హిమాలయ పర్వతాల పాదం దగ్గర దట్టమైన అడవి ఒకటి ఉండేది. రెండువందల యాభై అడుగుల పై ఎత్తున్న దేవదారు వృక్షాలు, ఏపుగా పెరిగిన టేకు చెట్లు, వివిధ వృక్షరాజాలు, వెదురు గుబుర్లు, లతలు-తీగలతో ఆ అడవి అత్యంత మనోజ్ఞంగా ఉండేది. రకరకాల ఔషధులు, సువాసనలీనే పుష్పాలు, లెక్కలేనన్ని రకాల గడ్డి జాతులు ఆ ప్రదేశాన్ని అలంకరించి ఉండేవి. ఎన్నో పులులు, సింహాలు, ఏనుగులు, చిరుతలు, జింకలు, కుందేళ్ళు- వేల రకాల పక్షులు ఆ అడవిని నివాసంగా చేసుకొని నివసిస్తూ ఉండేవి.

ఆ అడవిలోనే, ఒక వెదురు దుబ్బలో నివసించేది, ఒక చిలుక. దానికి ఆ అడవి అంటే చాలా ఇష్టం. తనతోబాటు నివసించే జంతువులంటే దానికి చాలా ప్రేమ. అడవిలో తనకు ఆశ్రయం ఇచ్చి కాపాడే వెదురు దుబ్బ అంటే కూడా దానికి ఎంతో అభిమానం ఉండేది.

ఒకసారి, తీవ్రంగా వచ్చిన గాలికి, వెదురు దుబ్బల్లోని వెదుర్లు ఒకదానితో‌ ఒకటి ఎంతగా రాసుకున్నాయంటే, వాటి మధ్య గల ఘర్షణవల్ల అక్కడి గడ్డి కాస్తా అంటుకొని మండనారంభించింది. త్వరలోనే ఆ మంట చుట్టు ప్రక్కలకు వ్యాపించి, పెద్ద దావానలం‌ అయ్యింది. ప్రళయ భయంకరంగా చెలరేగిన ఆ మంటల్లో‌ చిక్కుకొని అసంఖ్యాక జంతుజాలం హాహాకారాలు చేస్తూ, దిక్కుతోచక పరుగులు పెడుతున్నాయి.

ముందుగానే మేల్కొన్న చిలుక ఎగిరి, ఆ మంటలకు అందకుండా తప్పించుకోగలిగింది. కానీ తన తోటి జంతువులు అలా మంటలపాలు ఔతూండటం చూసి దాని మనసు ఆర్ద్రమైంది. దయతోటీ, జాలితోటీ, కరుణ చిత్తంతోటీ అది "నా తోటి జంతువులకోసం‌ నేను ఏం చేయగలను?" అని ఆలోచించింది. దగ్గరలోనే ఒక సరస్సు ఉన్నది- చిలుక వెళ్ళి ఆ సరస్సులో మునిగి, వేగంగా పైకెగిరి వచ్చి, మంట మీదుగా ఎగురుతూ ఒళ్ళు విదుల్చుకున్నది. మళ్ళీ వెళ్ళి, సరస్సులో మునిగి వచ్చింది. ఇట్లా మళ్ళీ మళ్ళీ‌ అదే పని చేస్తూ, తను విదిల్చే నీటి తుంపరల వల్ల తన తోటి ప్రాణులకు ఏ కొద్దిపాటి మేలైనా జరిగితే చాలునని ఆశపడింది.

ఆ సమయంలో అక్కడే ఆకాశంలో నిలబడి, దిక్కుతోచక అటూ ఇటూ చూస్తున్న వనదేవత ఒకడు, చిలుక చేస్తున్న పనిని చూసి ఆశ్చర్యపడ్డాడు. అది నిరంతరంగా అలుపు-ఆయాసం లేనట్లు, మళ్ళీ మళ్ళీ అదే పనిని చేస్తూండటం చూసి అతను అబ్బురపడి, దానితోబాటు తనూ ఎగురుతూ "ఓ చిలుకా, చూడగా నీకు ధైర్యం ఎక్కువ అని తెలుస్తున్నది- కానీ ఈ‌ ప్రళయాగ్ని విజృంభణం ఎంతటిదో చూశావుగదా, నువ్వు వదిలే ఈ‌ కొద్ది నీళ్ళ తుంపర, ఆ అగ్నిని ఏమి చేయగలదని, ఇంతగా ప్రయాస పడుతున్నావు?" అని అడిగాడు.

చిలుక చెప్పింది- "దయతోటీ, కరుణతోటీ, త్యాగంతోటీ కూడిన మనస్సు చేయలేని పని అంటూ ఏదీ లేదు. నేను ఈ పనిని ఆపను- ఈ జన్మలోనే కాదు; వీలైతే వచ్చే జన్మలో కూడా నా ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉంటాను ఎలాగో ఒకలాగా ఈ మంటల్ని ఆర్పగలిగితే చాలు" అని .

చిలుక సంకల్పం వనదేవతనూ కదిలించింది. అతనూ చిలుకతో కలిసి పనిచేయటం మొదలుపెట్టాడు. ఇద్దరూ కలిసి చివరికి మంటల్ని అదుపులోకి తేగలిగారు!