రేకులకుంట బళ్ళో చదువుకునే సునీల్‌కి గర్వం ఎక్కువ; డబ్బు పిచ్చి కూడాను. "తనే గొప్పవాడు" అని అందరితోటీ చెప్పుకునేవాడు ఎప్పుడూ. రేకులకుంటలో ప్రతి సంవత్సరం గంగమ్మ జాతర చేసేవాళ్ళు. చాలా ఆనందంగా జరుపుకునేవారు జాతరను. ఒకసారి గంగమ్మ జాతర సందర్భంగా పిల్లలందరికీ ఆటలపోటీలు పెట్టారు. అందులో మూడు కిలోమీటర్ల పరుగు పందెంలో గెలిచాడు సునీల్! దాంతో జాతర నిర్వాహకులు వాడికి ఒక నగదు బహుమతి ఇచ్చారు. ఇంకేముంది, వాడి గర్వానికి అంతులేకుండా పోయింది.

చివరికి వాడి స్నేహితులందరూ కలిసి "ఎలాగైనా వాడి గర్వాన్ని తగ్గించాలి" అనుకున్నారు. అందుకు తగిన ఉపాయం ఆలోచించి పెట్టుకున్నారు. మరొక నెల రోజులకు, బడిలో ఆటలపోటీలు మొదలయ్యాయి. ఈసారి కూడా పరుగు పందెంలో పాల్గొన్నాడు సునీల్. పరుగు మొదలైంది- సునీల్ బాగా పరుగు పెడుతున్నాడు- అకస్మాత్తుగా అతనికి నేలమీద ఒక పది రూపాయల నోటు కనబడింది. దాన్ని పట్టించుకోకుండా ముందుకు పరుగు తీశాడు. అంతలోనే అతనికి ఎదురుగా మరొక పదిరూపాయల నోటు పడి కనిపించింది. వాడికి డబ్బు పిచ్చి కదా, అందుకని ఆగి, అటూ ఇటూ చూసి, వంగి దాన్ని ఎత్తి జేబులో వేసుకున్నాడు. మరికొంత దూరం వెళ్ళేసరికి ఇంకొక నోటు! ఇలా ఐదారు నోట్లు ఏరుకుంటూ సమయాన్ని పట్టించుకోలేదు వాడు. దాంతో మిగిలినవాళ్లంతా వాడికంటే ముందు గమ్యం చేరుకున్నారు!

"ఏంరా, సునీల్! పది రూపాయల నోట్లు!!" అని నవ్వారు మిత్రులంతా. సిగ్గుపడ్డ సునీల్ తన తప్పును తెలుసుకున్నాడు. తనను క్షమించమనికోరాడు మిత్రుల్ని. గర్వాన్ని, డబ్బు పిచ్చిని జయిస్తానని మాట ఇచ్చాడు అందరికీ.

అటుపైన ప్రతి ఆటల పోటీలోనూ బహుమతులు వాడివే. కానీ ఏనాడూ వాడు గర్వం పాలవ్వలేదు. వాడిలోని మార్పుకు మిత్రులంతా చాలా సంతోషపడ్డారు.