అనగనగా ఎప్పుడో ఒక నీలపు నీటి బొట్టు ఉండేదిట. నీలం రంగుతో మెరిసిపోతూ చాలా అందంగా ఉండేదది. దగ్గరున్న వాళ్లంతా దాన్ని చాలా ముద్దు చేసేవాళ్లు- అన్ని నీటిబొట్లూ మామూలుగా ఉంటే ఇది మాత్రం నీలంగా మెరిసేది కదా, అందుకని. అట్లా అందరూ ముద్దు చేసీ చేసీ, నీలంరంగు నీటిబొట్టుకు ఒక కోరిక కలిగింది, "ఒలికి పోయినట్లు, జారిపోయినట్లు, ఎక్కడెక్కడికో ప్రయాణం చేస్తూంటే ఎంత బాగుంటుంది! ఏదో ఒక వంకలో కలిసి ప్రవహిస్తే ఎంత బాగుంటుంది కదా!" అనిపించింది.

అనుకున్నదే తడవు అది ఓ వంకలోకి దూకింది. వంకలో తోటి నీళ్లతో పాటు ఒలికి పోయింది, జారిపోయింది, కలిసి ప్రవహించింది. రాను రానూ ఆ వంకకు ఇంకో వంక కలిసింది. మళ్లీ ఇంకోవాగు, అన్నీ ఓ పెద్దనదిలో కలిశాయి! నీలపు నీటిబొట్టూ అన్నింటితో బాటు కలసి ప్రవహించింది, ఎందరెందరో పిల్లల వ్రేళ్లలోంచి, కాళ్లమీంచీ జారుకుంటూ పోయింది. ఎందరెందరు వెంటపడ్డా దొరక్కుండా ఊరించుకుంటూ పోయింది.

అంతలో దూరంగా కనబడింది దానికి - ఒక మహాసముద్రం!

"రా, రా! చిన్నారీ! చిట్టి నీటి చుక్కా, రా! నాలో కలు!" పిలిచింది సముద్రం. "నేనెంత విశాలమో చూడు! నాలో నీలాంటి బొట్లు ఎన్ని ఉన్నాయో చూడు! నీదీ, నాదీ ఒకే ప్రాంతం కూడానూ! రా, నాలో కలిసిపో " అన్నది సముద్రం.

సముద్రంలో నీళ్ళు ఎగిరి క్రింద పడుతున్నై; మళ్లీ ఎగురుతున్నై! ఎగిరెగిరి దూకుతూన్న ఆ నీళ్లలో ఉయ్యాలలూగుతూ తనలాంటి నీటి చుక్కలు చాలా కనబడ్డై, నీలి నీటి చుక్కకు. "బాగుంది! భలే ఉంది!" అనుకుంది. అన్ని నీళ్లతో బాటూ సముద్రంలో కలిసింది. ఎగిరింది, దూకింది, యీత కొట్టింది. తనలాగే ఉన్న నీటి బొట్లని కలిసింది. ఉరకలు వేసుకుంటూ అలల మీద ఉయ్యాలలూగి పాటలు పాడింది.

సముద్రం దాన్ని చూసి నవ్వింది ముసిముసిగా , "ఇదిగో , మా పాప! మా ఊరిదే ! ఎంత బాగుందో చూశారా?" అని చెప్పింది అందరికీ.

రాను రాను నీటి బొట్టుకెందుకనో అనుమానం వచ్చింది, "తనకు తోడుగా ఉన్న నీళ్లేవీ తనంత సంతోషంగా లేవు. ఏదో దిగులు వాటిని బాధిస్తోంది! ఏవో కోరికలు వాటివి, తీరట్లేదు! ఏంటవి?"

సముద్రం అన్నది - "వాటిని పట్టించుకోకు ! బాధల బరువుతో అవి ఎగరటాన్నే మర్చిపోయినై, ముసలివైపోయినై. నువ్వు రా! అలల కెరటాల మీద స్వారీ చెయ్యి! సంతోషంగా‌ నవ్వుల బుడగలు ఊదు, రా!" అని.

నీలం రంగు నీళ్లచుక్క చాలా సార్లు అడిగితే ఒక నీటిబొట్టు చెప్పింది తన మనసులో మాట- "నాకు ఈ సముద్రం దాటి పోవాలని ఉంది. కానీ ఎలాగ? దీన్ని దాటేదెలాగ?" అని. "దాని దేముంది, సముద్రాన్ని అడిగితే సరి! అదే దాటిస్తుంది" అని , నీలి నీటి చుక్క సముద్రాన్ని అడిగింది.

