అనగనగా పెద్ద సముద్రం ఒడ్డున ఒక చిన్న ఊరు ఉండేది. సముద్రంలో రకరకాల చేపలు ఉంటాయి కదా; అందుకని ఆ ఊళ్ళోవాళ్లు అందరూ పడవలు వేసుకొని, సముద్రంలోకి వెళ్ళి, చేపలు పట్టేవాళ్ళు. వాళ్లలో రాము అనే జాలరి పిల్లవాడు ఒకడు ఉండేవాడు. వాళ్ళ నాన్నతో కలసి అతను కూడా రోజూ చేపలు పట్టడానికి వెళ్ళేవాడు.

ఒకసారి వాళ్ళ నాన్నకు జ్వరం వచ్చింది. అందువల్ల రాము ఒక్కడే చేపల వేటకు వెళ్ళాడు: అట్లా చేపలను పట్టుకుం‌టూ-పట్టుకుంటూ.. చాలా దూరం వెళ్ళాడు. సాయంత్రం అయ్యాక చూసుకుంటే తను ఏ ప్రాంతంలో ఉన్నాడో కూడా అర్థం కాలేదు! సముద్రంలోనే ఎక్కడో తప్పిపోయాడన్న-మాట! ఇప్పుడేం చేయాలి? చీకటి పడ-వస్తున్నది. దూరంగా కొన్ని పక్షులేవో ఎగురుతూ కనబడ్డాయి.. అంటే అక్కడేదో భూభాగం ఉండి ఉండచ్చు! రాము పడవను ఆ వైపు పోనిచ్చాడు. నిజంగానే అక్కడొక దీవి ఉన్నది. దాని ఒడ్డు కూడా పడవలు ఆగేందుకు అనువుగా ఉన్నది.

రాము తను వచ్చిన పడవను ఒడ్డుకు చేర్చి, దాన్ని అక్కడే ఒక చెట్టుకు కట్టేశాడు. ఎలాగో ఒకలా ఆ దీవిమీదే రాత్రంతా గడిపి, ఉదయాన్నే వెనక్కి వెళ్ళే మార్గం చూసుకుందామనుకున్నాడు. కానీ అక్కడి సముద్ర తీరం పడుకునేందుకు అనువుగా లేదు; దీవి లోపలి పరిస్థితి తనకు తెలియదు. కొద్ది సేపు తటపటాయించిన తర్వాత, అతను దీవి లోపలికి వెళ్ళి చూడాల్సిందేనని నిశ్చయించుకున్నాడు.

దీవి అంతా నిర్మానుష్యంగా ఉన్నది. అక్కడక్కడా చిన్న చిన్న దుబ్బలూ, అడపా దడపా ఓ మోస్తరు ముళ్ళ చెట్లూ తప్ప, వృక్షసంపద కూడా పెద్దగా లేదు అక్కడ. అయితే త్వరలోనే రాముకి ఒక కాలి బాట దొరికింది! ఆ బాట వెంబడి నడుస్తూ పోయి, కొద్దిసేపటికి అతనొక గుహను చేరుకున్నాడు.

గుహ విశాలంగా, మనుషులు ఉండేందుకు చాలా అనువుగా ఉన్నది. దాన్నీ, కాలిబాటనూ చూస్తే, ఇక్కడెవరో మనుషులు నివసిస్తూ ఉన్నట్లుగానే అనిపించింది మరి. కానీ ఎంత శ్రద్ధగా విన్నా మనుషులు ఉన్న అలికిడేమీ వినబడలేదు, అతనికి!

అక్కడి నిశ్శబ్దానికి రాముకి కొంచెం భయం వేసింది. అయినా ధైర్యం తెచ్చుకొని గుహలోనే నడుస్తూ ముందుకు వెళ్ళాడు. గుహలో క్రమంగా చీకటి నిండుకున్నది. ఆకాశంలో చంద్రుడు కూడా రాలేదేమో మరి- గుహ చీకటి గుయ్యారంగా ఉన్నది.

చీకట్లోనే మెల్లగా గోడను పట్టుకొని అడుగులు ముందుకు వేస్తూ పోయాడు రాము. అకస్మాత్తుగా అతని కాళ్లక్రింద నేల జరిగినట్లయింది- దఢాలున ఒక సొరంగంలోకి జారి పడ్డాడతను! ఆ దెబ్బకు అతని కళ్ళు బైర్లు కమ్మాయి. ఎంత సేపు అలా పడి ఉన్నాడో తెలియదు. అతనికి మెలకువ వచ్చేసరికి ఎక్కడినుండో వెలుగు మీద పడుతున్నది. బహుశ: తెల్లవారి ఉండాలి.

