"అమ్మా!"
"ఏం తల్లీ?"
"నేనంటే నీకిష్టమేనా?"
"ఎంతో ఇష్టం కన్నా!"
"ఎంతిష్టం!"
"మబ్బంత!"
"ఇంకా!"
"అదిగో! ఆ కొండంత!
"ఇంకా?"
"ఆ చెట్టంత!"
"ఇంకా!"
"ఈ నేలంత!"
"ఇంకా?"
"సముద్రమంత!"
"మరి నన్నెందుకు ఇంట్లో ఉండకుండా బడికి పంపిస్తావు?"
"చక్కగా చదువుకోవాలిరా కన్నా!"
"చదువుకుంటే మంచి మంచి పుస్తకాలు చదువుకోవచ్చు!"
"పుస్తకాలు చదువుకుంటే!"
"చాలా సంగతులు తెలుస్తాయి!"
"తెలిస్తే!"
"మంచి పనులేంటో చెడ్డ పనులేవిటో తెలుస్తాయి!"
"తెలుసుకుని?!"
"మంచి పనులు చేస్తూ మబ్బంత అయిపోవచ్చు!"
"మబ్బంత అయితే!"
"చక్కగా అందరికీ నీళ్ళివ్వచ్చు!"
"మరి కొండంత అయితే ?"
"కొండ కూడా మంచి పనులే చేస్తుంది. ఆవులకు, మేకలకు మేతిస్తుంది కదా!"
"మరి నేలయితేనో?"
"మనందరికీ అన్నం పెట్టేది నేలే కదా!"
"చెట్టంత అయితే?"
"బోల్డన్ని కాయలూ, పళ్ళూ ఇవ్వచ్చు!"
"మరి సముద్రమయితే?"
"నీళ్ళల్లో ఉండే జంతువులన్నిటికీ ఇల్లు సముద్రమే కదరా!"
"అయితే నేను కూడా బాగా చదువుకుంటానమ్మా! మంచి మంచి పనులు చేస్తా! మబ్బులాగ, కొండలాగ, చెట్టు లాగ, నేల లాగ, సముద్రం లాగ అందరికీ సాయం చేస్తా!"
"బై అమ్మా ! స్కూలు కెళ్తున్నా"
"టా!టా!"