పడమటి కొండ అంచున బంజారాల తండా ఉంది. ముఫ్పై గుడిసెలు- చిన్నా పెద్దా కలసి ఓ రెండు వందల జనాభా. ఎర్ర బస్సు మొగమే ఎరుగదు వాళ్ళ ఊరు. మండల కేంద్రానికి పోవాలంటే ఈ మధ్యనే 'పేంక్లు' అప్పు చేసి తెచ్చిన అప్పీ ఆటోనే గతి.
శ్రీశైలం గిరిజన ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదవతరగతి చదువుతున్నాడు, "భీక్యా" కొడుకు "డౌసు". దసరా సెలవులకని తండాకు వచ్చాడు.
తండాలో అడుగు పెట్టగానే చిన్నపిల్లల కేరింతలు, పెద్దవాళ్ళ హడావిడి కనిపిస్తాయని ఆశపడ్డాడు డౌసు. కానీ ఎక్కడా పిల్లలు కనబడలేదు.
పెద్దలు మాత్రం కొందరు అక్కడక్కడా అరుగుల మీద, నీరసంగా కూర్చుని ఉన్నారు. నవ్వులు లేవు; మామూలుగా ఉండే పలకరింపులూ లేవు! డౌసు ఇంటికి వెళ్ళే దారిలో చాలా మంది మంచాల మీద మూలుగుతూ పడుకుని ఉన్నారు. "ప్రొద్దునపూట ఈ పడుకోవటం ఏందబ్బా?" అనుకుంటూ వాడు ఇల్లు చేరేసరికి ఇంటి ముందు మంచం వేసి ఉంది- దాని మీద వాళ్ళ నాన్న పడుకుని ఉన్నాడు!
డౌసు నేరుగా ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ అమ్మ-చెల్లిల కోసం చూశాడు. ఇద్దరూ ఎక్కడికో వెళ్ళినట్లున్నారు- "నాన్నా, అమ్మా చెల్లి కనపడరేం?" అని అడిగాడు. "ఇప్పుడే మాంగ్యా దగ్గరికి వెళ్ళారురా, నీళ్ళను మంత్రించుకు రావడానికి" అన్నాడు భీక్యా దగ్గుతూ. "ఏంది నాన్నా! సెల్‌ఫోన్‌లు వచ్చినా మీరు మాత్రం మారరా?" అన్నాడు డౌసు కోపంగా. భీక్యా గొణిగాడు-"నా చిన్నప్పటి నుండి వాడిచ్చిన మంత్రపు నీళ్ళేరా తండాను కాపాడింది" అని. "ఊఁ! కాపాడుతున్నై కాపాడుతున్నై! అవి అట్లా ఎందుకుంటాయో తెలిస్తే నువ్వు ఈ మాట అనవు!" అన్నాడు డౌసు మరింత కచ్చగా.
వర్షాకాలం గదా, తండాలో గుంతలు నిండాయి; మురుగునీరు ఎక్కువయింది. దాంతో దోమలు, ఈగలు వృద్ధి చెంది నాయి; తండాలో వాంతులు, బేదులు (విరేచనాలు) ఎక్కువగా అవుతున్నాయి. "నాకు జాతర చేయలేదు- ఎందుకు? నాకు కోపం వచ్చింది. అందరికీ రోగాలు వచ్చేట్లు చేసాను!" అని మారెమ్మ పూనకంలో ఊగిపోతూ చెప్పాడు మంగ్యా. ఇంకేముంది, తండా వాళ్లు వెంటనే మారెమ్మకు జంతు బలులు ఇచ్చి పెద్దజాతర చేసేసారు. దాంతో పరిశుభ్రత మరింత లోపించింది! జల కాలుష్యానికి ఆహారకాలుష్యం తోడైంది. ఇంకా ఎక్కువ మంది మంచాన పడ్డారు.
ఇన్నేళ్ళుగా తండాలో వాళ్ళందరికీ దిక్కు మంగ్యా ఒక్కడే. దోష నివారణకు మంత్రాలు, యంత్రాలు కట్టి; పూజలు చేసి బాగు చేస్తాడని తండా వాసులంతా ఏ రోగం వచ్చినా అతని దగ్గరికే వెళ్ళేవాళ్ళు; మంగ్యాకు భారీగా ముడుపులు, పాలు, పెరుగు ఇచ్చేవారు. వాటన్నిటితోటీ మంగ్యాకు వేరే పనంటూ ఏదీ లేకుండా పోయింది. కష్టమంటూ ఎరగక అతను హాయిగా జీవిస్తుంటే, జనాలు మాత్రం రోగాలతో బాధపడేవాళ్ళు.
