బుజ్జిగాడికి బాగాలేదు- చిట చిటలాడుతూ, రుసరుసలాడుతూ చాలా కోపంగా ఉన్నాడు.

అంతకుముందు రోజే వాడి కథల పుస్తకం పోయింది- ఎవరు ఎత్తుకెళ్ళారో, ఏమో? పుస్తకం లేకుండా చదువుకునేదెట్లాగ? ఈ రోజున చూస్తే, పెన్సిలు కనబడటం లేదు.

తన వస్తువులన్నీ తీసుకెళ్ళిపోతున్నారు ఎవరో.

"ఇంట్లోనే ఖాళీగా ఉంటుంది కదా, చిన్ని!? అదే తీసుకొని ఉండచ్చు" అనుకున్నాడు: చిన్ని బుజ్జిగాడి చెల్లెలు. దానికి మూడేళ్ళు.

"నాతు పుత్తకం కావాలమ్మా!" అంటూ పుస్తకాన్ని ఎత్తి చేతుల్లో పెట్టుకొని, కాలేజికి పోయే పిల్లలాగా పోతుంటుంది. ఇచ్చెయ్యమని ఎంత మొత్తుకున్నా ఇవ్వదు. ఇపుడు పెన్సిలుకూడా ఎత్తుకెళ్ళినట్లుంది-

'పోనీ, తీసుకెళ్ళి చదువుకుంటుందా' అంటే దానికి ఇంకా బొమ్మలు చూడటంకూడా రాదు పూర్తిగా! ఊరికే, అన్నీ పోగు చేసుకుందామని ఆశ.

బుజ్జిగాడు వెళ్ళి, పాప సామాన్లన్నీ క్రింద పోసి చూశాడు- పుస్తకం, పెన్సిలు కనబడలేదు అందులో: "మరి, ఎక్కడ పెట్టి ఉంటుందబ్బా?!"-

వెళ్ళి ముందుగదిలో పేపర్లు పెట్టే చోట వెతికాడు: అక్కడా లేదు.

"ఇది తీసుకెళ్ళి బయట ఎక్కడో పడేసి ఉంటుంది" అనుకున్నాడు బుజ్జిగాడు.

వాడికి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. "తనకు ఎంతో ఇష్టమైన కథల పుస్తకం! తను ఎంతో‌ముచ్చటపడి కొనుక్కున్న గులాబీ రంగు పువ్వుల పెన్సిలు! చిన్నికి బుద్ధి చెప్పాల్సిందే. ఊరుకుంటే లాభం లేదు"

బుజ్జిగాడు వెళ్ళి చిన్ని బొమ్మల్లోంచి కుందేలు బొమ్మను బయటికి లాగాడు. ఆ బొమ్మంటే చిన్నికి చాలా ఇష్టం. లోపలికి రాగానే ఇప్పుడు అది ఆ బొమ్మకోసం వెతుక్కుంటుంది. చిన్నికి దొరకకుండా బట్టల అలమారలో దాచి పెట్టేశాడు బొమ్మని. "నా పుస్తకం, నా పెన్సిలు ఇస్తే, దాని కుందేలు బొమ్మ దానికి దొరుకుతుంది. లేకపోతే తను అదెక్కడుందో ఎన్నటికీ చెప్పడు."

చిన్ని వచ్చింది- ఎగురుకుంటూ, గెంతుకుంటూ. రాగానే దాని కళ్ళు కుందేలు బొమ్మకోసం వెతికాయి. "ఏయ్, నా కుందేలు బొమ్మ ఏది?" అన్నది. బుజ్జిగాడే తీసి దాచి పెట్టాడని దానికి ఎట్లా తెలిసిందో, మరి!

"నాకు తెలీదు. నా పుస్తకం, పెన్సిలే దొరకలేదని నేను ఏడుస్తున్నాను-నువ్వే తీశావు కదూ?!"

చిన్ని అడ్డంగా తల ఊపింది- "చిన్ని తీస్కోలేదు. చిన్నికేం తెలీదు"

"అబద్ధం!" అరిచాడు బుజ్జి. "నా పుస్తకం, పెన్సిలు నువ్వే తీసుకున్నావు. ఎక్కడ పెట్టావో చెప్పు! ఎప్పుడూ నువ్వే నా వస్తువులన్నీ తీసుకుంటావు. ఇచ్చెయ్, నావి నాకు!"

"చిన్ని తీస్కోలేదమ్మా! బుజ్జన్న సామాన్లు బుజ్జన్న దగ్గరే ఉంటాయి" అన్నది చిన్ని.

"ఇదిగో చెబుతున్నాను- నా పుస్తకం పెన్సిలు నాకు ఇచ్చెయ్యి. లేకపోతే నీ కుందేలు నీకు ఎప్పటికీ అసలు దొరకనే దొరకదు"

చిన్ని లేచివెళ్ళి బుజ్జిగాడి సంచీ తీసింది. అందులోని సామాన్లన్నీ క్రిందికి వంపి, కుప్ప పోసింది.

"చూస్కోమ్మా! నీ పుస్తకం, పెన్సిలు నీ దగ్గరే ఉన్నై" అంది.

బుజ్జిగాడు ఆశ్చర్యపోయాడు. కుప్పలోనే ఉన్నై, తన పుస్తకమూ, పెన్సిలూ! "మరి అవి తనకెందుకు కనబడలేదు, ఇందాక?"

బిక్కమొఖం వేసుకొని వెళ్ళి, బట్టల మధ్యలోంచి కుందేలు బొమ్మను తెచ్చి ఇచ్చేశాడు చిన్నికి.

"మా బుజ్జన్న ఎంత మంచిదో చూడు! అన్నీ జాగ్రత్తగా ఎత్తి పెడుతుంది!" అని మురిసిపోయింది చిన్ని, కుందేలును ఎత్తుకుంటూ.

చాలాసార్లు మనం పోగొట్టుకున్నవి మనకు కనబడవు. వేరేవాళ్ళెవరో వాటిని పోగొట్టిఉంటారన్న అనుమానం కొద్దీ, మనం సరిగ్గా వెతకం కాబోలు.

అనుమానాలు ప్రక్కన పెట్టేసి చూస్తే, వస్తువులు ఉన్నవి ఉన్నట్లు కనబడతాయి. ఏమంటారు?

అభినందనలతో,
కొత్తపల్లి బృందం.