రామాపురంలో నివసించే బలరాముడికి 'పంతం రాముడు' అని పేరు. ఏమంటే వాడికి పంతం ఎక్కువ. ఏ పని చేసినా పంతం కొద్దీ చేసేవాడు వాడు.

"అట్లా పంతం పట్టాల్సిన అవసరం లేదురా, పంతంవల్ల చాలా శక్తి వృధా అవుతుంది" అని చెబుతుండేది, వాళ్ళ అమ్మ. అయినా వాడు ఆమెను పట్టించుకునేవాడు కాదు. తను ఏదనుకుంటే దాన్ని సాధించాలనే మనస్తత్వం వల్ల వాడంటే చాలా మందికి అయిష్టం ఏర్పడింది. వాడికి దగ్గరి స్నేహితులంటూ ఎవరూ లేకుండా‌ పోయారు.

తన పంతం వల్ల ఎంత నష్టమో తెలిసింది వాడికి- కానీ ఏం చేస్తాడు, పంతం అలవాటైపోయింది మరి! అందుకని పంతం పట్టి అట్లాగే ఉండటం మొదలు పెట్టాడు మారకుండా. పైపెచ్చు అందరికీ చెప్పేవాడు- "పంతం‌పట్టి చేస్తే ఏ పనైనా సాధించచ్చు. సమస్య ఏమిటంటే పంతం పట్టటం అందరికీ రాదు" అనేవాడు.

రామాపురంలో ఏటా వినాయక చవితిని గొప్పగా జరుపుకొనేవారు. వినాయకుడంటే బలరాముడికి కూడా చాలా ఇష్టం. ఆసారి వినాయకుడిని తమ వీధిలోనే పెట్టాలని పంతం పట్టాడు వాడు. కానీ ఊళ్ళోవాళ్లముందు వాడి పంతం ఎందుకు నెగ్గుతుంది? ఊళ్ళోవాళ్ళు ఎప్పటిమాదిరే ఊరి నడుమనున్న ఆటస్థలంలో వినాయకుడిని ప్రతిష్ఠిద్దామన్నారు.

దాంతో బలరాముడికి చాలాకోపం వచ్చింది. వాడు పూనుకొని, తనే ముందుపడి, వాళ్ళనుండి-వీళ్ళనుండి చందాలు సేకరించి, తమ వీధికోసమనే ప్రత్యేకంగా ఒక వినాయకుడిని తీసుకొచ్చాడు!

అట్లా వినాయకుడినైతే తెచ్చాడుగానీ, మరి దానికోసం పందిరి కట్టేదీ, పత్రిని తెచ్చేదీ, ప్రసాదాలు తయారు చేసేదీ- ఇవన్నీ వాడే ముందుండి చెయ్యాల్సి వచ్చింది. ఆ సమయానికి దేవుడే పంపినట్లుగా ఎవరెవరో వచ్చి వాడికి సాయం అందించారు; కానీ వాడికి ఎవ్వరినీ కలుపుకొని పోవటం రాదు: అలా వచ్చిన వాళ్లంతా 'వీడితో మనకెందుకు' అని వెనక్కి తగ్గారు. చివరికి ఇరవైనాలుగు గంటలూ దేవుడి పందిరిలోనే కూర్చొని కాపలా కాయాల్సి వచ్చింది వాడికి! సరిగ్గా తిండిలేక, నిద్రలేక చాలా బలహీనంగా తయారయ్యాడు వాడు.

"ఒరే! దేవుడి పని అందరిదీరా! అందరితో కలిసి పని చెయ్యాలి నువ్వూనూ! నీ మాటే చెల్లాలని పంతం‌ పడితే అసలుకే మోసం వస్తుంది!" అని వాళ్లమ్మ పోరుతుంటే వాడికి చాలా చికాకు వేసింది. "ఇప్పుడేమైందని? నేనే స్వయంగా వెళ్ళి నిమజ్జనం కూడా చేసి వస్తాను- ఎవ్వరి సాయమూ అవసరం లేదు నాకు" అన్నాడు వాడు.

చూస్తూండగానే తొమ్మిది రోజులు గడిచాయి. పంతం రాముడికి తన పంతం నెగ్గిందని తృప్తి కలిగింది. ఊళ్ళోవాళ్ళు వినాయకుడిని మేళతాళాలతో ఘనంగా ఊరంతా ఊరేగించి, దూరంగా ఉన్న 'గిలకల బావి'లో నిమజ్జనం చేసేందుకు తీసుకెళ్ళారు. అది తెలిసాక రాముడికి తన వినాయకుడినీ అలా సత్కరించాలని సంకల్పం కలిగింది.

"నీ ఒక్కడి వినాయకుడేగదా, మన బావిలో నిమజ్జనం చేద్దాంలే" అన్నది వాళ్ళమ్మ. కానీ ఒకసారి పంతం పట్టాక వెనక్కి తగ్గే పిల్లవాడు కాదు కదా, వాడు?! తను కూడా‌ ఆ వినాయకుడిని గిలకల బావిలోనే నిమజ్జనం చేస్తానని పట్టు పట్టాడు.