అతని వైద్యం వింతగా ఉండేది. అందరికీ నీళ్ళను మంత్రించి ఇచ్చి తాగమనేవాడు. ఒక్కోసారి అతను మంత్రించి ఇచ్చిన నీళ్ళు చేదుగా ఉండేవి. అప్పుడు చెడు జరుగుతుందని నమ్మకం, ప్రజలకు. ఒక్కోసారి ఆ నీళ్ళు చక్కెర నీళ్ళకంటే తియ్యగా ఉండేవి. అట్లా ఉంటే ఆ రోగాలు నయం అవుతాయని ప్రజలకు నమ్మకం కలిగిపోయేది.
ఈ నీళ్ళ మహాత్యం గురించి డౌసు వాళ్ళ సైన్స్ మాష్టారు గోపాల్‌రావుకు చెబితే, ఆయన నవ్వి, "ఓరి, ఆమాత్రం తెలీదా, అది సాకరిన్-క్లోరోక్విన్ మాయాజాలంరా!" అని వివరించి చూపాడు. అది చూశాక డౌసుకైతే సిగ్గే వేసింది- ఇంత చిన్న విషయం తనకు ఎందుకు తట్టలేదు అనిపించింది. ఇప్పుడు తన మంత్రశక్తిని తండా వాసులకు చూపించాల్సిన సమయం దగ్గరపడిందన్నమాట!
వెంటనే డౌసు 104 నంబరుకు ఫోన్ చేశాడు. తమ ఊరిలో అతిసార వ్యాధి, విషజ్వరాలు పెచ్చు మీరిన సంగతి తెలియజేసాడు. "తమరు ఈరోజు సాయంత్రానికే ఇక్కడికి రావాలి" అని వాళ్లకు విజ్ఞప్తి చేశాడు.
ఒకవైపునుండి 104 అంబులెన్సు వాహనం వచ్చేసరికి, రెండో వైపున "పట్నం నుండి వచ్చిన భీక్యా కొడుకు డౌసుకు మంత్ర శక్తులు వచ్చాయి" అని తండా అంతటా గుప్పుమన్నది. రోగులందరూ డౌసు ఇంటి దగ్గరికి వచ్చి కూర్చుని ఉన్నారు.
అందరిముందూ డౌసు నిలబడి, "రెండు గ్లాసుల్లో నీళ్ళు తేండమ్మా" అని చెప్పాడు ఒక పాపకు. ఆ పాప నీళ్ళు తెచ్చి ఇచ్చింది.
డౌసు రెండిటిలోనూ తన చూపుడు వేళ్లను ముంచి తిప్పుతూ "పోరిపాంయ్యద-పోరిపాంరసాతిఅ-పోరిపాంనజ్ఞాఅ" అని ఏవేవో మంత్రాలు చదివాడు.
అందరూ భయం భయంగా వాడివైపే చూస్తుంటే, వాడు ఒక రోగిని దగ్గరికి పిలిచి, "ఇదిగో, ఈ ఎడమ చేతిలో ఉన్న గ్లాసులో నీళ్ళు త్రాగు ఒక గుక్కెడు!" అన్నాడు. అవి పరమ చేదుగా ఉన్నై! వాడు అయిష్టంగా ముఖం చికిలించగానే "మామా! నీ ఆరోగ్యం ఇంక హుళక్కి!" అన్నాడు డౌసు.
