ఉదయభానుడి లేలేత కిరణాలు మీద పడటంతో రాములమ్మ చిరుగుల దుప్పటిని ప్రక్కకు లాగి దిగ్గున లేచి కూర్చుంది. వయసు పై బడిన అవ్వ రోజూ కేకలు వేసి లేపుతుంది- చిన్న రాములమ్మను. ఆ రోజు అవ్వ లేవలేదు- 'నా అన్నవాళ్ళు ఎవ్వరూ లేని రాములమ్మకు ఉన్న ఆ ఒక్క ఆధారం కూడా పోయింది- అవ్వ చనిపోయింది.

తను రోజూ పని చేసే దుకాణం యజమాని 'సేఠ్' దగ్గరకు వెళ్ళింది రాములమ్మ. బిక్కు బిక్కుమంటూ, ఉన్న విషయం చెప్పింది. ఆయనా, ఆయన భార్యా రాములమ్మను ఓదార్చారు- మిగిలిన తతంగమంతా పూర్తి చేశారు. తరువాతి రోజు నుండి రాములమ్మ దినచర్య మారిపోయింది. ఉదయం సేఠ్ భార్యాకు ఇంటి పనులలో సాయం చేయటం, తరువాత సేఠ్ దగ్గర అంగట్లో సరుకులు అందించటం- ఇలా పని బరువుగా సాగింది.

కొద్ది రోజుల తర్వాత రాములమ్మ అంగడి దగ్గరకు వెళ్ళింది. అప్పుడే సేఠ్, సేఠ్ భార్య ప్రయాణమయ్యి రాములమ్మ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. రాములమ్మ రాగానే 10రూపాయలు చేతిలో పెట్టి "మేము తిరుపతికి బయలదేరుతున్నాము. తిరిగి వచ్చేందుకు మూడు రోజులు పడుతుంది. అంత వరకు ఈ సరుకులు తీసుకొని వాడుకో " అని చెప్పి బయలు దేరి వెళ్లారు.

ఆ మూడు రోజులూ ఏం చేయాలో అర్థం కాలేదు రాములమ్మకి, ఉదయమే లేచింది, తమ వీధిలో పశువులు వేసిన పేడనంతా సేకరించింది. తరువాత వంట చేసుకొని తిన్నది. సాయంకాలం కూడా పొద్దుపోలేదు- మళ్ళీ వీధంతా తిరిగింది. పేడనంతా పోగు చేసి తన గుడిసె ముందు వేసింది. ఇలా రోజూ ఉదయం, సాయంత్రం... మెల్లగా ఇది ఒక అలవాటుగా మారిపోయింది. ఇప్పుడు రోజు ఉదయం, సాయంత్రం ఈ పని ముగించుకొని, తరువాతే సేఠ్ దగ్గర పనికి వెళ్ళేది.

ఇలా సంవత్సరం పొడవునా పోగు చేసిన పేడ దాదాపు 20బండ్లు అయింది. ఇంతలో శరత్కాలం వచ్చింది. చేన్లకి ఎరువులు తోలడం మొదలు పెట్టారు రైతులు. రైతులందరి కన్నూ రాములమ్మ గుడిసె ముందు ఉన్న పేడ దిబ్బ మీదే! మెత్తటి పేడకల్లు చూసి రైతులంతా ఆ ఎరువును కొనాలనుకున్నారు. ఈ వ్యవహారం అంతా సేఠ్ దగ్గరకు పోయింది. సేఠ్ ఒక రైతుతో మాట్లాడి, బండి ఎరువుకు 200రూ/- చొప్పున మొత్తం నాలుగు వేల రూపాయలు రాములమ్మ చేతిలో పెట్టాడు.

ఒక్క సారిగా చేతిలోకి వచ్చిన నాలుగు వేల రూపాయల్ని చూసి రాములమ్మకి నోటమాట రాలేదు. ఆ డబ్బును తీసుకొని, సేఠ్ భార్య సహాయంతో బ్యాంక్‌లో దాచుకున్నది. తన దగ్గర మిగిలిన 10రూపాయలతో చక్కెర బిళ్ళలు కొని వీధిలోని పిల్లలందరికీ పంచింది.

ఇప్పుడు రాములమ్మ తన ఖాళీ సమయాన్నంతా పేడను ప్రోగు చేయడం కోసమే వెచ్చించింది. వీధిలో పిల్లలు కూడా ఆమెకి పేడ ఎత్తడంలో సాయం చేశారు. అలా రాములమ్మ పిల్లల సాయంతో చాలా‌ పేడ పోగు చేసింది. సేఠ్ దగ్గర పనికి కూడా క్రమం తప్పకుండా వెళ్ళేది; వాళ్ళు ఆమెను బాగా ఆదరించేవాళ్ళు- తమవంతు సాయం చేసేవాళ్లు. మరుసటి సంవత్సరం రాములమ్మ ఎరువుకు మును పటి ఏడాది కంటే మూడింతలు లాభం వచ్చింది. ఈ డబ్బు మొత్తం‌ ఆమె బ్యాంకు ఎకౌంటులో జమైంది. ఇలా ఆమె పేరిట బ్యాంకులో మొత్తం లక్షరూపాయల వరకు సొమ్ము జమైంది.

అయితే ఒక సంవత్సరం తీర్థయాత్రలకు బయలు దేరిన సేఠ్ దంపతులు ఆకస్మికంగా రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఉన్న అంగడిని, ఇల్లును బంధువులు లాక్కొని పోయారు. రాములమ్మ భోరున ఏడ్చింది. అయినా ధైర్యం కూడ గట్టుకొని, తను దాచుకొన్న సొమ్ముతో సొంతంగా చిల్లర దుకాణం ఒకటి మొదలుపెట్టింది. పేడను సేకరించే పనిని కూడా క్రమం తప్పకుండా కొనసాగించింది. అయితే సేఠ్ దగ్గర నేర్చుకున్న వ్యాపార మెళకువలతో వ్యాపారాన్ని కూడా చక్కగా నడిపింది.

రానురాను రాములమ్మ అంగడిలో వచ్చే ఆదాయం కూడా బాగా పెరిగింది. చాలా మంది పిల్లలు ఆమెకు స్నేహితులయ్యారు.

జీవనానికి లోటు లేదు- సమాజం నుంచి చాలా మంచి విషయాలు తెలుసుకున్నది- మంచి, చెడు అర్థం చేసుకున్నది- కష్టం యొక్క విలువను, అందులోని ఆనందాన్ని అనుభవ పూర్వకంగా తెలుసుకున్నది.

ఇప్పుడు రాములమ్మ ఊళ్లో అందరి కంటే ధనవంతురాలు. చాలా మంది పేద పిల్లలకు చదువుకోవడానికి సాయం‌ చేస్తుంది. ఊరందరికీ తలలో నాలుకలా మెసలుతున్నది- కానీ పేదరికంలో కష్టాన్ని మాత్రం‌ ఏ రోజూ మరిచి పోలేదు. రాములమ్మ నీడలో చాలా మంది పేద పిల్లలు, ముసలి వాళ్ళు ఆశ్రయం పొందుతున్నారు, శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతీకగా నిలిచింది ఆమె.