ఒక ఊళ్లో ఒక గడ్డివాము ఉండేది. దానికి దగ్గర్లోనే ఒక చెట్టు ఉండేది. ఆ చెట్టుకు ఒక పెద్ద తొర్ర ఉండేది.

ఆ చెట్టు దగ్గరికి రోజూ కొందరు గొర్రెల కాపరులు వచ్చేవాళ్ళు- గొర్రెల్ని తోలుకొని. అలా ఆ చెట్టు దగ్గరికి రాగానే, వాళ్ళు తమతోబాటు తెచ్చుకున్న భోజనాలను చెట్టు తొర్రలో పెట్టుకునేవాళ్ళు. మళ్ళీ మధ్యాహ్నం కాగానే వాటిని తీసుకొని తినేవాళ్ళు.

ఒక రోజున గొర్రెల కాపరులు అలా చేయటం ఓ నక్క చూసింది. వాళ్ళు గొర్రెలు మేపేందుకు పోగానే అది చెట్టు తొర్రలోకి దూరింది. అక్కడ ఉన్న భోజనాలన్నిటినీ‌ భలే ఆత్రంగా తినేసింది.
దాంతో ఇక దాని కడుపు చాలా లావైపోయింది. ఇప్పుడు అది బయటికి పోదామనుకుంటే వీలు కావటం లేదు- తొర్ర సందులోంచి దాని పొట్ట దూరటంలేదు! గొర్రెల కాపరుల భోజనాలన్నీ తినీ తినీ దాని పొట్ట ఉబ్బిపోయింది. ఏమైపోతుందోనని దానికి ఇప్పుడు భయం పట్టుకున్నది. మెల్లగా కడుపు నొప్పికూడా మొదలైంది.

మధ్యాహ్నం అయ్యేసరికి గొర్రెల కాపరులు చెట్టు దగ్గరకు వచ్చారు. వస్తూనే భోజనాలకోసం చెట్టు తొర్రలో‌చూశారు. చూసేసరికి- అక్కడ నక్క కూర్చొని ఉంది! వాళ్ళకు చాలా కోపం వచ్చింది. అందరూ కలిసి దాన్ని బలవంతాన బయటికి లాగి, కట్టెలకు పని చెప్పారు. అది కుయ్యో మొర్రో అని ఏడ్చుకుంటూ అడవిలోకి పరుగెత్తింది.

మరుసటి రోజున గొర్రెల కాపరుల ఊర్లో పెద్ద పండుగ . ఆ పండుగకని, వాళ్ళ ఇళ్ళల్లో ఇడ్లీలు, దోసెలు, చిత్రాన్నం, లడ్లు, ఉగ్గాణి, జిలేబీలు, గులాబ్ జామూన్లు, మైసూర్ పాకులు, గోబీమంచూరి, మాంసాలు- లాంటివి ఎన్నో చేసుకున్నారు. మిగిలిన వాళ్ళని ఒక వైపున ఎక్కిరిస్తూనే, గొర్రెల కాపరులు వీటన్నిటినీ బాగా మెక్కి మెక్కి తిన్నారు. కడుపులు బాగా నిండినా భలే ఆత్రంగా మెక్కారు. రోజంతా తింటూనే ఉన్నారు.

అయితే ఆ తరువాతి రోజు ప్రొద్దున వాళ్లంతా మంచాలకు అతుక్కుపోవలసి వచ్చింది. "అయ్యో, కడుపు నొప్పి! అమ్మో, కడుపు నొప్పి!" అని ఏడవ సాగారు అందరూ. కొందరికైతే ఏకంగా జ్వరాలు వచ్చేశాయి. 'పండగ రోజున ఎందుకురా, అలా మెక్కాము?' అని వాళ్లంతా బాధ పడసాగారు. చివరికి వాళ్ళ అమ్మానాన్నలు వాళ్ళని ఆసుపత్రికి తీసుకుపోయి సూదులు వేయిపించారు. అందరూ 'అమ్మో , అయ్యో' అని ఏడ్చుకుంటూ ఇంటి దారి పట్టారు.

'నక్కనుండి గుణపాఠం నేర్చుకొని ఉంటే ఎంత బాగుండేది!' అనుకున్నారు అంతా.