ఈ చిట్టికవితలు రెండు చూడండి:

హై ...డీ!

టి.వి.లో వస్తుంది హైడీ
చుట్టుకొలత సూత్రము - పైడీ
వారు అలసిపోయారు క్రికెట్ ఆడీ
అందుకే తాగుతున్నారు గ్లూకోన్-డీ

బాటా!
నాపేరు బాటా
నేను తినడానికి సరిపోదు ఒక తోట
నేను తాగడానికి చాలదు ఒక లోట
నేను కూర్చుంటే విరిగిపోద్ది పీట
నన్ను తూయడానికి సరిపోదు కా ట
నేను పాడాను ఒక పాట
వీరు నన్ను కట్టేశారు మూట
నేను ఊరికి వెళుతుంటె ఎవరూ- చెప్పలేదు నాకు టాటా!

(శ్రీ సాయినాథ్ స్కూలు, పొదలకూరు, నెల్లూరులో ఏడో తరగతి చదివే శరత్ చంద్రిక పంపిన అంత్యానుప్రాస కవితలు ఇవి- మీరూ రాయచ్చుగా, ఇలా?! రాసి పంపండి మరి, ఆలస్యం వద్దు!)

ఇక జోకులు కొన్ని:

చిల్లి!
టీచర్: రామూ! నేను నీకు రెండు రూపాయలు ఇచ్చాను, అయితే అవి రంధ్రం ద్వారా కిందపడ్డాయి. ఇంక నీ జోబులో ఏమి ఉంటుంది?
రాము: రంధ్రం ఉంటుంది టీచర్.

సరైన చిరునామా!
వెంగళప్ప: నాకేమైనా ఉత్తరాలొచ్చాయా?
ఫోస్టమాన్: మీపేరు?
వెంగళప్ప: అది ఉత్తరాల మీదఉంటుంది, చూడవయ్యా!

దానికి తెలీదు!
విద్యార్థి: నేను కంప్యూటర్ లో నా పాస్వర్డ్ కొట్టినప్పుడు.అక్షరాలన్నీ నక్షత్రాల్లా కనిపిస్తున్నాయి ఎందుకంటారు, టీచర్?
టీచర్: నీ వెనక ఎవరైనా వుంటే వారికి అర్థం కాకుండా వుంటడానికి అన్నమాట!
విద్యార్థి: మరి నా వెనక ఎవరూ లేనప్పుడు కూడా అలాగే వస్తోంది, టీచర్!?

ఫ్రీ!
సత్య, వాళ్ల నాన్న సంతకు పోయారు.
నాన్న: మునక్కాడలు ఎంతమ్మా, కట్ట?
వ్యాపారస్తురాలు: పది రూపాయలు సార్!
సత్య (నాన్న చెవిలో గుసగుసగా): నాన్నా! ఇవి తీసుకుందాం! ఈ మునక్కాడలు కొంటే రబ్బరు బ్యాండ్ ఫ్రీ, చూడు!

కలనిజమాయెగా!
నాన్న (దుప్పటి లాగుతూ) : ఓరేయ్ రాజూ! నిద్రలే రా! తెల్లవారుజామున నిద్రలేచి చదువుకుంటే బాగా జ్ఞాపకం ఉంటాయి!
రాజు: ఉండు నాన్నా! తెల్లవారు జామున వచ్చే కలలు నిజమౌతాయట- నేను పాసయినట్లు చక్కని కల వస్తుంటేను!

మెడమీద తల!
మౌనిక: నీ ముఖాన్ని ఇంకెక్కడో చూసినట్టుందే?
సంధ్య: అది అసాధ్యం! నా ముఖం ఎప్పుడూ నా మెడ మీదే ఉంటుంది!

ఆదివారం సెలవు!
తండ్రి:ఏమ్మా! ఇందాక బజార్లో మాస్టారు కనిపిస్తే నమస్కారం పెట్టలేదట?
కావ్య: ఓ అదా, ఇవాళ ఆదివారం కదా, అందుకని !

తెలివికి జోహార్లు!
కార్తీక్: ఓ, పెద్దాయనా! బస్సులో "పొగత్రాగరాదు" అని రాసి ఉందిగా! మరి నువ్వు ఏం చేస్తున్నావు?
పెద్దాయన:నేను పొగత్రాగటం లేదు నాయనా, పొగ వదులుతున్నాను!

ఆ 64 ఎవరివి?
ఇంద్ర:నా గురించి ఇంకొక్క మాట మాట్లాడావంటే నీ 32పండ్లూ రాలకొడతాను.
నవీన్: నన్నేమన్నా అన్నావంటే 64పండ్లూ రాలకొడతాను చూడు.
మధ్యవర్తి: అతనికి ఉన్నది 32పండ్లే కదా! మరి 64పండ్లు ఎలా రాలగొడతావు?
నవీన్: వాడివీ,నీవీ కలిపితే అరవైనాలుగు అవుతాయి-నువ్వు ఊరుకోవయ్యా బాబూ!

