ఒక పల్లెటూళ్లో ఒక గూనోడు, ఒక గుడ్డోడు మంచి స్నేహితులుగా ఉండేవారు. వాళ్ళిద్దరికీ పెద్దగా పనేమీ చేతనయ్యేదికాదు. అందుకని గూనోడు, గుడ్డోడి చెయ్యి పట్టుకునిపోతూ ఇంటింటా అన్నం పెట్టించుకుని తినేవారు.

కొంతకాలానికి ఊళ్ళో వాళ్లందరూ పని చేయకుండా అడుక్కునే మిత్రులిద్దరినీ తిట్టడం మొదలుపెట్టారు. దాంతో 'ఎంతకాలం, ఈ బతుకు?' అనిపించింది గూనోడికి, గుడ్డోడికి. ఇక ఆ పల్లెను విడిచి పట్నం వెళదామనుకున్నారు ఇద్దరూ. అనుకున్నదే తడవుగా వాళ్లిద్దరూ పట్నానికి బయలుదేరారు. పల్లెనుండి పట్నానికి ఒక పెద్ద అడవి గుండా వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఆ అడవిలో ఒక రాక్షసి ఉంది. అది ఆ అడవిదారిన పోయేవాళ్లని అందరినీ దోచుకునేది, చంపేదికూడా.

అందుకని పట్నం వెళ్లాల్సినవారంతా, ఆ అడవిదారిని వదిలి, చుట్టూ తిరిగి దూరపు దారివెంబడే పోయేవాళ్లు.

కానీ గూనోడు, గుడ్డోడు ఇద్దరూ చేతకానివాళ్ళే. అందుచేత అలా చుట్టు తిరిగి పోలేక, అడవి దారినే ప్రయాణం సాగించారు.

అలా అడవిదారిన పడి పోతుంటే వాళ్లకు ఎదురైన వాళ్లంతా అడవిలోఉన్న రాక్షసి గురించి చెప్పారు. "కానీలే, మనం అంతదూరం తిరిగి పోలేంగానీ, నన్నెత్తుకో- మనం ఈ దారినే పోదాం" అన్నాడు గుడ్డోడు. సరేనని గూనోడు గుడ్డోణ్ని ఎత్తుకుని ఆ అడవిదారిన నడవసాగాడు.

అడవిదారిలో గూనోడి కాలికి ఏదో తగిలినట్లయింది. అదేమిటోనని వంగి చూశాడు వాడు. వాడలా వంగగానే "ఏరా వంగితివి?" అని అడిగాడు గుడ్డోడు.

"కాలికేదో తగిలితే..." అన్నాడు గూనోడు.

"ఏం తగిలింది?" అడిగాడు గుడ్డోడు.

"కడ్డీలేరా" అన్నాడు గూనోడు.

"సరే దాన్ని తీసుకో" అన్నాడు గుడ్డోడు.

"ఎందుకు రా?" అడిగాడు గూనోడు.

"పనుందిలే. నువ్వు తీసుకో" అని గుడ్డోడంటే గూనోడు అ కడ్డీని తీసుకొని ముందుకు నడవటం మొదలుపెట్టాడు.

ఆలా కొంత దూరం నడిచిన తర్వాత ఇంకో వస్తువేదో కాలికి తగిలినట్లయి, మళ్లీ వంగాడు వాడు. "మళ్లీ వంగావేరా?" అని గుడ్డోడడిగితే `సవరపు వెంట్రుకలు' అన్నాడు వాడు. "వాటినీ తీసుకో" అన్నాడు గుడ్డోడు. తీసుకున్నాడు గూనోడు.

ఇంకాస్త ముందుకుపోయాక గూనోడికి కాలికి మళ్లీ ఏదో తగిలినట్లయింది. మళ్లీ వంగిచూశాడు వాడు.

వాడలా వంగగానే "మళ్లీ ఏం తగిలిందిరా నీకు?" అని అడిగాడు గుడ్డోడు.

"ఎముకరా" చెప్పాడు గూనోడు.

"అయితే దాన్నీ తీసుకో"మని గుడ్డోడంటే "ఇవన్నీ మనకెందుకురా?" అని గూనోడు అడిగాడు.

"పనుందిలేరా, నువ్వు తీసుకో!"అన్నాడు గుడ్డోడు.

`సరే'నని దాన్నీ తీసుకున్నాడు గూనోడు.

అప్పటికే వాళ్లు అడవిలో చాలా దూరం నడిచారు. అక్కడ వాళ్లకు ఓ గాడిద ఓండ్ర పెడుతున్న శబ్దం వినబడింది.

