సింహపురి రాజ్యాన్ని సింహనందుడు పరిపాలించేవాడు. ఒకసారి ఆ రాజ్యంలో వర్షాలు పడలేదు. పంటలు సరిగా పండలేదు. తిండి గింజలకు కరువైంది. త్రాగు నీళ్లకు కష్టమైంది. ఏంచేయాలో ప్రజలకుగాని, రాజుకు గాని అర్థం కాలేదు.

ఆ రాజ్యంలోనే ఒక టైలరు ఉండేవాడు. అతడు కత్తెరతో అద్భుతంగా పని చేసేవాడు. సూదితో‌ఎన్ని వింత కుట్లు వేయగలడో! ఎంత వేగంగా పని చేస్తాడో! రోజూ ఎవ్వరూ ఊహించలేనంత అద్భుతాన్ని ఏదో ఒక దాన్ని సృష్టించేవాడు అతను. ఎప్పుడూ ఒక సంచిలో సూది, కత్తెర, దారాలు పెట్టుకొని ఉండేవాడు.

టైలరుకు ఒక రోజున ఒక ఆలోచన వచ్చింది- "సింహపురి రాజ్యంలో ఉన్న కొండల్లో అన్నిటికంటే పెద్ద దాని మీదికి ఎక్కి, మేఘాల్ని పట్టుకొని, ఆకాశాన్ని నా కత్తెరతో కత్తిరించేస్తాను!" అని.

వెంటనే అతను రాజుగారి దగ్గరికి వెళ్ళి, "రాజా! నేను వర్షాన్ని తెప్పిస్తాను" అన్నాడు. దానికి రాజు నవ్వి, "సరే, నువ్వు గనక వర్షాన్ని తెప్పించావంటే, నీకు నా సింహాసనాన్నే సమర్పిస్తాను" అన్నాడు. తను రాజు కావటానికి ఇదొక గొప్ప అవకాశం అనిపించింది టైలరుకు. అతను వెంటనే బయలుదేరి, రాజ్యంలోనే అతి పెద్ద కొండ మీదికి ఎక్కాడు. పైనుండి పోతున్న ఒక పెద్ద మేఘాన్ని పట్టుకొని, ఆకాశాన్ని 'కట్ కట్ కట్'మని మూడుసార్లు కత్తిరించేశాడు. అంతే!-రాజ్యమంతటా వర్షం పడటం మొదలైంది. ప్రజలందరూ సంతోష పడ్డారు. ఇక తమకు కష్టకాలం పోయిందనుకున్నారు. ఇప్పుడు వంకలు, వాగులు పారుతున్నాయి; చెరువులు నిండుతున్నాయి; అందరి ముఖాలూ కళకళలాడుతున్నాయి.

టైలరు రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. తను వర్షాన్ని ఎలా తెప్పించాడో చెప్పాడు. ఆయన మాట ప్రకారం‌ తనను రాజును చేయమన్నాడు. రాజుగారు టైలరు మాటలు నమ్మలేదు. "నువ్వు అబద్ధం చెబుతున్నావు- వర్షం రావటానికీ, నువ్వు ఆకాశాన్ని కత్తిరించటానికీ ఏమీ సంబంధం లేదు. వర్షం దానంతట అదే వచ్చింది. నీ మాటలు నేను నమ్మను. సింహాసనం లేదు; గింహాసనం లేదు- పో, ఫో!” అన్నాడు.

టైలరు చిన్నబోయాడు. తన పనిని రాజుగారు గుర్తించనందుకు బాధపడ్డాడు. 'అయినా నేను ఏమంత పెద్ద పని చేశానులే' అని తనను తాను ఓదార్చుకున్నాడు.

అయితే, ఒక సమస్య తీరిందనుకుంటే ఇంకొక సమస్య వచ్చిపడింది: ఇప్పుడు ఇక వర్షం ఆగటమే లేదు- పడుతూనే ఉంది! చెరువులు నిండిపోయాయి; మొరవలు పారాయి; కొన్నింటికి కట్టలు తెగిపోయాయి; నదులు పొంగి వరదలు వచ్చాయి; చాలా ఊర్లు మునిగి పోసాగాయి; ప్రజల జీవితాలన్నీ‌ అస్తవ్యస్తం అయిపోయాయి. చివరికి రాజుగారి అంత:పురం కూడా వరదలో మునిగి పోయే పరిస్థితి దాపురించింది.

రాజుకు బుద్ధి వచ్చింది. వెళ్లి టైలరును కలిసి, తన రాజ్యాన్ని వరదల బారినుండి కాపాడమన్నాడు. ఎలాగైనాసరే, ఇప్పుడు వర్షాన్ని ఆపించమన్నాడు. తన తప్పును క్షమించమనీ, ఇక ఎప్పుడూ ఎవ్వరినీ‌ మోసం చెయ్యననీ, వేడుకున్నాడు.

'సరే, చూస్తాను, వర్షాన్ని ఆపేందుకు వీలవుతుందేమో' అని టైలరు రాజుకు మాట ఇచ్చి, వర్షంలోనే తడుసుకుంటూ రాజ్యంలో ఒక్కొక్క ఇంటికీ వెళ్ళాడు. అందరి ఇళ్లల్లోనూ ఉన్న పాత దుప్పట్లు, చీరలు, పంచెలు, తువ్వాళ్లలాంటివి చాలా సేకరించాడు.

అతనికి సాయం చేసేందుకు రాజ్యంలోని ప్రజలందరూ బయలుదేరారు. టైలరు వాళ్లందరినీ వెంటబెట్టుకొని, తన సంచీ తీసుకొని, మళ్ళీ కొండ మీదికి వెళ్ళాడు. పాత బట్టలన్నిటినీ‌ పేలికలుగా చీల్చాడు. సూది, దారం తీసుకొని, ఆకాశానికున్న చిల్లులన్నింటినీ బట్ట పేలికలతో‌కుట్టేయటం మొదలుపెట్టాడు.

రాత్రయింది- చాలా చీకటి. హోరున వర్షం. ఉరుములు, మెరుపులు- ఆ మెరుపుల వెలుగులో టైలరు ఆకాశానికి రాత్రంతా కుట్లు వేస్తూ పోయాడు. వేల కుట్లు- లక్షలాది కుట్లు వేశాడు.

నిదానంగా వర్షపు హోరు తగ్గటం మొదలైంది. తెల్లారేసరికి వాన చాలావరకు వెలిసింది- మేఘాలనుండి మాత్రం చుక్క చుక్క నీరు పడుతున్నది.

టైలరు చేసిన పనిని చూస్తూ జనం అంతా అవాక్కై ఉండిపోయారు. టైలరు ఇంకా కుడుతూంటే, వాళ్ళంతా అతనికి సాయం వచ్చారు. చివరికి అంతా 'చాలు, మనకిక భయం లేదు' అనుకునేంతవరకూ పని చేశారు.

అందరూ టైలరును భుజాలమీద ఎత్తుకొని, ఊరేగింపుగా రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళారు. రాజుగారు టైలరును ఆహ్వానించి తన సింహాసనంపై కూర్చోబెట్టి, అతన్ని రాజును చేశాడు. అప్పటినుండి ఆ రాజ్యం సుఖ సంతోషాలతో‌విలసిల్లుతోంది.