"రామూ! త్వరగా రెడీ అవ్వు" అని అమ్మ అంది. "మనం చాలా దూరం వెళ్లాలి- తొందరగా రెడీ అవ్వు!"
"అమ్మా, మనం ఎక్కడికి వెళ్తున్నాము?"
ముందుగా మనం అత్తవాళ్ళ ఇంటికి వెళ్తాం; అక్కడ నుండి ఢిల్లీవెళ్లాలి. ఎందుకంటే అక్కడ మీ నాన్నకి మంచి ఉద్యోగం దొరికింది కదా! మనం కూడా అక్కడికే పోతున్నాం!" సంతోషంగా అన్నది అమ్మ.
అదిగో, అంతలోనే ఏదో కారురానే వచ్చింది! "మనల్ని తీసుకెళ్ళేందుకేనేమో!"
అయితే కారు ఆగగానే అందులోంచి మాకు ఇద్దరికీ తెలీనివాళ్ళెవరో దిగారు. ఒకాయన అమ్మ దగ్గరికి వచ్చి అన్నాడు- "మీ పేరు సుభద్రా?" అని.
"అవునండీ" అన్నది అమ్మ.
మీరు ఈ బొమ్మను ఏమైనా గుర్తు పట్టగలరా?" అడిగాడతను, ఒక బొమ్మను చూపిస్తూ.
నేను ముందుకు వంగి చూసాను. "అది అమ్మ వేసిన బొమ్మే! చిన్నప్పుడు అమ్మ వాళ్ళు వేరే ఒక మారుమూల పల్లెలో ఉండేవాళ్లట. అమ్మ, వాళ్ళ అవ్వ, వాళ్ల గాడిద- అందరూ పల్లెలో చెరువు గట్టున అలా నడచుకొని పోతుండేవాళ్ళట. ఆ రోజుల్లో తను గీసిన ఆ బొమ్మను నాన్న ఫొటో తీసి పెట్టుకున్నాడు..."
"ఇది మీ దగ్గరికి ఎలా వచ్చింది?" అడిగింది అమ్మ.
"కంగారు పడకండి- వారం క్రితం మీ వారికి యాక్సిడెంట్ అయ్యింది. స్పృహలో లేకుండా ఉన్నారు ఇన్నాళ్ళూ. ఇప్పుడు ఆయన బాగానే ఉన్నారు. తెలివి వచ్చింది. మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు " అన్నాడాయన.
అమ్మ కంగారు పడింది. ఏడుపొచ్చింది. "అవునా? ఏ హాస్పిటల్‌లో చేర్చారు?" అడిగింది హడావిడిగా.
"కంగారేమీ లేదక్కా, మావెంట రండి! మేం నిన్ను తీసుకొని వెళ్ళేందుకే వచ్చాం. ఇంతకీ నువ్వు నన్ను గుర్తు పట్టినట్లు లేదు-" అన్నాడు అతను. అతని పెదిమల మీద చిరునవ్వు.
అమ్మ కి ఆయనెవరో నిజంగానే తెలీదు.
"నువ్వు, అమ్మ, అవ్వ మన గాడిదను వెంటబెట్టుకొని వలస పోయారు చూడు; ఆ సమయంలో చెరువులో మునిగిపోయిన గణేశును నేను! నన్నొక డాక్టరు గారు కాపాడారు; చదివించి డాక్టరును చేశారు. ఇన్నేళ్ళుగా నేను మీకోసం వెతకని చోటు లేదు. ఇప్పటికి, ఈ బొమ్మ పుణ్యమా అని, నావాళ్ళు నాకు దొరికారు " అన్నాడాయన.
'చిన్నప్పుడు చెరువులో మునిగిపోయిన మా గణేశు మామయ్యే ఆయన' అని తెలిసి నేనెంత ఆశ్చర్యపోయానో చెప్పలేను!