లటుకు: నాకు మొన్న పరీక్షల్లో 100 మార్కులు వచ్చాయి తెలుసా?
చిటుకు: కోతలు కోయకు! నీకు నీ జన్మలో అన్ని మార్కులు రావు. నా మార్కులునువ్వు చెప్పేసుకుంటున్నావు.
లటుకు: నీ మార్కులు కాదోయ్. నాకు నిజంగానే హండ్రెడ్ వచ్చాయి.
చిటుకు: ఏదీ, చూపించు!
లటుకు: ఇదిగో తెలుగులో 35, చరిత్రలో‌35, డ్రాయింగులో 30. మూడూ కలిపితే సరిగ్గా నూరు!
చిటుకు: బాగుంది తెలివి! నాకూ నూరు మార్కులే వచ్చాయి తెలుసా?
లటుకు: నిజంగానా? ఏవీ, నీ మార్కులు చూపించు?
చిటుకు: ఇదుగో, తెలుగులో 1, ఇంగ్లీషులో 0, లెక్కల్లో కూడా 0. మూడూ కలిపి రాస్తే వరుసగా 100.
లటుకు: భేష్! ఇంకేం! ఇద్దరం ఒకే మార్కులు తెచ్చుకున్నాం. ఇంకొక్క సున్నా తెచ్చుకున్నామంటే ఇద్దరికీ వెయ్యేసి మార్కులు వచ్చేస్తై, ఎంచక్కా!

భయం

కార్లో వెళ్తున్న మనిషి డ్రైవరుతో 'జాగ్రత్తగా తీసుకు వెళ్లు, నాకు చాలా భయంగా ఉందీ డ్రైవరు: మరేం, ఫర్వాలేదండి, భయం వేస్తే నాలాగే కళ్లు మూసుకోండి.
-'బాల'1954, ఆగష్టు

దొంగతనం

జడ్జి: (తప్పు చేసిన వానితో) నువ్వు కారును దొంగలించటం కళ్ళారా చూసామని ఆరుగురు సాక్షులు చెప్తున్నారు. అయినా నీకేం తెలీదని చెప్పి తప్పించుకుంటున్నావు. నీకు ఏం లాభం లేదు. నేరస్తుడు: అలాగా! అయితే నేను దొంగలించడం చూడలేదని ఆరు వేల మంది చేత సాక్ష్యం చెప్పించగలనండి.
'బాల '1954, ఆగష్టు


మందు డబ్బా

లటుకు: ఒరే చిటుకూ! మనం అన్ని విషయాలూ మరిచిపోకుండా బుర్రలో ఉంచుకోవాలి, అచ్చుగుద్దినట్లు.
చిటుకు: అవును. మన బుర్రలు సామాన్యమైనవి కావు!
లటుకు: సరే, నీకో ప్రశ్న వేస్తాను. ఈ మందు డబ్బీ చూశావా? దీని మూత రావట్లేదు. దీన్ని ఎలా తెరవాలో చెప్పు, చూద్దాం!
చిటుకు: ఓస్, ఇంతేనా! ఆ డబ్బీ లోపల అన్ని వివరాలూ అచ్చు వేసిన పేపరు ఉంటుంది. అది చదువు- తెలుస్తుంది.


నిద్ర లేమి!

లటుకు: ఒరేయ్ చిటుకూ! నాకు నిద్రపట్టడం లేదురా!
చిటుకు: ఏం, ఎందుచేత?
లటుకు: మధ్యాహ్నమంతా నిద్రపోయానురా, అందుచేత.
చిటుకు: అయితే మరి మధ్యాహ్నం ఎందుకు నిద్రపోతావురా?
లటుకు: ఏం చేయాలిరా, రాత్రిళ్ళు నిద్రపట్టలేక.

చెమట!

లటుకు: ఏమిరా చిటుకూ! నీ చొక్కా అలా తడిసిపోయింది!
చిటుకు: చెమటరాబాబూ చెమట! ఇంత ఎండలో బనియన్ ఒకటి వేసుకున్నాను. అంచేత చెమట చాలా ఎక్కువైపోయింది.
లటుకు: మరి బనియనెందుకు వేసుకున్నావు?
చిటుకు: చెమటరా బాబూ చెమట! చెమటకు బనియను లేకుండా ఎలా!?
'బాల'-1956, అక్టోబరు.


సిల్కు చీర

బిచ్చగాడు: అమ్మా! ధర్మం చెయ్యమ్మా! గుడ్డివాడికి కొంచెం ధర్మం చెయ్యండమ్మా!
అమ్మాయి: ఏం లేదు పోవయ్యా.
బిచ్చగాడు: మరి మీరు కట్టుకున్న సిల్కు చీరకు డబ్బులిలా వచ్చాయమ్మగారూ?
అమ్మాయి: ఆ..!?

కోపం!

ఆకలితో వచ్చిన భర్తకు వడ్డిస్తోంది భార్య- భర్త: (కోపంగా ) ఛీ! ఇదేమైనా కూరా?! నేను తినలేను. ఏదీ, కుక్కను పిలు!
కూతురు: పాపం, కుక్కను తినకు నాన్నా! మనకు ఉండేది ఒక్కటే కుక్క!

బడాయిలు

లటుకు: మా పొలంలో దిష్టి బొమ్మను పెట్టాం కదా? దాన్ని పెట్టినప్పటినుండి పిట్టలు మా పొలంలో గింజు ముట్టుకుంటే ఒట్టు! మా పొలంలోకే కాదు- చుట్టు ప్రక్కల పొలాలకి కూడా రావడం మానేశాయి!
చిటుకు: ఓస్! దానిదేముంది? మా పొలంలో ఉన్న దిష్టి బొమ్మను చూసి భయపడిన పిట్టలైతే పోయిన సంవత్సరం ఎత్తుకెళ్ళిన ధాన్యాన్ని కూడా తీసుకొచ్చి పడేశాయి.

గజిబిజి లెక్క!

లటుకూ, చిటుకూ ఒకరోజున జాంగ్రీలు అమ్మాలని అనుకున్నారు. ఒక్కొక్కటీ పావలా. ఇద్దరూ బయల్దేరి వెళ్తూండగా చిటుకూకి జాంగ్రీ తినాలనిపించింది. తన దగ్గర ఉన్న పావలాని లటుకూకు ఇచ్చి, ఒక జాంగ్రీ కొనుక్కొని తిన్నాడు.
కొంత సేపటికి లటుకూకి జాంగ్రీ తినాలనిపించింది. వెంటనే తన దగ్గరున్న పావలాను చిటుకూకి ఇచ్చి జాంగ్రీ తీసుకొని తిన్నాడు.
ఆ తర్వాత చిటుకు-మళ్లీ లటుకు. అలా ఆ పావలా చేతులు మారుతూ పోయింది.
చివరికి చూస్తే, ఏముంది- జాంగ్రీలన్నీ ఖాళీ. వచ్చిన డబ్బు మొత్తం ఒక్క పావలా మాత్రమే!
ఏ జాంగ్రీనీ‌ ఎవ్వరూ ఊరికే తినలేదు కదా, మరి లెక్క ఎక్కడ తప్పింది?
'బాల'1955, సెప్టెంబరు.