చాలా నెలల క్రితం కొత్తపల్లిలో ఒకసారి 'క్రిస్టఫర్ పాలినీ' అనే అబ్బాయి గురించి రాసాను- గుర్తుందా? 'పదిహేనేళ్ళ వయసులోనే అతను ఎరాగాన్ అన్న నవల రాసాడనీ, ఆపైన దాన్ని కొనసాగిస్తూ మరి మూడు నవలలు రాసాడు' అనీ చెప్పాను అప్పట్లో .
ఒక ముప్పై ఏళ్ల క్రితం, 'గార్డన్ కోర్మన్' అనే అబ్బాయి కూడా అదే పని చేసాడు. అయితే, విశేషం ఏమిటంటే, అతను ఆ తరువాత కూడా తరచు రచనలు చేస్తూ, పిల్లల రచయితగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు అతనికి దాదాపు యాభై ఏళ్ళు! పెద్దయిన కోర్మన్ ఇప్పుడు కెనడాలో ప్రముఖ పిల్లల రచయిత! ఈమధ్య ఆయన గురించి చదువుతూ ఉంటే, అయన కూడా యువకెరటమే కదా అనిపించింది.
కోర్మన్ స్కూల్లో ఏడవ తరగతి లో ఉన్నప్పుడు, ఒకసారి ఇంగ్లీషు క్లాసులో వాళ్ళ టీచర్ ఒక నవల రాయమని హోం వర్క్ ఇచ్చాడట! (ఇప్పుడు అలాంటి హోం వర్కు ఎవరైనా ఇచ్చారంటే మన పని సరి!) అలాగ హోం వర్క్ కోసం అని చెప్పి కోర్మన్ ఒక నవల రాసేశాడు. అయితే అట్లా రాసి ఊరుకోకుండా, వాళ్ళ అమ్మ సాయంతో దాన్ని 'పిల్లల పుస్తకాలు ప్రచురించే సంస్థ' ఒకదానికి పంపించాడు కోర్మన్. వాళ్లకి అది నచ్చింది; దాన్ని ప్రచురించేశారు! అట్లా పన్నెండేళ్ళ వయసులో కోర్మన్ రచయితల జాబితాలోకి చేరుకున్నాడు. అట్లా స్కూలు చదువులు పూర్తి చేసుకునే లోపలే ఐదు పుస్తకాలు ప్రచురించాడట తను! ఇంకేముంది, వరస మొదలైపోయింది. కోర్మన్ రచనా ప్రస్థానం స్కూల్ తో ఎట్లా ఆగుతుంది ఇంక? బడి చదువులు పూర్తయిన తరువాత కూడా అతను రాస్తూనే ఉన్నాడు: గత ముప్పై ఏళ్లలో 60 పుస్తకాల దాకా రాసాడు! అతను రాసిన పుస్తకాలు లక్షలకొద్దీ కాపీలు అమ్ముడుపోయాయట కూడానూ!
కోర్మన్ గురించి ఒక చక్కని పిట్టకథ: అతను బాగా చిన్నగా ఉన్నప్పుడు ఎవరైనా "నువ్వు పెద్దయ్యాక ఏమౌతావు కోర్మన్?" అని అడిగితే, "నేను కుక్కని అవుతాను" అనేవాడట! పైగా, దానికి సిద్ధంగా ఉండాలని, టేబుల్ కింద కూర్చుని తినడం కూడా ప్రాక్టీసు చేసేవాడట!!
బాల రచయితగాను, పెద్దయ్యాక బాలల రచయితగాకూడాను కోర్మన్ ఎన్నో అవార్డులు అందుకున్నాడు. మామూలుగా, చాలామంది చదివినట్లుగానే కాలేజీ చదువులు చదివాడు. సినిమాలకి కథలు రాయడం గురించి, సినిమాలు తీయడం గురించి డిగ్రీలు చేసాడు. అతను రాసిన కథల పుస్తకాల్లో "మండే నైట్ ఫుట్బాల్ క్లబ్" అన్న సిరీస్ ని డిస్నీ చానెల్ వారు నాలుగేళ్ళ పాటు "ది జెర్సీ" అన్న పేరుతో సీరియల్ గా కూడా వేసారట! ఇప్పుడు కూడా ఆయన తరుచు పుస్తకాలు రాస్తూనే ఉన్నాడట. 'మొన్న జనవరిలో కూడా ఒక పిల్లల పుస్తకం విడుదలైంది' అని, 'ఇంకా కొన్ని పుస్తకాలు విడుదల కాబోతున్నాయి' అనీ చదివాను.
ఇంతకీ, ఈసారి చిన్న పిల్లల గురించో, కొంచెం పెద్దపిల్లల గురించో కాకుండా, ఈయన గురించి చెప్పడానికి ఒక కారణం ఉంది. "ఎప్పుడూ ఇలా పిల్లల్ని గురించి, వాళ్ళు చేసిన పనుల గురించీ రాస్తున్నామే, వీళ్ళలో ఎంత మంది పెద్దయ్యాక కూడా తాము పిల్లలుగా చేసిన పనుల్ని కొనసాగిస్తారు?" అని సందేహం కలిగింది ఆమధ్యన. అలా, "చిన్నప్పుడు ఏదో చేసి పేరు తెచ్చుకున్నాక, దాన్ని కొనసాగించిన వాళ్ళు ఎందరు?" అని వెదుకుతూ ఉంటే, ఈ గార్డన్ కోర్మన్ గురించి తెలిసింది నాకు! బాగుంది కదూ?
'కొత్తపల్లికి కథలూ, బొమ్మలూ వగైరా పంపే అందరూ కూడా, అలాగే తమ రచనాసక్తిని కొనసాగిస్తారు' అని ఆశిస్తున్నాను. కొన్నేళ్ళ తరువాత, అప్పుడు మీ గురించి కూడా నేను ఇలా రాస్తానేమో - "ఫలానా అమ్మాయి, చిన్నప్పుడు చిన్ని చిన్ని కథలు అవీ రాస్తూ ఉండేది, ఇప్పుడు ఫేమస్ రచయిత్రి అయిపోయింది" అని :-)