ఊళ్ళోవాళ్ళంతా భయభ్రాంతులైపోయారు. "మరిప్పుడు ఏం చెయ్యను?" అన్నాడు ఆ రోగి. "ఏముంది, ఇప్పుడు నా కుడి చేతిలో ఉన్న గ్లాసులోంచి పుక్కెడు నీళ్ళు త్రాగు" అన్నాడు డౌసు. వాడు భయం భయంగానే రెండో గ్లాసులో నీళ్ళు తాగి చూశాడు- అవి ఎంత తియ్యగా ఉన్నాయో చెప్పలేం! వాడి ముఖం సంతోషంతోవెలగటం చూసి "ఏం మామా! నీ ఆరోగ్యం ఇంక బాగైపోయినట్లేనా?" అన్నాడు డౌసు నవ్వుతూ. వాడు అనుమానంగా తల ఊపగానే డౌసు అందరివైపూ తిరిగి "చూడండి! ఇందులో మంత్రం ఏమీ లేదు. బజార్లో సులభంగా దొరికే పొడులు రెండున్నై. ఒకటేమో 'సాకరిన్'- ఈ పొడిని చవకబారు కూల్‌డ్రింకులు, ఐసుక్రీములు అన్నిటిలోనూ కలుపు-తుంటారు. ఇది చక్కెరకంటే తియ్యగా ఉంటుంది. ఇక రెండోది 'క్లోరోక్విన్'- ఇది మలేరియా మాత్రల రూపంలో ప్రతి మందుల దుకాణంలోనూ దొరుకుతుంది. ఇది గడ్డు చేదు-
నేను ఏం చేసానంటే, నా ఎడమ చేతి వేలుకి క్లోరోక్విన్ పొడిని రుద్దుకున్నాను. కుడి చేతి వేలుకి సాకరిన్ అద్దుకున్నాను. ఆ పాప నీళ్ళు తెచ్చి ఇవ్వగానే గ్లాసుల్లో వేళ్లను అద్ది "దయ్యం పారిపో- అతిసారం పారిపో- అజ్ఞానం పారిపో" అని మంత్రాలు చదివాను- తిరగదిప్పి! ఇంకేముంది, నా వేళ్ల వల్ల నీళ్లకు ఆ రుచులు అంటాయి! ఇప్పుడు అర్థమైందా, మంగ్యా చేతి వేళ్ళ మహిమ, మంత్రపు నీళ్ల విజ్ఞానం?!" అని ఆ పొడుల పొట్లాలను రెండింటినీ బయటికి తీసి చూపించాడు.
ఊళ్ళోవాళ్లంతా ముందుకు వచ్చి కొంచెం కొంచెంగా రెండిటినీ రుచి చూశారు- "ఔనురా, ఒరే! ఇన్నాళ్ళుగా మాకు అర్థమే కాలేదు- మంగ్యా చేతిలో ఏ మాయలూ లేవన్నమాట!" అన్నారందరూ.
"అవును, నిజం పెద్దయ్యా! పరిశుభ్రత లోపం వల్ల అతిసారం, గ్రహణి, విషజ్వరాలు- ఇవన్నీ వస్తుంటాయి. వీటికి మూఢనమ్మకాల మందులు చాలవు- శాస్త్రీయంగా చదువుకున్న వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడాలి; ఊళ్ళో పారిశుధ్యం బాగుండేట్లు చూసుకోవాలి. మేం అందుకే వచ్చాం; డౌసు పిలిచాడు మమ్మల్ని. ఇప్పుడు ఒక్కరొక్కరుగా రండి; మీ సమస్యలకు మందులు ఇస్తాం" అన్నారు 104 వాహనంలో వచ్చిన డాక్టరుగారు.
రోగులందరూ వరసగా నిలబడి ధైర్యంగా మందులు తీసుకున్నారు. అందరూ శ్రద్ధగా మందులు వాడారు. ఒక్క వారం రోజుల్లో అందరి ఆరోగ్యాలూ ఒక దారికి వచ్చేసాయి. అంతలో మంత్రిగారు, జిల్లా కలెక్టర్ కూడా తండాను సందర్శించారు. "రక్షిత మంచి నీటి పథకం ద్వారా మంచి నీళ్ళు ఇస్తాం- రోడ్లు వేయించి, ఇళ్ళుకట్టించి తండాని అభివృద్ధి పరుస్తాం- పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే రోగాలు రావు- మంత్ర తంత్రాల్ని నమ్మొద్దు" అని చెప్పారు.
మంచి పని చేసిన డౌసును కలెక్టరు మెచ్చి, వెయ్యి రూపాయల నగదు బహుమతి ఇచ్చారు.
అటుపైన తండా వాళ్ళు మంగ్యా దగ్గరికి వెళ్ళటం పూర్తిగా మానేసారు. తమ రోగాలకు డాక్టర్లను సంప్రతించసాగారు. మంగ్యా పొలంపని చేసుకొని గౌరవంగా జీవించటం మొదలు పెట్టాడు. ఊరికి మేలు చేసిన డౌసు పైచదువుల కోసం పట్నం వెళ్ళాడు.