మా ఊరు పేరు గంగూరు. అది కృష్ణాజిల్లాలో ఉంది- విజయవాడకి గంట దూరంలో. పెద్ద పెద్ద గోడౌన్లు, పచ్చని గడ్డి, ఎద్దులు- వీటిని చూస్తే చాలు- నాకు మా ఊరు గుర్తుకు వస్తుంది. మాకు ఊళ్ళో బోలెడు ఆవులు ఉన్నాయి. అన్నీ 'జర్సీ' జాతి గోవులే. మా ఊళ్ళో అన్నీ నాకు ఇష్టమే. అయితే అక్కడ నాకు నచ్చనిది కూడా ఒకటుంది- ఏమిటంటే, -అక్కడ బోలెడన్ని బల్లులు ఉంటాయి!
రోజూ పొద్దున్న లేచినప్పటినుండీ పిల్లలందరమూ గెంతటం, పరుగెత్తటం, ఆటలాడటం చేస్తూనే ఉంటాము. అందరమూ అంతే- ఒక్క అమ్మమ్మ తప్ప. తను పొద్దున్న నాలుగింటి నుంచి ఏడుగంటల దాకా పూజ చేసుకుంటుంది. తరువాత వంట గది కెళ్లి నోరూరించే వంటకాలు తయారు చేస్తుంది.
మా తోటలో చాలా చెట్లున్నై. అక్కడికెళ్ళి రోజూ కొబ్బరి చెట్లెక్కటం నేర్చుకుంటాం. కొబ్బరి కాయలు కోసుకొని వాటిలోని నీళ్ళు తాగుతాం. అక్కడి నీటి గుంటల్లో పడి దొర్లుతాం. అక్కడ ఊళ్ళో వాళ్లంతా చాలా బాగా పలకరిస్తారు. భలే మర్యాద చేస్తారు. మా ఊళ్ళో సాయంత్రం పూట వచ్చే చల్లటి గాలులు చాలా బాగుంటాయి. రణగొణ ధ్వనులు, వాతావరణ కాలుష్యం అక్కడ చాలా తక్కువ.
మా అమ్మమ్మవాళ్ళ ఇంటి చుట్టూతా పెద్ద పెద్ద పొలాలు ఉన్నాయి. రాత్రిపూట మేమంతా వాకిట్లో కూర్చొని తాజా కొబ్బరి నీళ్ళు తాగుతూ, చందమామను చూస్తూ, అమ్మమ్మ చెప్పే కథలు వింటూ, పడుకుంటాం- ఎంతో హాయిగా ఉంటుంది!!
ఆహా! ఇవన్నీ చెబుతుంటే నాకు మా ఊరు, అమ్మమ్మ, తాతగారు, ఊళ్ళోవాళ్ళు అందరూ గుర్తుకు వస్తున్నారు. మీరూ రండి మరి, అందరం వెళ్దాం!