శబ్దంవిన్న గుడ్డోడు ఆ గాడిదను పట్టుకొమ్మన్నాడు గూనోడిని. ఎంతో ప్రయాసపడిన తర్వాతగానీ ఆ గాడిద దొరకలేదు వానికి.

అన్నీ తీసుకొని వాళ్లు రాక్షసుడుండే గుహను సమీపించారు. తాము గుహదగ్గరకు వచ్చేశామని చెప్పాడు గూనోడు, గుడ్డోడికి.

"సరే, నువ్వు నేరుగా ఆ గుహవైపే నడు" అన్నాడు గుడ్డోడు.

"నేరుగా గుహదగ్గరకే పోతే ఆ రాక్షసుడు మనల్ని బ్రతకనిస్తాడా? నాకు భయంగా ఉంది. నేను రాలేను గానీ, నువ్వే పోరా!" అన్నాడు గూనోడు.

"ఒరేయ్ , నాకు కళ్లులేవు కదరా, అక్కడికి పోయేందుకు? నన్ను కనీసం అక్కడ వదిలి పెట్టనన్నా వదిలిపెట్టు" అని ప్రాధేయపడ్డాడు గుడ్డోడు.

సరేనని, గూనోడు గుడ్డోడ్ని ఎత్తుకు పోయి, ఆ గుహద్వారం దగ్గర వదిలాడు. అప్పుడు గుడ్డోడు బిగ్గరగా నవ్వుతూ -"ఒరేయ్, నా మీసం చూడరా "అని గట్టిగా , భీకరంగా అరుస్తూ, తన దగ్గరున్న పొడవాటి సవరపు వెంట్రుకలను తీసుకొని రాక్షసుడుండే గుహలోకి విసిరాడు.

లోపల పడుకొని ఉన్న రాక్షసుడు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు. ఘోరమైన నవ్వు; మీసం చూడమని అరుపు; అకస్మాత్తుగా తనమీద పడిన అంత పొడవాటి ఆ వెంట్రుకలు- ఇవన్నీ చూసి వాడికి మతి పోయినట్లైంది.

అంతలోనే గుడ్డోడు తనదగ్గరున్న ఎముకను తీసుకుని, "నా కోర చూడరా!" అంటూ దాన్నీ ఆ గుహలోకి విసిరాడు. ఆ ఎముకను చూసిన రాక్షసుడు "అమ్మో! ఒక్క కోరే ఇంత పెద్దగా ఉందే! మరి ఆ రాక్షసుడెంత పెద్దవాడో మరి, వాడింక నన్ను బతకనీయడే!? ఎలాగ?" అని మరింత భయపడ్డాడు.

ఆ లోపుగా గుడ్డోడు తను పట్టుకున్న కడ్డీని గూనోడికి ఇచ్చి, దాన్ని బాగా కాల్చమన్నాడు. ఎర్రగా కాలిన ఆ కడ్డీని తీసుకొని, "నా అరుపును వినరా!" అంటూ, తాము తోలుకొచ్చిన గాడిదకు గట్టిగా ఓ వాత పీకాడు.

అంతే- కడ్డీ వాత తగలగానే ఆ గాడిద గుహ దద్దరిల్లేటట్లు ఓండ్ర పెట్టింది. వెంటనే గూనోడు దాన్ని గుహవైపుకు తిప్పి కట్లు విప్పేశాడు. మరుక్షణం అది దడదడమని తన్నుకుంటూ గబగబా గుహలోకి పరుగు తీసింది.

దాని అరుపు వినగానే రాక్షసుడికి గుండెలు అవిసి పోయాయి. దానికితోడు గాడిద గబ గబా పరుగెత్తి రావటంతో వాడు ఇక అక్కడ ఒక్క క్షణంకూడా నిలువలేకపోయాడు. దొడ్డిదారిన, ఇక వెనక్కి తిరిగిచూడకుండా పారిపోయాడు వాడు.

రాక్షసుడు పారిపోగానే మిత్రులిద్దరూ గుహలోకి పోయి, వాడు దాచిన సొమ్మునంతా మూటలు కట్టుకొని ఊరికి పోయారు. ఎదురొచ్చిన ఊరిజనాలందరికీ మిగిలిన సొమ్ములు తెచ్చుకొమ్మనిచెప్పారు కూడా!

ఎన్నో ఏళ్లుగా తమను పీడిస్తున్న రాక్షసుడి పీడను వదిలించినందుకు సంతోషించిన ఆ ఊరి ప్రజలు గూనోన్నీ, గుడ్డోడినీ రాజులుగా చేసుకున్నారట!