అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యం పేరు వైశాలి. ఆ రాజ్యాన్ని ఒక రాజు పరిపాలిస్తున్నాడు. ఆ రాజుకి ఒక కూతురు ఉంది. ఆమె అంటే ఆయనకు ప్రాణం. అయినా ఏం చేస్తాం, ఒక రోడ్డు ప్రమాదంలో ఆయన కూతురు మరణించింది.
తన కూతురి గుర్తుగా ఆయన ఒక బంగారు విగ్రహం తయారు చేయించాడు. కొంత మంది గజదొంగలకు ఆ విషయం తెలిసింది. ఎలాగైనా దాన్ని దొంగిలించాలనుకున్నారు వాళ్ళు. ఆ రోజు రాత్రి ధైర్యంగా రాజభవనంలోకే ప్రవేశించారు. దొంగలు రావచ్చని కూడా ఊహించని రాజభవనం అంతా నిద్రలో మునిగి తేలుతున్నది. దొంగలు బంగారు విగ్రహం కోసం మెల్లగా కోటలో అంతా వెతికారు.
చివరికి అది రాజుగారి గదిలో కనిపించింది. "ఎన్నడూ చూడనంత బంగారం చూశాం" అనుకొని, వాళ్లు ఆ విగ్రహాన్ని ఎవ్వరికీ తెలియకుండా, చప్పుడు చేయకుండా, ఎత్తుకొని పోయారు- వాళ్ళ స్థావరానికి. రాజుగారు ఉదయానే లేచి చూస్తే ఏముంది? తన కూతురు బంగారు విగ్రహం మాయం!
రాజుగారికి ఏం చేయాలో తెలీలేదు. ఆస్థానంలోని మంత్రులను అందరినీ అత్యవసరంగా పిలిపించారు. తన కూతురు బంగారు విగ్రహాన్ని ఎత్తుకెళ్ళిన దొంగలను పట్టుకొమ్మని ఆజ్ఞాపించారు. మంత్రులందరూ తమ తమ పరిధుల్లో మనుషుల్ని వినియోగించి వెతికించారు- ఫలితం మాత్రం శూన్యం! బంగారు విగ్రహం నిజంగా మాయమే అయిపోయింది!
వాళ్లలో ఒక మంత్రి చాలా తెలివైన వాడు. ఆలోచించగా అతనికి ఒక ఉపాయం తట్టింది. దాన్నే రాజు గారికి చెప్పాడు; రాజు గారికి ఆ ఉపాయం నచ్చింది. దాన్ని పాటిస్తూ ఆయన మరొక బంగారు విగ్రహం తయారు చేయించారు. ఆ విగ్రహాన్ని గురించి ఘనంగా చాటింపు కూడా వేయించారు: "అది ముందుసారి విగ్రహం కంటే పెద్దది, ఇంకా ఖరీదైనది" అని చెప్పించారు. దాన్ని గురించి విన్న దొంగలకు మళ్ళీ ఆశపుట్టింది. "ఆ విగ్రహాన్ని కూడా దొంగిలించేద్దాం" అనుకున్నారు వాళ్ళు. ఏమాత్రం బెరుకూ లేకుండా వాళ్ళు మళ్ళీ ఒకరోజు రాత్రి రాజభవనంలోకి ప్రవేశించారు.
బంగారు విగ్రహం కోసం వెతుకుతూ వాళ్ళు మళ్ళీ రాజుగారి గదిలోకి వెళ్ళారు. కొత్త బంగారు విగ్రహం అక్కడే ఉంది- ఇదివరకటికంటే పెద్దదిగా; అందంగా. 'ఇంక దానినిఎత్తుకెళ్దాం' అని చేయి పెట్టారో లేదో- రాజభటులు పరుగున వచ్చి వాళ్ళని బంధించారు. రాజుకు మొదటి బంగారు విగ్రహం కూడా లభించింది; దొంగలకి కఠినమైన శిక్ష లభించింది; చక్కని ఉపాయం చెప్పిన మంత్రికి ఇంటి నిండా బహుమతులు లభించాయి!