చాలా సంత్సరాల క్రితం బోధిసత్త్వుడు కాశీరాజ కుమారుడిగా జన్మించాడు. ఆ రోజుల్లో ఆచారాలు, మతపరమైన తంతులు జన జీవితంలో ప్రధానపాత్ర పోషిస్తూ ఉండేవి. ప్రతి చిన్న విషయానికీ జంతువుల్ని బలి ఇవ్వటం, యజ్ఞాలనీ యాగాలనీ విలువైన వస్తువులని నిప్పులో వేసేయటం చేస్తూ ఉండేవాళ్లు అందరూ.
అందరిలాగానే కాశీరాజు గారు కూడా అనేక తంతుల్లో ఎప్పుడూ మునిగితేలుతూ ఉండేవాడు. రాజకుమారుడికి మాత్రం ఇదంతా చాలా అనవసరం అనిపించేది. కారణాలు, ఫలితాలు ఎలా ఉన్నా, అన్ని 'మూగ ప్రాణులను బలి పెట్టటం' అన్న ఆలోచనే అతనికి అమానుషం అని తోచేది.
తండ్రిగారు అలాంటి తంతులు చేపట్టినప్పుడల్లా రాజకుమారుడు వెళ్లి ఒక మర్రి చెట్టు క్రింద కూర్చొని ధ్యానం చేసుకునేవాడు. కొడుకు ప్రవర్తనని చూసి రాజుగారు ఏమనుకున్నారో తెలీదు కానీ, మొత్తం మీద "ఇంకా పసివాడులే" అని వదిలేసి ఉండచ్చు.
అయితే క్రమంగా రాజుగారు ముసలివాడయ్యాడు. రాకుమారుడూ యువకుడయ్యాడు, రాజకుమారుడి పట్టాభిషేక సమయం దగ్గరపడింది. ఆ సమయంలోనే కాదు; అటుపైన రాజుగా కూడా ఆ దేశపు ఆచార వ్యవహారాలన్నిటినీ సంరక్షించాల్సిన బాధ్యత అతని మీద పడనున్నది - అంటే అప్పటి వరకు తండ్రిగారు చేసిన తంతులన్నీ ఇప్పుడు ఇతను చేయాలి! ఎలాగ!?
కొత్తగా సింహాసనాన్ని అధిరోహించిన సమయంలో యువరాజు భయంకరమైన ప్రకటన ఒకటి చేశాడు. అది విని రాజ్యం యావత్తూ హోరెత్తిపోయింది.
అదేమంటే- "ప్రజలారా! ఇన్నేళ్లుగా నేను మర్రి చెట్టు దేవతను కొలుస్తున్న సంగతి మీకందరికీ తెలుసు, ఆ దేవత మామూలు దేవత కాదు. ఇప్పుడు , నేను రాజపదవిని స్వీకరించిన తరుణంలో , ఆ దేవికి నివేదనగా వెయ్యిమంది మనుష్యులను బలి ఇస్తానని మొక్కుకున్నాను!! -అయితే బలికి కావలసిన ఆ వెయ్యి మందీ వాళ్ల వాళ్ల దేవతలకు జంతు బలులిస్తూ ప్రీతి కలిగిస్తూన్నవాళ్ళే అవ్వాలి- అంటే, ఏ దేవత పేరునైనా సరే, జంతువుల్ని ఇష్ట పూర్వకంగా బలి ఇస్తున్న వెయ్యిమంది మనుషుల్ని పట్టుకొని, నేను మా దేవికి బలి ఇవ్వాల్సి ఉన్నది! ఆ పని కోసం ప్రత్యేకంగా కొంత సైన్యాన్ని నియోగించనున్నాను కూడా!" అని.
అటుపైన కాశీ రాజ్యంలో ఒక్కరు కూడా జంతువుల్ని బలి ఇవ్వలేదు.
ఒక్క మనిషినీ బలి ఇవ్వకుండానే బోధిసత్త్వుడి జీవితం గడచిపోయింది. అటు రాజ్యంలో జంతువుల్నీ బ్రతికి పోయాయి!!