కవితలు
అండ
బాల్యంలో అమ్మానాన్నల -
విద్యార్థి దశలో అధ్యాపకుల -
ఆపద సమయంలో ఆప్తుల -
విధి నిర్వహణలో అధికారుల-
సంసార జీవితంలో భాగస్వాముల-
ముసలి తనంలో అందరి-
"అండ” అవసరం!
ఎక్కడ అది కొరవడినా
అవుతుంది జీవితం గందరగోళం!
- షేక్ రియాజుద్దీన్‌అహ్మద్, అనంతపురం
తరువులు
అమ్మవోలే ఆదరిస్తాయి తరువులు
వాన వచ్చినప్పుడు గొడుగులా
ఆకలి వేసినపుడు తిండిలా
నిద్ర వచ్చినప్పుడు ఊయలగా
ఆడుకునే వేళలో ఆటబొమ్మగా
ఎండ ఉన్నప్పుడు నీడగా
ఉక్కుగా ఉన్నప్పుడు విసనకర్రగా
ఆదరించే అమ్మలాంటి వృక్షాలని
అంతం చేయకురా మిత్రమా!
రచన: సి.కృష్ణవేణి, 9వతరగతి, ప్రకృతిబడి.
ప్రాస కవిత్వం!
నేనే, చెబుతున్నా!
నా పేరు "మీన"
తెచ్చాను ఒక నీళ్ళ "బాన"
దాన్ని పెట్టాను "నేలపైన"
దీని పై వాలింది "మైన"
గానం చేసింది ఆ "పైన"
గానం అర్థమైందా "ఇప్పటికైన"
రచన: కె.శరత్‌చంద్రిక,7వతరగతి,శ్రీ సాయినాథ్ స్కూలు, పొదలకూరు, నెల్లూరు.
జోకులు
ముదురు!
టీచర్ (కోపంగా): రామూ! సోమవారం నుండి శుక్రవారం వరకు ఐదురోజులూ- హోంవర్కు చెయ్యకుండా వచ్చి తిట్లు తిన్నావు. నీ గురించి హెడ్మాస్టరు గారికి ఫిర్యాదు చేస్తాను. నువ్వు ఏం చెప్పుకుంటావో ఆయనకే చెప్పుకో.
రాము: నేనేం చెప్పుకుంటాను సార్, కనీసం శనివారం-ఆదివారం అన్నా బడికి శలవలు ఇచ్చినందుకు థాంక్స్ చెప్పుకుంటాను, అంతే!
తెలివి!
రాము : నాన్నా, నువ్వు చీకట్లో- కళ్ళు మూసుకొని రాయగలవా?
నాన్న : ఓ! ఏం రాయమంటావు?
రాము : కళ్ళు మూసుకొని ఈ మార్కుల రిపోర్టు మీద నీ పేరు రాయి నాన్నా, చూద్దాం!
ఫ్లూటు సాధన!
శీన: మీరు ఫ్లూటు సాథన చేస్తుంటారా?
గోపి: అవునండీ, మీరెలా కనిపెట్టారు?
శీన: మీ పక్కింటాయన ఎప్పుడూ చెవిలో దూది కావాలని వస్తుంటారు గదా, అట్లా కనుక్కున్నా !
సెలవు కథలు!
బాస్: నువ్వు రాసిన కథ చాలా బాగుందోయ్!
శేఖర్ (అయోమయంగా ): నేను కథ రాయడమేమిటి సార్?!
బాస్: అదేనయ్యా, నిన్న నువ్వు పంపించిన లీవ్‌లెటర్లో కథ గురించి- ఎంత గొప్పగా అల్లావు! నీకు అవార్డు ఇవ్వాలయ్యా అసలు!
తెలివి!
తిమ్మయ్య: ఈ ఆవు ఎవరిదో తెలుసా, నీకు?
వెంగళప్ప: ఆవు ఎవరిదో తెలీదుగానీ దూడ మాత్రం ఎవరిదో తెలుసు.
తిమ్మయ్య: సరే ఎవరిదో తొందరగా చెప్పు!
వెంగళప్ప: ఆ ఆవుదే!
జాగ్రత్త!
భార్య (ఉత్తరంలో): ఏమండీ, జైల్లో బాగున్నారా? మన పెరడంతా ఖాళీగా పిచ్చిమొక్కలతో ఉంది. దానిలో కూరగాయలు పండిద్దామనుకుంటున్నా, ఎప్పుడు వేస్తే బాగా కాస్తాయో లెటర్ రాయండి కాస్త.
భర్త (జవాబు జాబులో): ఎప్పుడు సాగుచేయాలో తరువాత రాస్తాను గాని, జాగ్రత్త- నేను దాచిన సొమ్మంతా పెరటి మధ్యలో పిచ్చి మొక్కల మధ్యనే దాచాను. అక్కడ మాత్రం తవ్వకు .
మళ్ళీ రెండు రోజుల తరువాత:
భార్య (ఉత్తరం): ఏమండీ! ఎవరో కొంతమంది మనుషులు వచ్చారండీ..రెండు రోజులపాటు మన దొడ్డంతా తవ్వారు.
భర్త (జవాబు జాబు): నేనే తవ్వించానులే, ఇప్పుడు అందులో కూరగాయల విత్తనాలు నాటుకో.