అనగనగా ఒక రైతు దగ్గర ఒక కోడి ఉండేది. రైతు పొలంలో దానికి కావల్సినన్ని తిండిగింజలు దొరికేవి. అక్కడే, ఒక చెట్టు మీద- ఒక పావురం కూడా నివసిస్తూ ఉండేది. కోడికి, పావురానికి మధ్య మంచి స్నేహం కుదిరింది. తనకు దొరికిన ఆహారాన్ని కోడి, పావురంతో పంచుకునేది. తను చూసిన వింతలన్నిటినీ పావురం, కోడికి చెబుతుండేది.
ఒకరోజు ఒక నక్క వచ్చింది అక్కడికి. అక్కడే గింజలు ఏరుకుంటున్న కోడిని చూసి అది ఆశ్చర్యపోయింది: "ఇంత పెద్ద కోడిని నా జన్మలో చూడలేదు! దీన్ని పట్టు కోగలిగితే నా స్నేహితులనందర్నీ విందుకు పిలుచుకోవచ్చు!" అనుకుంది.
ఆ సమయానికి రైతు కూడా దగ్గరలో లేడు. అందుకని అది అటూ-ఇటూ చూసింది; గబుక్కున ముందుకు దూకింది; కోడిని పట్టుకున్నది; తను తెచ్చుకున్న సంచిలో వేసేసుకున్నది; మళ్ళీ ఏమీ తెలీనట్లు మామూలుగా నడవటం మొదలు పెట్టింది.
ఇదంతా చూసింది, పావురం. అది చెట్టు మీద కూర్చున్నది కదా, దానికి అంతా కనిపించింది. "అయ్యో! ఈ దొంగనక్క నా స్నేహితుడిని ఎత్తుకెళ్లిపోతోందే! ఎలాగైనా కోడిని కాపాడుకోవాలి" అనుకుంది. "కానీ ఎలాగ? ఆ దొంగనక్కను ఎదుర్కొనేందుకు తన శక్తి సరిపోదుగదా?" అంతలో దానికి ఒక ఉపాయం తట్టింది.
వెంటనే అది వేగంగా ఎగిరి వెళ్ళి, ఏదో దెబ్బతిన్న దానిలా నక్క వచ్చే దారిలో నేల మీద పడింది. సంతోషంగా నడుస్తూ పోతున్న నక్క పావురాన్ని చూసింది: "వావ్! ఈ రోజు నా తోకను నేనే తొక్కుకుని వచ్చినట్టున్నానే! ఈ పావురం మాంసంతో పులుసు చేసి, కోడిపలావుతో కలిపి తింటే బలే ఉంటుంది!" అని లొట్టలు వేసుకుంటూ వంగి, ఒక చేత్తో పావురాన్ని పట్టుకోబోయింది. దాన్ని కనిపెట్టి ఉన్న పావురం కొంచెం పైకి ఎగిరి, ఇక ఎగరలేనిదానిలాగా కొద్ది దూరంలో మళ్ళీ నేల మీద పడిపోయింది.
ఇట్లా రెండు మూడు సార్లు అయ్యేసరికి, నక్కకు పరువు చేటు అనిపించింది. అది తన వీపు మీద ఉన్న గోనె సంచిని కింద పెట్టి, రెండు చేతులతోటీ పావురాన్ని పట్టుకునేందుకు ముందుకు దూకింది. వెంటనే పావురం "మిత్రమా! పారిపో! పారిపో!" అని గట్టిగా అరుస్తూ నక్కకు దొరక్కుండా పైకి ఎగిరిపోయింది. పావురం హెచ్చరిక వినిపించగానే కోడి గోనెసంచి లోంచి బయటకు దూకి పరుగుపెట్టింది. పావురం ధ్యాసలో పడిన నక్క కోడిని గమనించనే లేదు- అది వెనక్కి తిరిగి చూసే సరికి కోడి పరుగో పరుగు!