ఆ మాటలువిన్న హిరణ్యకుడు తన బొరియలోనుండి బయటికి వచ్చి "లఘుపతనకా! నీ అమృతపు పలుకులు నాకు చాలా తృప్తి కలిగించాయి. చందనపు గంధంగాని, పన్నీటి జల్లులుగాని, తామరపూల సమూహాలుగానీ - ఇష్టంగా, స్నేహ పురత్సరంగా మాట్లాడే మంచివాడి పలుకులంత గొప్పగా సేద తీర్చలేవు. చెడ్డవాడు ఆలోచించేది ఒకటి, చెప్పేది ఒకటి, చేసేది మరొకటిగా ఉంటుంది. కానీ సజ్జనుడు ఆలోచించేదీ, చెప్పేదీ, చేసేదీ ఒక్కటే అయి ఉంటుంది. నీ స్వభావంలో ఏ కొద్దిపాటి చెడు తలపూ కూడా కనబడటం లేదు. నువ్వంటే నాకు చాలా ఇష్టమయింది. నీ ఇష్టప్రకారమే కానియ్యి" అన్నది.

ఆ పైన అది లఘుపతనకానికి తగిన విధంగా సత్కారాలు చేసి, సంతోషపరిచింది. దానికి వీడ్కోలు పలికాక అది తన కలుగు లోనికి పోయింది. అప్పటి నుండి ఎలుక – కాకి చక్కని స్నేహితులై, ఒకదాని క్షేమ-సమాచారాలను ఒకటి అడుగుతూ, ఒకదానికొకటి ఆహార పదార్థాలను ఇచ్చి పుచ్చుకుంటూ, ఆత్మీయమైన సంభాషణలు చేసుకుంటూ కాలం గడపసాగాయి. ఇట్లా కొంతకాలం గడచింది. ఒకనాడు కాకి ఎలుకతో "మిత్రమా! ఇక్కడ ఆహారం దొరకటం కష్టంగా ఉన్నది. అందువల్ల ఈ అడవిని విడిచిపెట్టి వేరే ఎక్కడికైనాపోయి బ్రతకాలని ఆలోచిస్తున్నాను" అన్నది.

అప్పుడు ఎలుక "స్నేహితుడా! పండ్లు, జుట్టు, గోళ్లు, మనిషి- ఈ నాలుగూ ఉన్నచోటునుండి జారితే ఇక పనికిరావు. అందువల్ల తెలివిగలవాళ్లు ఈ వాస్తవాన్ని గ్రహించి,`స్థానం మారాలి' అనే కోరికను విడనాడాలి" అని చెప్పింది.

అది విని కాకి అన్నది- "మిత్రమా! నువ్వు చెప్పిన సత్యం బలహీనులకే వర్తిస్తుంది. ఏనుగులు, సింహాలు, మంచివాళ్లు తమ స్థానాలను విడిచిపెట్టి స్వేచ్ఛగా సంచరిస్తారు. కాకులు, జింకలు, చెడ్డవాళ్లు మాత్రం తమ స్థానాలను వదిలిపెట్టలేక నాశనమౌతారు" అని.

అప్పుడు హిరణ్యకుడు "చెలికాడా! ఈ స్థలాన్ని వదిలి మరి ఏ తావుకు పోవాలని నీ ఆలోచన?” అని అడిగింది.

“కాలు పెట్టబోయే స్థలాన్ని ముందుగా చూసి, మెల్లగా పాదం మోపి, ఆ తర్వాతనే కదా, వెనక పాదాన్ని ఎత్తవలసింది? మరొక చోటును ఆ విధంగా ముందుగా ఆలోచించి పెట్టుకోకుండా, ఉన్న తావును విడిచి-పెట్టకూడదు. అందుకని, వెళ్లవలసిన తావును ముందుగా నిర్ణయించుకోకుండా తొందరపడ లేదు నేను- విను:

దండకారణ్యంలో 'కర్పూరగౌరము' అనే సరస్సు ఉన్నది. దానిలో నా ప్రియమిత్రుడు మంధరుడు' అనే తాబేలురాజు ఉన్నాడు. ధర్మాన్ని పాటించటం అనే గుణం అతనికి పుట్టుకతోటే వచ్చింది. ఇతరులకు కావలసినన్ని ధర్మపన్నాలు చెప్పవచ్చు కానీ, తాను వాటిని పాటించటం' అనేది కఠినం కదా? చేపలు మొదలైన జలచరాలను తెచ్చి ఇచ్చి, ఆ గొప్ప తాబేలు నన్ను పోషించగలదు" అన్నది కాకి. ఆ పలుకులు విని హిరణ్యకుడు "నువ్వు పోయిన తర్వాత నాకు ఇక్కడ ఏమి పని? 'గౌరవము, జీవనము, బంధుమిత్రులు, విద్యాలాభం' అనేవి లేని చోటును విడిచిపెట్టాలి' అని పెద్దలు చెబుతారు. కాబట్టి నన్నుకూడా నీతోపాటు తీసుకొని పో, వస్తాను" అన్నది.

లఘుపతనకం ఆ మాటలు విని సంతోషపడి సరేనన్నది. ఆపైన అది ప్రయాణమై, ఎలుకతో సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ కొన్ని రోజులకు ఆ కొలనును చేరుకున్నది. వాళ్ల రాకను దూరం నుండే చూసిన మంధరుడు వాళ్లకు ఎదురువచ్చి తీసుకొని పోయి లఘుపతనకానికి, హిరణ్యకుడికి తగిన విధంగా మర్యాదలు చేసి, ఆతిథ్యం ఇచ్చింది.

తర్వాత లఘుపతనకం మంధరునితో "నేస్తమా! నువ్వు ఈ ఎలుకరాజును చాలా గౌరవించాలి. పుణ్యకార్యాలు చేసేవాళ్లలోకెల్లా ఈయన గొప్పవాడు. 'మంచిగుణాలు' అనే రత్నాలున్న సముద్రుడిలాంటివాడు ఈయన. ఈయన పేరు హిరణ్యకుడు. ఈయన మంచి గుణాలను వేయిపడగలున్న ఆదిశేషుడు కూడా వర్ణించలేడు– ఇక నేనెంత?” అని చెప్పి, హిరణ్యకుడితో తన పరిచయం ఎలా జరిగిందో మొత్తం చెప్పింది.

అప్పుడు మంధరుడు హిరణ్యకుడిని చాలా గౌరవించి, “హిరణ్యకా, ఎవ్వరూ నివసించని ఆ అడవిలో నువ్వు నివసిస్తూండటానికి ఏదో కారణం ఉండి ఉండాలి. ఏమిటది, చెప్పు! “ అన్నది. అప్పుడు హిరణ్యకుడు తన కథను ఇట్లా చెప్పింది: -

హిరణ్యకుడి ఆత్మకథ

“చంపకవతి అనే పట్టణం ఒకటి ఉండేది. ఆ పట్టణంలో అనేకమంది సన్యాసులు నివసిస్తూ ఉండేవాళ్లు. వాళ్లలో `చూడాకర్ణుడు' ఒకడు. అతను ప్రతిరోజూ భోజనం చేసిన తర్వాత, మిగిలిన వంటకాలను తన భిక్షాపాత్రలో పెట్టి, దాన్ని చిలకకొయ్యకు వ్రేలాడదీసి, నిద్రపోయేవాడు. నేను చప్పుడు చేయకుండా దానిమీదికి ఎగబ్రాకి, ఏరోజుకారోజు– అక్కడ ఉంచిన వంటకాలను తిని పోతుండేదాన్ని.

ఒకరోజున చూడాకర్ణుడి స్నేహితుడు `వీణాకర్ణుడు' అనే సన్యాసి అక్కడికి వచ్చాడు. అతనితో మాట్లాడుతూ చూడాకర్ణుడు ఆ చిలకకు ఎదురుగానే కూర్చుని, మాటల మధ్యలో పైకి చూస్తూ, తన చేతిలో ఉన్న గిలక కర్రతో నేలమీద కొట్టి నన్ను బెదిరిస్తూ వచ్చాడు.