ఇంకొంచెం తేరుకున్నాక రాము చుట్టూతా కలయ చూశాడు. అక్కడ, అతని చుట్టూ చెల్లా చెదరుగా చాలా సంపద పడి ఉంది! బంగారు-వెండి నగలు, మెరిసే వజ్రాలు, మణులు- ఇంకా ఏవేవో పడి ఉన్నై; అక్కడంతా. అయితే అవన్నీ ఉండి ఏం లాభం? రాముకి ఆకలి వేస్తున్నది. దాహంగా ఉంది. "అక్కడ తినేందుకు, తాగేందుకు ఏవీ ఉన్నట్లు లేదు. ఇక్కడెవరు ఉంటారు? ఈ సంపదంతా ఇక్కడికి ఎలా వచ్చి చేరుకున్నది?" దేనికీ జవాబు మాత్రం దొరకలేదు.

రాము మెల్లగా లేచి నడుస్తూ తనకు కనిపించిన దారులన్నిటా తిరగటం మొదలు పెట్టాడు. అక్కడంతా ఎక్కడ పడితే అక్కడ సంపద కుప్పలు తిప్పలుగా పడి కనిపించింది. "ఈ సంపదలో కొంత తీసుకెళ్తే మా నాన్నను మంచి ఆసుపత్రిలో చూపించచ్చు" అనిపించింది వాడికి. అక్కడున్న నగల్లో నాలుగైదింటిని మాత్రం మూటగట్టుకొని బయట పడే మార్గం కోసం వెతుక్కుంటూ వెలుగు వస్తున్నవైపుగా అడుగులు వేయసాగాడు రాము.

నేలంతా తడి తడిగా అయ్యింది.. ముందు ఏదో నీటి కుంట ఉన్నట్లుంది- కొద్ది సేపటికి రాము ఆ కుంటలోంచే నడిచి పోవాల్సి వచ్చింది!

అయితే అంతలోనే అతని కాళ్ళకు ఏదో తగిలినట్లు అనిపించింది. 'ఏమిటా ' అని క్రిందికి చూశాడు: అక్కడ ఒక మనిషి పడివున్నాడు!

రాము భయంతో కెవ్వుమని అరిచాడు. అంతటా నిశ్శబ్దంగానే ఉంది. తన ఊపిరి చప్పుడు తనకే తెలుస్తున్నది- దానితోబాటు మరొక శ్వాస కూడా!

రాము అటూ ఇటూ చూశాడు- ఎవ్వరూ లేరు...కానీ తనకు వినబడుతున్న శ్వాస ఎవరిది? మెల్లగా అతను క్రిందికి వంగి, తన కాళ్ళకు తగిలిన శరీరాన్ని పరిశీలనగా చూశాడు- నిజమే! ఆ శరీరంలో ప్రాణం ఉన్నది! శ్వాసిస్తున్నాడతను!

రాము గబగబా ఆ శరీరాన్ని కదిలించి చూశాడు. -ప్రయోజనం లేదు: అతను మంచి నిద్రలోనైనా ఉండి ఉండాలి; లేదా మూర్ఛ-పోయి ఉండాలి.. రాము వెనక్కి వెళ్ళి, నీటికుంటలోంచి కాసిని నీళ్ళు తీసుకువచ్చి అతనిముఖం మీద చల్లాడు.

చల్లటి నీరు తగిలాక కొంతసేపటికి ఆ మనిషికి మెలకువ వచ్చింది. లేచి కూర్చోగానే మొదట రాముని చూసి భయపడ్డాడతను.

రాము అతనికి కాసిని మంచినీళ్ళు అందించి, తేరుకోనిచ్చాడు. తర్వాత అతన్ని "నీ పేరు ఏమిటి? ఇక్కడకు ఎలా వచ్చావు?"-లాంటి ప్రశ్నలు అడిగాడు.

అతను చెప్పాడు, ఏడుస్తూ- "నా పేరు సోము. సముద్రంలో తప్పిపోయి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ చాలా సంపద కనబడింది. నేను ఆ సొమ్మునంతా తీసుకుని బయలుదేరాను. అయితే ఎటు వెళ్ళాలో తెలీలేదు. ఈ గుహలోనే దారి తప్పి అటూ ఇటూ తిరగటం మొదలు పెట్టాను.

