నేను తెల్లవారి లేచాను. ఒళ్ళు విరుచుకున్నాను. సునీతక్క కూడా లేచి పక్క సర్దింది. మంగవ్వ ఎక్కడ? టీ పెట్టుకుంటా ఉంది. ‘మ్యావ్' అంటూ ఆమె దగ్గరికి వెళ్లి, ఆమెని చుట్టి, కాళ్ళ మధ్యలో దూరి, ఆమె చీరమీద రాసుకుంటూ ఉన్నాను. మంగవ్వ అంటే నాకు చాలా ఇష్టం. ఇలా తొందర చేయకపోతే బువ్వ పెట్టదు- "కొంచెం ప్రశాంతంగా టీ తాగనియ్యవే " అంది అవ్వ.
'ఓకే.ఓకే. నేను వెయిట్ చేస్తానులే '
నా పేరు డెయిసీ. నా అసలు పేరు నల్ల పిల్లి. అసలు ఏం జరిగిందంటే మంగవ్వ మనవడు డబ్బిగాడు పోయినసారి వచ్చినప్పుడు నా పేరు మార్చి డెయిసీ అని పెట్టాడు. 'పోనీలే, ఈ పేరు కూడా బాగానే ఉంది' అని అనుకున్నాను. అదిగో మంగవ్వ అన్నం తెస్తోంది . ఈరోజు మజ్జిగన్నం తెస్తోందే! నిన్న పాలన్నం పెట్టింది. అది నాకు చాలా ఇష్టం. మజ్జిగన్నం కూడా పర్వాలేదులే, కడుపు నిండితే చాలు. నేను ఇప్పుడు ప్రపంచాన్ని ఎదుర్కోవడానికి రెడీ.
'మ్యావ్ - ధాంక్యూ అవ్వా, సీ యు !'
నేను పైకి వెళ్లి మచ్చులో ఎలుకల కోసం వెతికాను. 'నిన్న ఇక్కడే ఒక ఎలుకను చూశానే, ఎక్కడికెళ్ళిందబ్బా?' అనుకుంటూ ఇల్లంతా వెతికాను. కనపడలా.
ఒక్కొక్కసారి నాకు ఈ దాగుడుమూత ఆటలంటే విసుగేస్తుంది. కాని ఎలుక కనపడిందంటే దాన్ని పట్టుకునేవరకు అదే ధ్యాస. అందుకోసమే మంగవ్వ మెడిటేషన్ చేస్తుంది. ఆశలు, పట్టులు వదలుకోవాలని.
కానీ ఆమె మెడిటేషన్ చేసేటప్పుడు నేను ఆ రూముకు వెళితే మాత్రం ఆమె నన్ను తరిమేస్తుంది- ఇక నేను ఎప్పుడు, మెడిటేషన్ నేర్చుకునేది?
కిందకు వచ్చి మెట్ల దగ్గర వెతికాను.
'నో లక్. సరే, ఇక్కడే వేచి ఉంటా, తవుడు డబ్బాలోనే దాక్కొని ఉండొచ్చు అది'
ఓరి దేవుడా! బ్లాకీ నా వైపే చూస్తున్నది. నన్ను చూస్తే 'కాదు' దానికి. పరిగెత్తి నన్ను భయ పెట్టేస్తుంది. 'కొంచెం జాగ్రత్తగా ఉండాలి'. నేను దాక్కున్నాను.
సరేలే గానీ బ్లాకీ ఎవరు అనుకుంటున్నారు? మా మంగవ్వ వాళ్ళు నేను ఇక్కడకు రాకముందునుండే బ్లాకీనీ పెంచుకుంటు-న్నారు. దానికి నేనంటే కొంచెం కుళ్లు- నేను వచ్చాక ఇప్పుడందరూ దానిని సరిగ్గా చూసుకోవడం లేదని. అది నా ప్లేటు దగ్గరికి వెళ్లి నేను మిగిల్చిన వన్నీ తింటా ఉంటుంది. 'అబ్బ! ఐ యామ్ బోర్డ్.. '
బోరు కొడుతా ఉంది. 'ఎంత సేపు, ఎలుక కోసం వెయిట్ చేసేది? కొంచెం సేపు చెట్టులెక్కుతాను'.
చెట్టు పైన కూర్చున్నానో లేదో ఒక నల్ల గండు చీమ వచ్చి కుట్టింది. నా పాదంతో ఒకటి వేశాను. కాని అది విదుల్చుకొని వెళ్ళిపోయింది. చెట్టు పైనుండి చాలా దూరం కనిపిస్తుంది.
అయ్యయ్యో! గాజులవాడు వస్తున్నాడు . చాలా డేంజరస్ ఫెలో. గాజులు అమ్ముతూ 'ఎక్కడెక్కడ పిల్లులున్నాయి' అని గమనించుకుంటాడు వాడు. మళ్ళీ రాత్రికి వచ్చి పట్టుకొని వెళ్తాడంట. ఎందుకైనా మంచిది- నేను దాక్కుంటాను-
“అమ్మా, గాజులు కావాలా?” మా ఇంటికొచ్చి సునీతక్కని అడిగాడు వాడు.