వినాయకుడిని తన సైకిల్ పైన కూర్చోబెట్టి, బ్యాటరీకి తగిలించిన టేపు రికార్డరులో బాజా బజంత్రీల క్యాసెట్టు వేసుకొని, ఊరంతా తిరిగి చివరికి గిలకల బావిని చేరుకున్నాడు వాడు. ఆ సరికి కొద్ది కొద్దిగా చీకటి పడుతున్నది. గిలకల బావి దగ్గర ఎవ్వరూ లేరు. బావిలో అంతకు ముందు ఊళ్ళోవాళ్ళు వదిలిన పూల దండలు-వగయిరాలు తేలుతున్నాయి. బలరాముడు తను తెచ్చిన వినాయకుడి విగ్రహాన్ని పైనుండే బావిలోకి గిరాటు వేసి, ఎక్కడ పడిందో చూద్దామన్నట్లుగా ముందుకు వంగాడు. ఏమైందో ఏమో మరి- మరుక్షణంలో వాడు బావిలోకి తలక్రిందులుగా పడిపోయాడు!

బలరాముడు ఊరి పిల్లవాడన్నమాటేగానీ, వాడికి ఈదటం ఏమాత్రం రాదు. నీళ్ళలో పడి వాడు రెండు మునకలు వేసి తన్నుకులాడేసరికి, అంతకు ముందు ఊళ్ళోవాళ్ళు వదిలిన వినాయకుడి విగ్రహం తగిలింది వాడి కాళ్లకు. వాడు తంటాలు పడి దాని మీదనే ఎక్కి నిల్చొని, "కాపాడండి! కాపాడండి!" అని అరవటం మొదలు పెట్టాడు.

అంతలో వాడు నీళ్ళలోకి వదిలిన వినాయకుడి విగ్రహం లేచి నిల్చున్నది- నీళ్ళలోనే!

"నువ్వు దేన్నిరా, నిమజ్జనం చేసింది?" వినాయకుడి గొంతు గిలకల బావిలో ప్రతిధ్వనించింది.

బలరాముడు బెదురుకున్నాడు. విగ్రహం మాట్లాడటం చూసి వాడికి మతి పోయినట్లు అయ్యింది.

"నువ్వు నిమజ్జనం చేయాల్సింది నీ దురలవాట్లనిరా, ఒట్టి మట్టి బొమ్మని కాదు! ఇంతకీ చెప్పు! నువ్వు ఈసారి వినాయక చవితి తర్వాత ఏ అలవాటును నిమజ్జనం చేస్తున్నావో చెప్పు!" అన్నాడు వినాయకుడు నీళ్లను అల్లల్లాడించుకుంటూ.

ఆ సందర్భంలో బలరాముడికి "శుక్లాంబర ధరం"కూడా గుర్తుకు రాలేదు- ఇంకేం చెబుతాడు, వినాయకుడికి?

"చెప్పు! ఊళ్ళో వాళ్లంతా కలిసి నన్ను కొలుస్తుంటే, నువ్వొక్కడివే వేరే దారి ఎందుకు పట్టావు? ఎందుకు నీకంత పంతం? నీ పంతాన్ని నిమజ్జన చేస్తానంటే చెప్పు, మీ వాళ్లనెవరినైనా రప్పించి నిన్ను కాపాడతాను" అన్నాడు వినాయకుడు.

"సరే సరే " అన్నాడు బలరాముడు, కాళ్ల క్రింద విగ్రహం కరిగిపోతుంటే సర్దుకుంటూ.

అంతలోనే వాడు నీళ్లలోకి పడటమూ, వాళ్ళ చిన్నాన్న గబుక్కున వాడి చొక్కాని పట్టుకొని పైకి లాగటమూ జరిగాయి.

"నువ్విక్కడికి ఎట్లా వచ్చావు?" అని వాడు వాళ్ల చిన్నాన్నను అడిగే అవకాశమే లేకపోయింది. ఆయన వాడిని భుజాన వేసుకొని, బావికి ఉన్న మరల సందుల్లో కాళ్ళు పెట్టి పైకి ఎక్కి వచ్చాడు. అక్కడినుండి ఇంటికి వెళ్ళే వరకూ బలరాముడు ఏమీ మాట్లాడలేదు.

ఇక ఆ తర్వాత మెల్లగా వాడు అయినదానికీ-కాని దానికీ పంతం పట్టటం తగ్గిపోయింది!

"మావాడి పంతాన్ని తగ్గించి నువ్వు మాకెంత సాయం చేశావో చెప్పలేమురా!" అని బలరాముడి అమ్మ-నాన్నలు చిన్నాన్నను అభినందించారు గుట్టుగా.