అప్పుడు వీణాకర్ణుడు "ఏమి, చూడాకర్ణా? ఏంటది, పైకి చూసి నేలను కర్రతో తడుతున్నావెందుకు?” అని అడిగాడు.

అప్పుడు చూడాకర్ణుడు అన్నాడు "ఎలుక ఒకటి ప్రతిరోజూ చిలకకొయ్యమీదికి ఎగిరి పాత్రలో ఉన్న అన్నాన్ని తిని పోతున్నది. నాకు దీనితో చాలా పెద్ద కష్టమే వచ్చి పడింది" అని. వీణాకర్ణుడు ఆ మాటలు విని ఆశ్చర్యపోతూ ఎక్కడి ఎలుక, ఎక్కడి చిలకకొయ్య? ఇంత చిన్న జంతువుకు అంత ఎత్తుకు ఎగిరేంత బలం ఎక్కడినుండి వచ్చింది? దీనికి ఏదో కారణం ఉండి ఉంటుంది– తప్పకుండా. దీన్ని చూస్తే నాకు చాలా కాలం క్రితం ఎదురైన సంఘటన ఒకటి గుర్తుకు వస్తున్నది. నీకు 'బ్రాహ్మణుడి భార్య–నువ్వులు' అనే ఆ వృత్తాంతాన్ని వివరిస్తాను, విను – “కొన్ని సంవత్సరాల క్రితం నేనొక బ్రాహ్మణుడి ఇంటికి భిక్ష కోసం వెళ్లాను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన భార్యను చూసి, “రేపు అమావాస్య కదా, మనం బ్రాహ్మణులకు భోజనం పెట్టవలసి ఉంటుంది. మరి వాళ్లకోసం ఏఏ పదార్థాలు సమకూర్చావు?” అని అడిగాడు.

అప్పుడు అతని భార్య "మగవాళ్లు పదార్థాలన్నిటినీ సేకరించి ఇంటికి తెస్తే, ఆడవాళ్లు వాటిని కావలసిన విధంగా వాడుకుంటారు. మరి మీరు ఏమీ తీసుకురాకపోతే, మన ఇంటికి పదార్థాలు ఎక్కడినుండి వస్తాయి?” అన్నది.

అప్పుడా బ్రాహ్మణుడు ఆమెపైన కోపం చేసుకుంటూ, “ఉన్నంతలో జరుపుకోవాలిగాని, ఎక్కువ సామాన్లు సేకరించి కూడబెట్టాలని దురాశ పనికిరాదు" అన్నాడు.

అప్పుడు అతని భార్య "సరే, అలాగే కానివ్వండి. మన ఇంట్లో ఏముంటే వాటితో రేపటి పనిని అయిందనిపిస్తాను" అని, ఇంటిలో ఉన్న నువ్వుల్నే కడిగి, దంచి , ఎండబోసింది.

అంతలోనే ఒకకోడి వచ్చి ఆ నువ్వులపై తిరిగి, వాటిని కాళ్లతో జీరాడి, అటు ఇటూ చల్లి పోయింది. బ్రాహ్మణుడు అది చూసి "ఈ నువ్వులు మైలపడ్డాయి. బ్రాహ్మణుల భోజనానికి ఇవి పనికిరావు. వీటిని తీసుకొనిపోయి, వేరే వాటితో మార్చుకొని రా" అన్నాడు.

ఇక ఆ మర్నాడు నేను భిక్షను అర్ధిస్తూ వేరే ఇంటి ముందు నిలబడి ఉన్నాను. అప్పుడే ఆ బ్రాహ్మణుడి భార్య అక్కడికి వచ్చింది. ఆ ఇంటివాళ్లను ఆమె "ఈ దంచిన నువ్వులు తీసుకొని ముడి నువ్వులు ఇస్తారా?” అని అడిగింది.

ఆ ఇంటావిడ అది విని చాలా సంతోషపడి చేటలో ముడి నువ్వులు పోసుకొని వచ్చి మాట్లాడసాగింది. అంతలోనే ఆమె భర్త అక్కడికి వచ్చి "ఏమి బేరమాడుతున్నావు?” అని అడిగాడు.

