"1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్ర్యం వచ్చింది.. మనకు స్వాతంత్ర్యం వచ్చింది.." బట్టీ పడుతున్నాడు సూర్యం.

వాళ్ళ బడిలో ఆగస్టు పదిహేనున స్పీచ్ ఇవ్వాలని వీడికి ఉబలాటం. వాళ్ళమ్మని అడిగితే ఏవో కొన్ని వాక్యాలు రాసిచ్చినట్లుంది; వీడు బట్టీ కొడుతున్నాడు.

"..గాంధీజీ నాయకత్వంలో అందరూ ఒక్కటై బ్రిటిష్ పాలకులను తరిమి కొట్టారు.." చదువుతున్నాడు వాడు.

పడక్కుర్చీలో కూర్చున్న తాతయ్య ఆగలేక అరిచాడు- "ఒరొరోయ్! ఆగి, ఓ మాట చెప్పు; మన వాళ్లంతా అమెరికా పోయి ఉద్యోగాలు చేసేస్తున్నారా?

మీ బాబాయేమో ఆస్ట్రేలియాలో చదువులు వెలగబెడుతున్నాడా? మరి అందరూ పోయి లండన్లో డాక్టర్లయిపోతున్నారా? ఇంకా ఏంటిరా, ఈ 'తరిమి కొట్టటాలూ', స్వాతంత్ర్య 'దినాలూ'?"

"అంటే, అట్లా కాదు; బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని ఆక్రమించారన్నమాట- ఇప్పుడు మనం ఎవర్నీ ఆక్రమించలేదుగా?" అన్నాడు సత్యం, వెనక్కి తగ్గకుండా.

తాతయ్య అడిగాడు సరైన సందర్భమే దొరికిందని సంతోషపడుతూ- " 'ఆక్రమించటం' అంటే ఏంచేశారో పాపం!" అని.

"అంటే, మంత్రులు, ప్రధానమంత్రులు- ఇట్లా ఎవరూ ఉండరు. వాళ్ళే రాజుల్లాగానన్నమాట. మంచి పదవుల్లో అందరూ బ్రిటిష్ వాళ్ళనే పెట్టుకునేవాళ్ళు. మన దేశపు ప్రజల్ని 'కూలీలు' అని పిలిచేవాళ్ళు; చిన్నచూపు చూసేవాళ్ళు. ప్రతి వస్తువు మీదా పన్నులు వేసి, వచ్చిన డబ్బునంతా తమ దేశానికి పంపించేసుకునేవాళ్ళు. అది తప్పు కదా?!" అడిగాడు సూర్యం.

వాడికి అంత తెలుసని అనుకోలేదు తాతయ్య. ఒక్క క్షణం నివ్వెరపోయి, అన్నాడు- "అవునురా, నిజమే. కానీ మన దేశం వాళ్ళు ఊరికే ఉండలేదురా, చాలా తీవ్రంగా వ్యతిరేకించారు ఈ పంథాని. గాంధీగారి వెంట నడిచినవాళ్ళు ధర్నాలు, బందులు చేసి, పత్రికలు నడిపారు. ఇంకా కొందరు తుపాకులు చేతబూని తిరుగుబాట్లు చేశారు- బ్రిటిష్ అధికారులను కాల్చి చంపేశారు. ఇక దేశంలో మామూలు జనాలు కూడా బ్రిటిష్ వాళ్ళు తయారు చేసిన సామానులను కొనటం మానేశారు. ఇక వ్యాపారం జరిగేదెట్లాగ? చివరికి 'ఇక్కడ రాజ్యం చేసీ లాభం లేదులే' అని బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని మనకు వదిలేసి వెళ్ళిపోయారు" చెప్పాడు.

"అంటే మనవాళ్ళు వాళ్ళని తరిమి కొట్టినట్లే కదా!" అన్నాడు సత్యం, తెలివిగా.

"కాని, ఒరే, ఈ విదేశీవాళ్ళు చాలా తెలివైనవాళ్ళురా! వీళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు మనలో కొందరికి వాళ్ళ అలవాట్లు నేర్పించారు; మనవాళ్ళూ వాళ్లను అనుకరించారు. అయితే ఇక రానురాను మనవాళ్ళు ఎంతమంది ఆ పద్ధతులకు బానిసలు అయ్యారంటే, ఇక వీళ్ళు పదవుల్లో ఉంటే బ్రిటిష్ వాళ్ళు పదవుల్లో ఉన్నట్లే! తేడా అల్లా ఏమంటే, బ్రిటిష్ వాళ్ళు మన సంపదని ఇంగ్లండుకు తరలించుకుపోతే, వీళ్ళు దాన్ని కొల్లగొట్టి తమ సొంత ఖాతాల్లోకి తరలించుకు పోతున్నారు!

నిజానికి మనం అందరం కూడా మనకు తెలీకుండానే విదేశీ అనుకరణలో పడిపోయాం- నీకు చాలా ఇష్టం కదూ, పిజ్జాలూ, బర్గర్లూ, ఐస్‌క్రీంలూ?" అవునన్నట్లు తలూపాడు సూర్యం.

"అవన్నీ విదేశీ ఆహారాలేరా! ఒకప్పుడు విదేశీయులు మన ఆహార అలవాట్లని మెచ్చుకునేవాళ్ళు- ఇప్పుడు మనం వాళ్ల భజన చేస్తున్నాం.

కూల్‌డ్రింకులు త్రాగటం విదేశీ అలవాటేగా? సిగరెట్లూ, రకరకాల సారాయిలూ- ఇవన్నీ మన సమాజానికి విదేశీయులు అంటించిన దురలవాట్లే. ఇట్లాంటివి ఇంకా ఎన్ని ఉన్నాయో లెక్కలేదు. మన సంగీతం‌ అంతా ఇప్పుడు విదేశీ దరువే అయిపోయింది; మన భాషల్ని విదేశీ భాషలు ఆక్రమించేశాయి- మన భావనల్ని చక్కగా వెలువరించాలంటే ఇంగ్లీష్ తప్ప వేరే భాషే దొరకటంలేదు మనకు! ఆంగ్లేయులు మన దేశాన్ని వదిలేసినా, మన సమాజం అంతా ఆంగ్లేయ మయమే అయిపోయింది, ఇకనేమి? మన ఊళ్ళూ, ఇళ్ళూ, పద్ధతులూ అన్నీ ఇప్పుడు విదేశీనే! వీటినన్నిటినీ దూరం చేసుకోవాలంటే ఇంకో స్వాతంత్ర్య సంగ్రామం నడిపించాలేమో , మరి!" ఉపన్యాసం దంచేశాడు తాతయ్య.

"నడిపిద్దాంలే, తాతయ్యా! మేమున్నాం కదా, నీకెందుకు బెంగ?!" అన్నాడు సూర్యం.

"అవునురా, అదే, నా ధైర్యం. మీరున్నారుగా!" అన్నాడు తాతయ్య కూడా, నవ్వేస్తూ.

అవును- మనం ఉన్నాంగా?!

మరో స్వాతంత్ర్యదినోత్సవ అభినందనలతో-

కొత్తపల్లి బృందం.