ఒక ఊరిలో రంగయ్య, శివమ్మ అనే భార్యాభర్తలు ఉండేవారు. వాళ్ళకు ఒక ఆవు ఉండేది. దాని పేరు లక్ష్మి. లక్ష్మిని వాళ్ళు చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు.

ఒక రోజు శివమ్మ చాలా రుచిగా ఉండే కూర చేసింది. అది తిని రంగయ్య "చాలా బాగుంది ఇది- రేపటికి కూడా దాచి పెట్టుకొంచెం" అన్నాడు. "సరే" అంది శివమ్మ. అక్కడే ఉన్న ఆవు శివమ్మ మాటలు విని గట్టిగా నవ్వింది.

రంగయ్య నిద్రపోయిన తరువాత శివమ్మ ఒక్కతే ఆవు దగ్గరికి వచ్చి "ఎందుకమ్మా లక్ష్మీ, నేను ఏదో అంటే నువ్వు నవ్వావు?" అని అడిగింది. "రంగయ్యకు రేపు అనేది ఉండదు. ఈ రోజు రాత్రి అతడు మరణిస్తాడు" చెప్పింది ఆవు. అది విని శివమ్మ బాధపడుతూ "ఏదైనా ఉపాయం చెప్పమ్మా, పుణ్యం కట్టుకో" అంది.

"సరే, ఇవాళ్ళ నీ భర్త కోసం యమదూతలు వస్తారు. వాళ్ళకు రుచికరమైన వంటలు చేసి పెట్టు. నువ్వు కోరిన వరం ఇస్తారు వాళ్ళు.

అప్పుడు నువ్వు నీ భర్త ప్రాణాలు అడుగు" అన్నది ఆవు.

"సరే!" అంది శివమ్మ.

ఆరోజు రాత్రి శివమ్మ నిద్రపోకుండా‌ మగనివైపే చూస్తూ కూర్చున్నది. ఆమె చూస్తూండగానే ఒక నాగుపాము వచ్చి రంగయ్యను కాటు వేయబోయింది. మెలకువగా ఉన్న శివమ్మ చటాలున ఒక బుట్టను పాము మీద పడేట్లు విసిరింది. అంతలోనే వాళ్ల ఇంటి దూలం ఒకతి విరిగి రంగయ్య మీద పడబోయింది. ఆమె చటాలున అతన్ని ప్రక్కకి లాగి కాపాడింది. చూస్తూండగానే వాళ్ల ఇంటికి మంటలు అంటుకున్నాయి. ఆ సరికి నిద్రలేచిన రంగయ్యను పట్టుకొని, రంగమ్మ బయటికి పరుగు పెట్టింది. ఆ సరికి ఊళ్ళోవాళ్ళు అందరూ అక్కడికి చేరుకున్నారు. అందరూ కలిసి నిప్పునార్పారు.

ఆ వెలుగులో దూరంగా నక్కి కూర్చున్న యమ భటులు కనబడ్డారు శివమ్మకు. ఆమె వాళ్ల దగ్గరికి వెళ్లగానే వాళ్ళు "ఇంతకే అయ్యిందనుకోకు-మేం వచ్చిన పని అయ్యేంతవరకూ మేం వెనక్కి వెళ్ళేది లేదు" అన్నారు. ఆమె వాళ్లతో మర్యాదగా మాట్లాడి "ఎట్లాగో వచ్చారు, ఆయన్ని తీసుకుపోతామంటున్నారు- అయినా దానికోసం నేనుండే ఇల్లు తగలబెట్టటం మీకు తగినపనేనా? ఇంక నేను బతుక్కునేది ఎలాగ?" అని అడిగింది. "సరే, ఏడవకు. నీ ఇంటిని మళ్ళీ మామూలుగా చేసేస్తున్నాం" అని వాళ్ళు ఇంటిని మళ్ళీ మామూలుగా చేసేశారు.

"బాగుంది- ఇంటికి వచ్చిన అతిథులు మీరు. మిమ్మల్ని వట్టి చేతులతో‌ పంపితే ఇక నాకు ఎట్లా జరుగుతుంది? ఒక్క పది నిముషాలు ఆగండి. వేడి వేడిగా అలచంద వడలు వేసిస్తాను. తినిపోదురు" అన్నది శివమ్మ. అంతవరకూ ఊరికే నక్కి కూర్చుని కష్టపడుతున్న యమభటులకు 'అలచంద వడలు' అనగానే నోరూరింది. శివమ్మ ఇంక వాళ్ల అంగీకారం కోసం ఎదురుచూడకుండా అప్పటికప్పుడు అలచందలు రుబ్బి, వేడి వేడి వడలు చేసి పెట్టింది వాళ్ల ముందు. అసలే యమభటులాయె, చాలా సేపటినుండి ఎదురు చూస్తూ కూడా ఉన్నారేమో, ఒక్కొక్కరూ ఇరవైఐదు వడలు లాగించేశారు వాళ్ళు.

అందరూ కడుపారా తిని, తృప్తిగా త్రేన్చాక, తినేందుకు ఆకు-వక్క కూడా తెచ్చిచ్చింది శివమ్మ. అవి కూడా పుచ్చుకొని, వాళ్ళు 'సరే మరి ఇంక రంగయ్యను తీసుకొని వెళ్ళొస్తాం' అని బయలుదేరారు.

శివమ్మకు ఇంకేం చెయ్యాలో అర్థం కాలేదు.

