అది ఓరుగల్లు పట్టణం. అక్కడ నలుగురు పిల్లలు ఉండేవాళ్ళు. వాళ్ళంటే టీచర్లకు చాలా ఇష్టం. ఆ పిల్లలకు కూడానూ, టీచర్లంటే అంతే అభిమానం.

ఆ రోజున వాళ్ళకు ఒక పాఠాన్ని వివరిస్తూ టీచరుగారు చెప్పారు- "శాస్త్రవేత్తలు అందరూ చిన్నప్పటి నుండీ ఏదైనా ఒక విషయాన్ని పట్టుకొన్నారంటే చాలా సూక్ష్మంగా ఆలోచించి, దాన్ని సాధించేంత వరకూ పట్టు వదలరు" అని. ఈ మాటలు చాలా నచ్చి, వాళ్లు నలుగురూ వెంటనే శాస్త్రవేత్తలు కావాలని కలలు కనటం మొదలు పెట్టారు.

పట్టుదలగా గ్రంధాలయానికి వెళ్ళి, భూగోళ, ఖగోళ శాస్త్రాలలోని వింతలను దీక్షగా అధ్యయనం చేయటం మొదలు పెట్టారు. ఈ శాస్త్రాల అధ్యయనం వల్ల పిల్లలలో కొన్ని వింత ఆలోచనలు ప్రారంభం అయ్యాయి. అవి వాళ్లని రాత్రుళ్ళలో కూడా వెంటాడాయి!

ఆ అమాయక పిల్లలు శాస్త్రజ్ఞుల లాగా ఏదో ఒకటి కనుగొనాలని ఆరాట పడ్డారు. తమ అమ్మమ్మలు, తాతయ్యలు చెప్పిన పుక్కిటి పురాణాలన్నీ వాళ్ళిప్పుడు గుర్తుకు తెచ్చుకున్నారు. "వాళ్ల చిన్నప్పుడు- అంటే 40 సంవత్సరాల క్రితం- ఓరుగల్లు దగ్గర ఒక గ్రహ శకలం రాలిందట! అది ఒక చిట్టడవి అట! ఇప్పుడు ఆ చిట్టడవీ లేదు; ఎవ్వరూ ఆ గ్రహ శకలాన్ని గుర్తించినట్లు ఆనవాళ్ళు కూడా లేవు!

ఆ విషయం గుర్తొచ్చాక నలుగురు పిల్లలూ ఇక ఊరుకోలేక పోయారు. ఇంటి నుండి ప్రతి రోజూ స్కూలుకు వెళ్తున్నట్లుగా వెళ్ళి, ఓరుగల్లు పరిసర ప్రాంతాల్లో త్రవ్వకాలు మొదలు పెట్టారు. కానీ ఎక్కడా వాళ్లకి ఆ గ్రహశకలాల జాడ దొరక లేదు. పైపెచ్చు, వాళ్లు తవ్విన పరిసరాలలో పేరుకు పోయి ఉన్న వ్యాధి కారకాల వల్ల వాళ్ళ ఆరోగ్యం దెబ్బతిన్నది!

అంతలో పరీక్షలొచ్చేశాయి. పిల్లలు నలుగురూ పాఠాల పైన సరిగా మనసు పెట్టక పోవటం వల్ల, వాళ్లకు పరీక్షల్లో మంచి మార్కులూ రాలేదు! ఈ విషయం వాళ్ళ తాతగారికి తెలిసింది.

ఆయన ఈ నలుగురు పిల్లలనూ పిలిచి, కూర్చోబెట్టుకొని "ఏం చేస్తున్నారు పిల్లలూ? ఏదో పరిశోధన చేస్తున్నట్లున్నారే, ఏంటి, చెప్పండి!" అని అడిగాడు. జరిగింది చెప్పారు వాళ్లు. తాతగారికి తమ తప్పిదం అర్థమైంది. పిల్లలు నిద్రపోవడం కోసం చెప్పిన తూతూ మంత్రపు కథలు ఎంతకి దారితీసాయో తెలిసింది!

పిల్లల మనసులు సున్నితంగా ఉంటాయి. తమకు నచ్చిన పెద్దలు ఏం చెబితే అది వాళ్ల మనసుల్లో నాటుకు పోతుంది. అందుకని జాగ్రత్తగా ఉండాలి.