అంతలో ఎక్కడినుండి వచ్చారో, మరి- కొందరు బందిపోట్లు వచ్చి మీద పడ్డారు. నన్ను కొట్టి ఇక్కడ పడేశారు. నిన్ను చూడగానే నువ్వూ వాళ్ళలో ఒకడివే అనుకున్నాను.." అని చెప్పాడు.

అంతలోనే గుహలో ఎక్కడినుండో "గర..గర.." మంటూ శబ్దం ఒకటి వినవచ్చింది. ఆ శబ్దం వినగానే సోము భయంతో వణికిపోతూ, నేలమీద బోర్లా పడుకున్నాడు. తనతోబాటు రాముని కూడా నేలమీదకి లాగి పడేసి, "చప్పుడు చేయకు" అన్నట్లు నోటిమీద వేలు వేసుకున్నాడు. రాముకి పరిస్థితి అర్థమైంది. తనూ చప్పుడు చేయకుండా, కదలకుండా మొద్దులాగా పడి ఉండిపోయాడు.

అంతలోనే బందిపోట్లు అక్కడికి వచ్చి చేరుకున్నారు. అందరూ పెద్దగా ఏదో మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ వీళ్ళున్న చోటికి వచ్చారు. అయితే వీళ్ళ అదృష్టం బాగున్నట్లుంది- నేలమీద పడిఉన్న ఇద్దరినీ వాళ్ళు అస్సలు పట్టించుకోలేదు: తమతో పాటు మళ్ళీ ఏవేవో మూటలు తెచ్చినట్లున్నారు- వాటిని లోపల దాచి పెట్టి ఒక్కరొక్కరుగా అందరూ వెళ్ళిపోయారు.

రాము-సోములకు వాళ్ళు ఎటువైపుగా వెళ్ళారో చూసేందుకు కూడా‌ ధైర్యం చాలలేదు. అయితే రాము తెలివిగా వాళ్ల అడుగుల చప్పుడును బట్టి ఏ దిశగా వెళ్ళారో గుర్తు పెట్టుకున్నాడు. దొంగలందరూ వెళ్లిపోయాక కూడా అట్లా ఇద్దరూ చాలా సేపు కదలకుండా‌ పడి ఉన్నారు. ఆ తర్వాత ముందుగా రాము తలెత్తి చూసి, ఎవరూ లేరని నిర్ధారించుకొని, సోముని తట్టి లేపాడు. అంతకు ముందు విని ఉన్న శబ్దాల ప్రకారం దారిని ఊహించుకుంటూ మెల్లగా, జాగ్రత్తగా ముందుకు సాగారు ఇద్దరూ. కొంతసేపటికి ఇద్దరూ గుహలోంచి బయటికి రాగలిగారు!

బయటికి రాగానే రాము తను పడవను కట్టిన చెట్టు దగ్గరికి తీసుకెళ్ళాడు సోమును. పడవ అక్కడే, వదిలినది వదిలినట్లుగా ఉన్నది! దొంగలు ఆ పడవను చూసినట్లు లేదు- చూసి ఉంటే వాళ్ళు దాన్ని నాశనం చేసి ఉండేవాళ్ళేమో, మరి. ఇప్పుడు ఇద్దరూ గబగబా ఆ పడవలోకి ఎక్కి, తెడ్లు వేసుకుంటూ సముద్రంలోకి ప్రయాణించారు.

రాము దారి తప్పాడుగానీ, సోముకి ఆ ప్రాంతాలన్నీ‌ బాగా తెలిసినవే. అతను దారి చూపగా ఇద్దరూ త్వరలోనే రాము వాళ్ల ఊరి దగ్గరికి చేరుకున్నారు.

"సముద్రంలో ఎక్కడో అంత సంపద ఉందికదా, దాన్ని అలా పూర్తిగా వదిలేసి వచ్చామే; కనీసం వెళ్ళి ఆ సంగతి పోలీసులకు చెప్పి రావాలి! సోముని కూడా‌వాళ్ళ ఇంటికి చేర్చాలి-" అనుకుంటున్నాడు రాము:

-అంతలోనే వాళ్లమ్మ వాడిని తట్టి లేపింది: "ఒరేయ్! రామూ! ఏంటిరా ఇంత మొద్దు నిద్ర?! ఇవాళ్టి నుండి బడికి వెళ్తానన్నావు; ఇంకా తయారవ్వలేదే, మరెలాగ?" అంటూ.

అప్పుడు అర్థమైంది రాముకి- 'ఇదంతా కల' అని!

"అబ్బ!‌కలలు ఎంత బాగుంటాయో కదా!" అనుకున్నాడు వాడు; లేచి కూర్చొని ఒళ్ళు విరుచుకుంటూ.