పిల్లల కథలూ, పెద్దల కథలూ అంటూ రెండు వర్గాలున్నాయి కనుక ప్రతి సారీ మొత్తం మీద ఎవరి కథలు 'బాగా చదివించేలా వున్నాయా' అని వెతకటం అలవాటయింది. సాధారణంగా రెండూ సమంగానో, లేదా 'పిల్లలవే బాగున్నాయిలే ఎలా ఐనా' అనిపించేలానో వుంటాయి. ఈ సారి మాత్రం 'పెద్దల కథలే ఓ పిసరు మెరుగ్గా వున్నయేమో' అనిపించింది. పిల్లలు వ్రాసిన కథలలో అంశాలు పెద్ద క్రొత్తగా అనిపించక పోవడం వల్లనో, క్రొత్త అంశాలైనా పకడ్బందీగా లేకపోవడం వల్లనో అవి'ఫరవాలేదు' అనే లానే వున్నాయనిపించింది.

హైమవతి గారి 'దేవునికి కానుక'లో విషయం, శైలీ హుందాగా వున్నాయి. బొమ్మలు గీసిన చిత్రకారుడి పేరు తెలుసుకుందామని ఎంత వెతికినా చిక్కలేదు. 'ఎంతో పరిణతి గల, చేయి తిరిగిన చిత్రకారుడు ' అనిపించింది.

'న్యాయమూర్తి ఎంపిక' లాంటి ఇతి వృత్తిలతో చాలా కథలు చదువుతుంటాం. ఎక్కడా కూడా 'ఇది మరో కథలాంటిది'

అనిపించకుండా క్రొత్త అంశం తీసుకుని రామకృష్ణ గారు వ్రాసిన తీరు బాగుంది. ఆయన ఈ కథ ద్వారా మనదృష్టికి తీసుకు వచ్చిన విషయం విలువైనది.

రాధ గారి 'ఎవరి కోసం?' సర్వసాధారణంగా కనిపించే విషయం. పిల్లల చదువుల విషయంలోనే కాదు - పెద్దలు చేసే అన్ని పనులకీ ఇది అంతేలా వర్తిస్తుంది. మంచి విషయం ప్రస్తావించారు.

నారాయణ గారి 'కోడి పెంపకం' భలే చమత్కారంగా, ఒక్క పిసరు వ్యంగ్యంతో కూడుకుని సరదాగా వుంది. చిన్నపిల్లలకి ఈ కథని చదివి వినిపిస్తే బాగా నవ్వుకున్నారు. కాకపోతే చిన్నకోడి లాగానే వాళ్ళకీ అమ్మకోడి వేసిన వ్యంగ్య బాణాలు అర్థంకాలేదు.

బౌద్ధకథలలో అతి సాధారణమైన అంశం ద్వారా సున్నితమైన సందేశాన్నిచ్చే తీరు బాగుంది.

కెంట్ మెల్విల్ లాంటి చిన్నపిల్లాడెవడైనా సరే అతను చేసిన పని చేయడం గొప్పే, ఇక మెల్విల్ లాంటి వాడైతే చెప్పాలా?! మంచిపుస్తకం సమాచారం బాగుంది.

ఇకపోతే 'ఎటువంటి భావాలనయినా అలవోకగా పలికించి, కళ్ళని కట్టి పడేసే వీరాంజి కుంచె, ఈ సారి కాకరపువ్వుత్తులలోని కాంతులని గానీ, చిన్నారుల కళ్ళల్లో వెలుగుని కానీ సరిగా చూపించలేదెందుకు?' అనిపించింది. కొత్తపల్లి పత్రిక అట్టమీది బొమ్మ కోసం ఆసక్తిగా ఎదురు చూసే వాళ్ళ గుంపులో నేనూ వున్నాను!

పిల్లలకీ, క్రొత్తపల్లి బృందానికీ క్రిస్మస్ శుభాకాంక్షలు!