'అయ్యో, మీరు వచ్చింది పల్లెకా, పట్టణానికా? పల్లెకు వచ్చి కడుపునిండా కమ్మని పాలు త్రాగి వెళ్లకపోతే మా పాడి అంతా ఏం కాను?' అన్నది లక్ష్మి, శివమ్మకు మాటను అందిస్తూ.

'అవునవును- ఇంకో పది నిముషాల్లో పాలు పితికేస్తాను. చల్లగా కాసిని పాలు త్రాగి బయలు దేరుదురు' అన్నది శివమ్మ- నులకమంచాలను తెచ్చి వేసి, లక్ష్మిని పాకలో గుంజకి కట్టేస్తూ.

యమభటులు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. కానీ బాగా తిని ఉన్నారేమో, వాళ్లకు కొంచెం ఆయాసంగానే ఉన్నది.

నులకమంచాలు వాళ్లను చాలా ఆకర్షిస్తున్నాయి కూడా. చివరికి బద్ధకం గెల్చింది. వాళ్ళు విశ్రాంతిగా కూర్చున్నారు మంచాలమీద. ఇంకో రెండు నిముషాలలో వాళ్ళు గురకలు పెట్టి నిద్రపోతున్నారు!

శివమ్మ లక్ష్మి పాలు పితుకుతూ 'మరి ఇప్పుడు ఏం చేద్దాం లక్ష్మీ, వీళ్ళు నిద్రలేచారంటే రంగయ్యని ఎత్తుకుపోతామని మళ్ళీ పాట మొదలుపెడతారు' అన్నది విచారంగా.

లక్ష్మి 'ఏం కాదులే శివమ్మా, ఇంకేదైనా అడ్డం వేద్దాంలే' అన్నది చిక్కని పాలు మరిన్ని ధారగా వదులుతూ.

పాలు బాగా కాగి, ఎర్రని మీగడ కట్టేసరికి మరో‌ రెండు గంటలైంది. అంతలో యమభటులు గబుక్కున లేచి కూర్చున్నారు- గుండెలమీద చెయ్యివేసుకొని "అయ్యా, వచ్చేస్తున్నాం అయ్యా, ఇంకేమీ ఆలస్యం చెయ్యం దొరా" అంటూ.

శివమ్మ చటుక్కున వేడి వేడి పాలు తీసుకొచ్చి వాళ్ల ముందు పెట్టింది.

"అయ్యో, పాలు చాలా వేడిగా ఉన్నాయమ్మా తల్లీ! అటు చూస్తే దొర పిలుస్తున్నాడు. మా కష్టం కూడా చూడు. అన్నపూర్ణమ్మ తల్లివి- మీ రంగయ్యని తీసుకెళ్తుంటే మాకూ బాధగానే ఉంది. కానీ ఏం చేయగలం, మీ ఇంట్లో ఉన్నది ఈ ఒక్క రంగయ్యే కదా? వేరే రంగయ్య ఎవరూ‌లేరు కదా, మేమేం చెయ్యాలి చెప్పు?!" అన్నాడొక యమభటుడు, వేడి వేడి పాలని ఊదుకొని జుర్రుకుంటూ.

"వేరే రంగయ్య లేకేమి? ఇదిగో, నా చెవి మీద కూర్చొని, నా రక్తం తాగి బలుస్తున్న పిడుదు- వాడు రంగయ్య కాదూ?" అన్నది లక్ష్మి, అతని మాటని అందుకొని.

"అవునా!? నిజంగానే ఈ పిడుదు పేరూ రంగయ్యేనా?" అన్నాడు యమభటుడు ఆవు చెవికేసి పరీక్షగా చూస్తూ.

"అయ్యో! ఈ మనిషి రంగయ్య ఎంత మంచివాడో మా పిడుదు రంగయ్య అంత దుర్మార్గం వాడు. మీరు ఈ ఇంట్లోంచి ఎవరినైనా తీసుకెళ్ళాల్సి వస్తే మొదట వాడినే తీసుకెళ్ళాలి- అసలు మీరు వచ్చిందీ పిడుదు రంగయ్య కోసమే అయి ఉంటుంది- సరిగ్గా కనుక్కోండి- తప్పు ప్రాణాన్ని తీసుకెళ్తారేమో, మీ దొర ఊరుకోడు" అంది ఆవు అమాయకంగా.

యమభటులు ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. "అవునురా, మనం తీసుకెళ్ళాల్సింది ఆ పిడుదు గాడినే- పదండి వాడిని తీసుకొని పోదాం. దొర ఏమీ అనడుగాని" అన్నాడు వాళ్లలో ఒకడు, శివమ్మ కేసి కృతజ్ఞతతో చూసి, అలచంద వడల్నీ, వేడి వేడి పాలనీ గుర్తుచేసుకుంటూ.

"తీసుకెళ్లండి పాపం, తప్పుడు ప్రాణాలు తీసుకెళ్తే మీకూ కష్టం" అంది శివమ్మ, "మీ దొర కాదంటే మళ్ళీ వద్దురు లెండి" అని జోడిస్తూ.

"మళ్ళీ రాం లేమ్మా, ఎవరో‌ఒక రంగయ్య- ఈ ఇంట్లోంచి దొరికితే చాలు, మా దొర ఏమీ అనడు గానీ- చల్లగా ఉండు" అని

యమభటులు పిడుదు ప్రాణాలు చేతబట్టుకొని మాయం అయిపోయారు.

"పిడుదు రంగయ్యకోసం ఊరందరికీ భోజనాలు పెట్టిద్దాం లక్ష్మీ" అన్నది శివమ్మ , ఆవుని ఆప్యా యంగా నిమురుతూ.