ఇన్నాళ్ళూ వివిధ దేశాల పిల్లల్ని గురించి చెబుతూ వచ్చాను కదా, చాలాసార్లు అనిపించేది నాకు- వీళ్ళంతా వీళ్ళ దేశాల్లో కాబట్టి ఇలా చెయ్యగలిగారు కానీ- మన దేశంలో ఇవన్నీ‌ వీలు కావేమో, మన పరిస్థితుల్లో ఇలాంటివి చేయడం అంత తేలిక కాదేమో అనిపించేది. కానీ, ఈసారి పరిచయం చేయబోతున్న అబ్బాయి మన వాడే. పదమూడేళ్ళ తమిళ అబ్బాయి.

యోకేశ్వరన్ తమిళనాడులోని కాంచీపురం పట్టణంలో ఒక ప్రభుత్వ స్కూలులో ఏడవ తరగతి విద్యార్థి. ఏటా మన దేశంలో జరిగే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో ఎంతో మంది పిల్లలు సైన్సు పరిజ్ఞానంతో తయారు చేసిన వస్తువులని ప్రదర్శిస్తూ ఉంటారు; తమ పరిశోధనల ఫలితాలను వెల్లడి చేస్తుంటారు. మరి యోకేశ్వరన్ రైతు బిడ్డ- అందుకని, రైతులకు పనికొచ్చే అంశం "గండుచీమలు, చెదలు భూసారాన్ని పరిరక్షించడానికి ఎలా తోడ్పడతాయి?" అని పరిశోధన చేసాడు. "అవి మట్టికి, రైతుకు స్నేహితులు" అని కనిపెట్టాడు. తన పరిశోధన ఫలితాలను ప్రదర్శించి ఇండియన్ సైన్సు కాంగ్రెస్‌లో మొదటి బహుమతి సాధించాడు.

కాంచీపురం పట్టణంలో హ్యుండాయ్ సంస్థ వాళ్ళు వ్యవసాయ భూములు కొని, అక్కడ పరిశ్రమలు నెలకొల్పారు. దీనివల్ల, ఆ చుట్టుపక్కల వ్యవసాయ భూముల్లో అంతటా మట్టి సారం కోల్పోయింది. అక్కడి పంటలు అన్నీ దెబ్బ తిన్నాయి. ఈ నేపథ్యంలో యోకేశ్వరన్, అతని టీచర్ శక్తివేల్ కలిసి, 'మట్టి నాణ్యతను సేంద్రియ మార్గాల్లో పెంచడం ఎలాగ?' అని రైతులతో వివరంగా చర్చించారు. అటుపైన ఒక చిన్న ప్రయోగం చేసారు. అదేమిటంటే, ఒక చిన్న పంటభూమిని తీసుకుని, అందులో చీమల్ని ఆకర్షించే చెరుకు పంటని వేసారు. అలాగే, ఇంకో భూభాగంలో బఠానీ మొక్కలు నాటారు. వీటి దగ్గరికి చెదల్ని తీసుకొచ్చారు. ఎలాగ? జీవం ఉండే చెట్ల వంటి వాటిని చెదలు ఇష్టపడవు కదా! అందుకని వీళ్ళు ఏం చేశారంటే, చెక్క పొట్టు, రంపపు పొడి, ఇట్లాంటివి సేకరించారు. వాటిపైన నీళ్ళు చల్లారు. దాన్ని ఈ భూభాగంలో ఉంచేసరికి, ఒక్క రోజు తిరగకుండా చెదలతో నిండిపోయింది అది. ఇంక ఇంకో భాగంలో ఇలా చీమలు, చెదలు ఏవీ రాకుండా మామూలుగా ఉంచేశారు.

కొన్నాళ్ళ తరువాత, ఈ భూభాగాల లోని మట్టిని వ్యవసాయ పరిశోధనశాలకి తీసుకెళ్ళి చూస్తే: చీమలు, చెదలు ఉన్న భూమి- ఇవేవీ లేని భూమితో పోలిస్తే బలంగానూ, సారవంతం గానూ ఉందని స్పష్టంగా తెలిసి పోయింది. అలాగే, చీమలు, చెదలు నిండిన భూమిలో ఏ మొక్కలైతే పెరిగాయో, అవి ఇవేవీ లేని భూమిలో ఉన్న మొక్కల కంటే పొడుగ్గా కూడా ఉన్నాయంట! అలా "చీమలు, చెదలు మట్టికి నేస్తాలు- భూసారాన్ని పెంచేందుకు అవి తోడ్పడతాయి" అని తీర్మానించగల్గారు వాళ్ళు.

అతి సాధారణంగాను , తేలిగ్గాను అనిపించే ఈ ప్రయోగం రైతులకి ఎంత ఉపయోగమో కదా! దాంతో పాటు 'చెదలు, చీమలు మన పంటలకు శత్రువులు కాదు; అవి మన మిత్రులు' అని అర్థమౌతుంది !

ఇలా పరిసరాల్ని శ్రద్ధగా గమనిస్తూ ఉంటే, మనకి కూడా ఎన్నో ప్రయోగాలు చేసే అవకాశం ఉంటుంది. వీటిల్లో ఏదో ఒకటి నిజంగా అందరికీ ఉపయోగపడేది కావొచ్చు చివరకి... అందరం కంప్యూటర్ల తోనూ, రసాయనాలతోనూ, కంపెనీలలోనూ మాత్రమే ప్రయోగాలు చేయాలనేం ఉంది?!