సముద్రం నవ్వింది- ఫెళఫెళా! ఉరుము ఉరిమినట్లు, సింహం గర్జించినట్లు- "అది వీలుకాదు, ఇన్నాళ్లూ నేను మీకు ఆశ్రయం ఇచ్చిందే ఎక్కువ! మీ మనుగడ అంతా ఇక నాతోటే! నేను లేకుండా మీరు లేరు! మీరు ఏనాటికీ నన్ను వదిలి పోలేరు!" అన్నది.

"అంటే... నేను కూడానా?!" అడిగింది నీలి నీటి చుక్క అమాయకంగా.

"నువ్వేమన్నా ప్రత్యేకంగా పుట్టావా? అందరిలాగే కదూ, నువ్వూనూ? ప్రపంచ నియమాలు తెలీనట్లు మాట్లాడతావేమి? నీకిక చేతనైందల్లా నాలో కలిసిపోయి బ్రతుకునీడ్వటమే. ఊరుకో , అల్లరి చేయకు; అల్లరిపడకు !" అన్నది సముద్రం మొరటుగా . "నువ్వెంత, ఒక నీటిబొట్టువి. నేను మహాసముద్రాన్ని . నాలో కలిసినందుకు నువ్వు అసలు గర్వించాలి. నీ అస్తిత్వం వృద్ధి చెందిందని సంతోషించాలి. నీ స్థాయి నెరిగి మసలుకోవాలి" అని నవ్వింది.

నీలి నీటిబొట్టు ఏడ్చింది. తన అసలుతనాన్ని తెలియజెప్పిన సముద్రం అంటే దానికి విపరీతమైన కోపం వచ్చింది. "కానీ ఏం చెయ్యగలను?" అని విచారపడింది. నిరాశ చెందింది. ఆ నిరాశలో దాని మెరుపు తగ్గటం , వన్నెవాయటం గమనించి మరింత దిగులైంది.

అప్పుడు గమనించిందది - "సముద్రం పైకి కనబడుతున్నంత ప్రశాంత గంభీరంగా లేదు. అందులో నీళ్ల బొట్లు చాలా ఉడికిపోతున్నై , కళవెళ పడుతున్నై, నిరంతరంగా తుఫానులు రేపుతూనే ఉన్నై. జ్వాలాముఖులు అనేకం యీ సముద్ర గర్భంలోంచే బ్రద్దలౌతున్నై- తన ప్రపంచంలో తను ఉండి గమనించలేదు- సముద్రంలో తలెత్తే అలలు అసలు ఉయ్యాలలే కావు! ఊయలలూగుతున్నట్లు కనబడే నీటిబొట్లలో అనేకం ఈ సముద్రపు సంకెళ్ల వలల్ని ఛేదించుకొని పైకి ఎరిగిపోయేందుకు ప్రయత్నిస్తున్న పోరాట కణాలు!!"

"సముద్రం చెప్పినట్లు, తను నిజంగానే ప్రత్యేకమైనదేమీ కాదు; కానీ తను ఒంటరిది కూడా కాదు. ఎగసిపడే కెరటాల్లో ఉన్న నీటి కణాలు ఒంటరివెలాగ అవుతాయి?"

నీలి నీటిబొట్టు ఏడుపు ఆగిపోయింది. సముద్రపు అహంకారాన్ని చూసి ఇప్పుడా నీటిబొట్టు నవ్వింది. ఎగసిపడే కెరటాలకు మరొక్క కణం తోడైంది. చూస్తూండగానే కణానికి కణం చేరుకున్నై, అన్నీ కలిసి పైకెగిరినై!!

"ఈ ఉప్పెన ఎలా వచ్చింది?" అని సముద్రం కంగారు పడేసరికి ఏం జరగాలో అదంతా జరిగిపోయింది- విశాలాంభోరాశిలోని ఒక్కొక్క నీటిబొట్టూ మహార్గళంలో కలిసి నింగికెగసింది! నింగికెగసిన నీటిబొట్లు ఇక క్రిందకి జారలేదు- మేఘచయాలై భూతలాన్నంతా పరచుకు న్నాయి. ఒకనాటి అపారపారావధి ఇప్పుడు మృతసముద్రమైంది. వినీలాకాశం క్రింద చిన్న మడుగై నిల్చింది!

చిన్ని నీటిబొట్లూ, ఎగసిపడే కెరటాలూ, ఆకర్షించే సముద్రాలూ, మడుగులైపోయి నిలబడే మృత సముద్రాలూ- ఇవన్నీ మానవ సమాజపు గతిలో భాగాలే. 'మోసం చేసేవి అంత పెద్ద సముద్రాలు కదా' అని భయపడనక్కర్లేదు. సంఘటిత శక్తి ముందు మహా సముద్రాలు ఏపాటివి?!

అందరికీ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు.
కొత్తపల్లిబృందం.