సునీతక్క ముఖం వెలిగింది. గాజులు కొన్ని కొనుక్కుంది సునీతక్క. ఎందుకంట, ఈ ఆడవాళ్ళు ఊరికే అనవసర ఖర్చు పెట్టుకుంటారు? ఇలాంటి డేంజరస్ ఫెలోస్ని లోపలికి రానిస్తారు ?
"అమ్మా! మీ ఇంట్లో పిల్లులున్నాయా ?" అడిగాడు వాడు, మంగవ్వని చూస్తూ.
“ఇక్కడ పిల్లుల్లేవ్ ,గిల్లుల్లేవ్- వెళ్ళవయ్యా!" అంది అవ్వ. వాడు వెళ్ళిపోయాడు .
'అమ్మయ్య! నన్ను కాపాడింది.. థాంక్స్ అవ్వా!' -నేను ఆమె దగ్గరకు పోయి ప్రేమతో తడిమాను.
మధ్యాహ్నం భోజనాలు అయ్యాక సునీతక్క, శ్రీను బావ టీవీ చూస్తున్నారు. మంగవ్వ మెడిటేషన్ చేస్తోంది.
టీవి కింద భాగంలో పురుగులు, పూచిలు పాకుతున్నై.
నేను టీవీ దగ్గర పోయి, నా పాదంతో తట్టాను వాటిని. సునీతక్క, శ్రీను బావ పకపకా నవ్వారు- “ఏయ్, నల్లపిల్లీ! అవి పురుగులు కావు- అవి స్క్రోల్స్! " అన్నారు.
'స్క్రోల్సా..?! ఎనివే- సారీ ఫర్ ద డిస్టర్బెన్స్'
చూసేదానికి అందంగా పురుగులు డాన్స్ చేస్తున్నట్టున్న ఆ స్క్రోల్స్ని కాసేపు, టీవీని కాసేపు చూస్తూ ఉంటే శ్రీను బావ నన్ను ఫోటో తీశాడు.
'ఫోటో సర్లే గాని, నా డిన్నర్ ఎప్పుడు రెడీ చేస్తారు వీళ్ళు?' అనుకుంటూ బయటకు వచ్చా.
నాకు చాలా పని ఉంది- టి.వి చూస్తుంటే ఎలా కుదురుతుంది? ఎలుకల్నీ, ఉడతల్నీ, బల్లుల్నీ వెంటాడాలి..
హేయ్! పక్క వూరి పిల్లిగాడు వచ్చి నా వైపు అదోలా చూస్తున్నాడు. చూసే దానికి బాగానే ఉన్నాడు కానీ, నాకు వాడంటే కొంచెం భయం. నేను లోపలకు వచ్చేశాను.
'ఓ! డిన్నర్ రెడీ '.
ఒక బల్లిని మింగేసి, అర్ధరాత్రి దాటాక నేను లోపలకు వచ్చి సునీతక్క పక్కలో పడుకున్నాను. తను అటూ ఇటూ కదులుతూనే ఉంది- నాకు నిద్ర పట్టలేదు. నేను పొయ్యి దగ్గరకెళ్ళి పడుకొని నిద్ర పోయాను. రాత్రి-పగలు పని చేసాక కాసేపు డిస్టర్బెన్స్ లేకుండా నిద్ర పోవద్దూ? మంగవ్వ దగ్గర పడుకోవచ్చు; కానీ ఆమెకు ఇష్టం ఉండదు. నాకు కూడా ఇష్టం ఉండదు- ఎందుకంటే ఆమె పెద్ద పెద్ద గురకలు పెడుతుంది.
మళ్ళీ తెల్లవారి లేచి 'నేనెప్పుడు గురక పెట్టానూ!' అంటుంది సాగదీస్తూ.
'ఇట్స్ ఓకె. నో ప్రాబ్లెం అవ్వా!'
'ఏమి, నీ కథలో క్లైమాక్స్ , డ్రామా, ఫైటింగ్ ఏమీ లేవు ' అనుకుంటున్నారా? మేము మనుష్యులం కాము, మేము మార్జాలాలం. అవి అన్నీ కావాల్సింది మనుష్యులకే. మాకెందుకు? మేం కాస్త జాగ్రత్తగా, తెలివిగా ఉంటే చాలు- బ్రతుకుతాం.
చూస్తూ ఉండండి. కొన్ని రోజుల్లో బ్లాకీ కూడా నాకు దోస్తయిపోతాడు. రేపు సునీతక్క వాడిని నిమిరేటప్పుడు వాడు మంచి మూడ్లో ఉంటాడు గదా? నేను అప్పుడు పక్కకి వెళ్ళి మెల్లగా 'మ్యావ్' అంటా. ప్రేమ మత్తులో ఉన్న బ్లాకీ నన్ను ఏమి చేయడు.
"వావ్! గుడ్ ఐడియా! ' కొన్ని రోజుల్లో మేమిద్దరం ఒకే కంచంలో తింటాం. చూస్తూ ఉండండి. ఏమనుకున్నారు మరి నేనంటే? ఐడియాలు, సర్దుకుని పోవడాలు ఉండాలమ్మా, ఏ పని చేయాలన్నా జీవితంలో!
'బై! సీ యు అగైన్!'