“చేరెడు ముడినువ్వులిచ్చి, దంచినవి తీసుకుంటున్నాను" అని అతని భార్య అనగానే అతడు ఎగతాళిగా నవ్వి - “అయ్యో! వెర్రిదానా! ముడినువ్వులకు సమానంగా దంచిన నువ్వుల్ని ఎవరైనా ఇస్తారా? యీమె ఈ విధంగా తెచ్చి ఇవ్వటానికి ఏదో కారణం ఉండి ఉండాలి. నువ్వు ఆ నువ్వుల్ని తీసుకోకు" అన్నాడు. వీణాకర్ణుడు అలా ఆ సంఘటనను వివరించి, “అట్లాగే ఈ ఎలుకకు ఇంత బలం రావటానికీ, అది ఎప్పుడూ ఇక్కడే‌ తిరుగాడడానికీ ఏదో బలమైన కారణం తప్పక ఉండి ఉండాలి. “ అన్నాడు.

చూడాకర్ణుడు అదివిని, “చాలా కాలంగా యీ ఎలుక ఇక్కడే ఒక బొరియను చేసుకొని, ఈ స్థలాన్ని విడువకుండా నివసిస్తున్నది. ఇది ఈ స్థలాన్ని వదిలి వెళ్ళక పోవడానికి కారణం ఏంటో తెలీలేదు. ఇప్పుడు ఇక దీని బొరియను తవ్వి చూస్తాను" అని, ఒక గడ్డపారతో నేను నివసించే కన్నాన్ని తవ్వాడు.

అలా నేను ఎంతో కాలం శ్రమించి కూడబెట్టుకున్న సంపద మొత్తమూ ఆ సన్యాసి పాలయ్యింది. దానితో నా ఉత్సాహము, శక్తీ రెండూ పోయినట్లయింది. దిగులుతో నేను కృశించి పోయాను. చివరికి ఆహారం సైతం సంపాదించుకోలేక, మెల్లమెల్లగా తిరుగుతున్న నన్ను చూసి, చూడాకర్ణుడు ఇట్లా అన్నాడు: “ధనం ఉన్నవాడే‌ బలవంతుడు. ధనం ఉన్నవాడే‌ పండితుడు. ధనమే అన్ని రకాల అభివృద్ధికీ మూలకారణం. ధనం లేనివాడి జీవితం ఎందుకు? ఈ ఎలుక తన ధనాన్ని కోల్పోయింది కనుకనే గదా, ఇదివరకటి వేగాన్నీ, బలాన్నీ పోగొట్టుకొని మిగిలిన ఎలుకల మాదిరి తయారయింది? ధనం లేనివాడికి ఎల్లప్పుడూ దు:ఖమే ఎదురౌతుంటుంది. ఎల్లప్పుడూ దు:ఖించటం వల్ల బుద్ధి క్షీణిస్తుంది. అలా బుద్ధి క్షీణించటం వల్ల, వేసవి కాలంలో నదీ ప్రవాహాలు ఎండిపోయినట్లు, చేపట్టిన అన్ని పనులూ నశిస్తాయి. ధనవంతుడికే ధైర్యం ఉంటుంది. తెలివితేటలు, బంధు మిత్రులు అన్నీ ధనవంతుడికే ఉంటాయి. 'కొడుకులు, స్నేహితులు లేనివాడి ఇంటిలోనూ, మూర్ఖుడి మనసులోనూ ఏమీ ఉండదు – ఖాళీ తప్ప'. ఇక దారిద్ర్యమన్నదైతే సర్వ శూన్యమే! అలాంటి దరిద్రం కంటే మరణమే మేలు. మరణం అప్పటికి బాధను కల్గిస్తుంది; కానీ దారిద్ర్యం జీవితాంతమూ తీవ్ర వేదనకు గురి చేస్తుంది. శారీరక శక్తి వలన, పేరు ప్రతిష్ఠల వలన, మాట తీరు వలన వ్యక్తులు సొంతవాళ్లైనప్పటికీ, వాళ్లు ధనాన్ని పోగొట్టుకుంటే‌ ఆ క్షణాన్నే పరాయివాళ్లవుతారు. ఇది మహా చిత్రం.” అని. (తరువాతి కథ వచ్చేమాసం...)