పూల కుండీ!
రవి:సోమూ! ఏంటిరా తలకు బ్యాండేజీ కట్టావు?
సోము: మా ఆవిడ నా మీదికి పూలు విసిరిందిరా!
రవి: పూలు విసిరితే అంత దెబ్బ తగిలిందా?
సోము: ఆ పూల కింద పూలకుండీ కూడా ఉందిగా, దాంతో తల పగిలింది మరి!

చిరంజీవి మహిమ!
సాయి: మా ఇంటికి రాత్రి ఒక దొంగ వచ్చాడు!
వేణు: మరి నువ్వు ఏం చేసావు?
సాయి: "దొంగ , దొంగ" అని గట్టిగా అరిచాను- కానీ ఎవ్వరూ రాలేదు.
వేణు: మరి, అప్పుడు ఏమి చేసావు?
సాయి: "చిరంజీవి, చిరంజీవి!" అని గట్టిగా అరిచాను- అంతే, అందరూ బయటకు వచ్చారు. దొంగ దొరికిపోయాడు!

బరువేమయిందో?!
బిచ్చగాడు: అమ్మా! ఒక రూపాయి దానం చెయ్యండమ్మా, అన్నం తిని నాలుగు రోజులు అవుతోంది!
అమ్మ: ఒక రూపాయితో అన్నం ఎలా తినగలవు?
బిచ్చగాడు: కాదమ్మా! ఎంత బరువు తగ్గానో చూసుకుందామని అడిగాను!

సరే, ఇప్పుడు కొన్ని కవితలు చూడండి. వీటిలో భావపు విలువలున్నై, గమనిస్తారుగా?:

భారతం!
నా భారతం- చరిత్రలో గొప్పది
నా భారతం- రాజ భవనాలను ధరించింది
నా భారతం- అడవులక తల్లైయింది
నా భారతం - రాక్షసులకు సంహరించింది
నా భారతం- గంగానదిని రప్పించింది
మన భారతం- భువిలో ప్రసిద్ధి చెందింది
మన భారతం ఎంతో గొప్పది.
రచన: జయంత్,7వతరగతి, రిషివ్యాలీ స్కూల్, మదనపల్లి.

ప్రకృతి ఒడి!
అందమైన ప్రకృతి ఒడిలో
చల్లనైన చదువుల తల్లితో
ఆడుతూ పాడుతూ హాయిగా ఆనందంగా చదువులు నేర్చేస్తాం.
కొండలెక్కుతాం, మేం గుట్టలెక్కుతాం
చెట్లు పెంచుతాం, మేం చెట్లెక్కుతాం
పక్షులతో గొంతెత్తి పాడుతాం మేం
జంతువులతో ప్రేమగా ఆడుతాం
చెట్లెక్కి గుట్టలెక్కి వాగువంకలన్నీ
తిరిగి ఆనందంగా గడిపేస్తాం.
రచన: సి.కృష్ణవేణి, 8వతరగతి, ప్రకృతిబడి.

శీల సంపద
ఓటి కుండ బతుకులోన ఓపికంత
వొలికి పోవగ వ్యర్ధుడు వగచుచుండు.
శీలములు లేక ధర్మపు సిరులు రావు.
శుద్ధ ధర్మపద మిదియె శుభములిచ్చు!
మంచిగుణాలు లేకుండా దురలవాట్ల పాలైన వాని ఆరోగ్యం పాడైపోతుంది. చిల్లి కుండలో నీరు కారిపోయినట్లు దుశ్శీలుని శరీరం రోగాల పాల బడటం వలన అతని శక్తి అంతా క్షీణిస్తుంది. శీలం లేక పోతే ధర్మ సిరులైన శాంతి, సుఖము, మైత్రి, ప్రేమ లభించవు.

ఎంతెంత దూరం?
ఎంతెంత దూరం? మరుమల్లె గంధమా!
కొద్ది కొద్ది దూరం!
ఎంతెంత దూరం? ఘుమ్మను గులాబి పరిమళమా!
కొద్ది కొద్ది దూరం!
ఎంతెంత దూరం! నంది వర్ధన పరిమళమా!
కొద్ది కొద్ది దూరం!
ఎంతెంత దూరం? సాధు సత్పురుషుల శీల గంధమా!
దేవ లోకమంత దూరం!
ఏ పువ్వుల వాసనైనా కొంత దూరమే వ్యాపిస్తుంది. కానీ సాధు సత్పురుషులకు శీలం వలన కలిగే కీర్తి దేవలోకం వరకూ వ్యాపిస్తుంది.
(పై రెండు కవితలూ “ధమ్మ పదం” అనువాదం నుండి. అనువాదకులు శ్రీ తియ్యగూర సీతారామరెడ్డి గారు, విజయవాడ. )