెట్టుందేమో చూసొస్తా... అంతలోపు నువ్వు అన్నం చేసిపెట్టు" అన్నాడు. దానికామె "ఏందీ... ఈ అడవిలో అన్నం చేసి పెట్టాల్నా.. భలే చెప్పినావులే .. నువ్వే యాడయినా పండ్లో కాయలో వుంటే చూసి తెంపుకోనిరా... ఈ పూటకు అవే తిందాం" అనింది. వాడు పెండ్లాన్ని ఏమీ అనలేక పోయి ఒక మంచి చెట్టు చూసి దాన్ని చిన్న చిన్న ముక్కలు చేసి మరలా మర్రిచెట్టు కిందకి వచ్చినాడు. వచ్చి కొడుకుతో "రేయ్...నీవు పోయి ఆ కట్టెలన్నీ తీసుకోనొచ్చి ఇక్కడ కుప్పేయి" అన్నాడు. దానికి వాడు "ఏందీ... నేను పోయి కట్టెలు తీసుకోని రావాల్నా... ఇంకేం పని లేదా నాకు. పో...పోయి నువ్వే తెచ్చుకోపో... నేను ఆడుకోవాలి" అంటూ రయ్యిమని అక్కన్నించి వెళ్లిపోయినాడు. చేసేదేమీ లేక పెద్దోడే కట్టెలన్నీ చెట్టు కిందకి మోసుకోనొచ్చినాడు.

ఆడుకుంటున్న కూతురితో "పాపా...పో..పోయి వాటికి నార తీయి. తాళ్ళు పేనుతా" అన్నాడు. దానికా పాప "అబ్బబ్బబ్బ... ఎప్పుడు చూడు ఆ పని చెయ్యి ఈ పని చెయ్యి అని ఒగటే విసిగిస్తా వుంటావు. ఏం నీకు చేతగాదా... పో..పోయి నువ్వే చేసుకో, నేను వుయ్యాలాట ఆడుకోవాల" అంటూ వెళ్ళిపోయింది.

దాంతో వాడే ఆ కట్టెల నారంతా తీసి మంచి తాడు ఒకటి పేని పైకి చూస్తా "ఏయ్ దయ్యం.. మర్యాదగా కిందకొచ్చి నాకు మూడున్నర మూటల బంగారమిస్తావా... లేక నిన్ను ఈ తాడుతో కట్టి వూర్లోకి తీసుకొని పోయి అందరి ముందు కిందా మీదా యేసి తన్నాల్నా" అని గట్టిగా అరచినాడు.

ఆ మాటలింటానే పైనున్న దయ్యానికి తిక్క లేసింది. సర్రున కిందకొచ్చి "ఏంరా... వచ్చినప్పటి నుంచీ చూస్తావున్నా...పెండ్లాం బిడ్డల్నే సరిగా పెట్టుకోలేనోనివి....నువ్వు నన్ను తంతావా...ఏదీ తన్ను చూద్దాం" అంటూ ఒక లావు కట్టె తీసుకోని దొరికినోళ్ళని దొరికినట్టు కిందా మీదా యేసి బాగా తన్ని పంపిచ్చింది.

"ఓరి నాయనో! దురాశకి పోతే ఎంత పనైపోయింది, ఉన్న పళ్ళు రాలిపొయ్యినాయి. ఇంకెప్పుడూ దయ్యాలతో‌ పెట్టుకోంరో!" అని అన్నవోళ్ళంతా ఊళ్ళోకొచ్చి పడినారు. వాళ్ళ కత విని ఊళ్ళో జనాలంతా ఒకటే ఇక ఇకలు-పకపకలు!