అనగనగా.. ఒక మారు మూల పల్లెలో రంగన్న అనే ఒక తెలివైన రైతు ఉండేవాడు. తనకున్న కొద్దిపాటి పొలంలో ఏ కాలంలో ఏ పంట వేస్తే బాగుంటుందో చూసుకొని పంట వేసి, మంచి రాబడిని ఆర్జిస్తూ - అలా జీవనం కొనసాగిస్తూండేవాడు.

ఒక రోజు ఇంకా పొద్దు పొడవకనే లేచి, నాగలి భుజాన వేసుకొని, ఎద్దుల్ని తోలుకొని పొలందుక్కి చేయడానికి బయలుదేరాడు రంగన్న . పొలం దున్నుతుండగా నాగలికి ఏదో అడ్డు తగిలినట్లైంది. ఎద్దులు ఆగిపోయాయి. అప్పుడు మడకకు ఏదో అడ్డం వచ్చిందని గ్రహించిన రంగన్న, నాగలినిని తప్పించి, అక్కడ త్రవ్వి చూశాడు. ఒక గాజు సీసా దొరికింది. దాన్ని అతను అటూ ఇటూ త్రిప్పి చూసి, మెల్లగా సీసా మూత తీశాడు.

ఆశ్చర్యం! మరుక్షణం సీసాలోంచి దట్టమైన పొగ మొదలైంది. చూస్తూండగానే ఆ పొగలో భూతం ఒకటి తయారైంది: "ఒరేయ్, మనిషీ! నువ్వు సాగు చేస్తున్న ఈ భూమి నిజానికి నాదే! ఈ భూమిలో ఎంతో కాలంగా నివాసముంటున్నాను నేను. కనుక ఈ భూమి నుండి వచ్చే ప్రతి పంటా నాదే! అదంతా నాకే సొంతం కావాలి!" అని అరిచింది ఆ భూతం.

నోటి దగ్గరి కూడు భూతం పాలవటం రంగన్నకేమీ సబబనిపించలేదు. "నేను కూడా చాలా రోజుల నుండీ ఈ భూమిని సాగు చేస్తున్నాను. కనుక ఈ భూమి నుంచి వచ్చే ఆదాయం అంతా నాదే అవుతుంది" అన్నాడు అతను ధైర్యం కూడగట్టుకొని.

"నేను చాలా రోజుల నుండీ ఈ భూమి లోపల ఉన్నాను. కనుక ఈ భూమి లోపల పండే పంట అంతా నాదే!" అన్నది భూతం పట్టు వీడకుండా.

చటుక్కున ఉపాయం తట్టిన రంగన్న "సరే, అయితే. అలాగే కానివ్వు. ఇప్పుడు నేను నేలను దుక్కి, పంట వేస్తాను. దానికి నీరు కట్టి, ఎరువు వేసే బాధ్యత నాది. కాపలా పని నీది. పంట తయారయ్యాక, ఆ పంటలో‌ భూమి లోపలి భాగం మొత్తం నీది- భూమి పైభాగం మాత్రం నాది! సరేనా?" అన్నాడు.

భూతం ఒప్పుకున్నది. రంగన్న సంతోష పడి, పొలం సాగుచేసి, అందులో వరి నాటాడు. సమయానికి నీళ్ళు కట్టి, కలుపు తీసి, దాన్ని జాగ్రత్తగా సంరక్షించాడు. మడి చక్కగా పెరిగింది. వరి కంకులనిండా ధాన్యం తయారైంది. ధాన్యం పక్వానికి వచ్చాక, రంగన్న ఇక కోతలు మొదలుపెట్టాడు. తీరా కోతలు పూర్తయ్యే సమయానికి భూతం వచ్చి కూర్చున్నది: "ఏం, రంగన్నా! నా భాగం నాకు ఇచ్చేయి !" అన్నది.

"ఓ, అలాగే! అదిగో, పంటలో లోపలి భాగం మొత్తాన్నీ అలాగే నిలిపి ఉంచాను నీకోసం. నా మాట ప్రకారం పైభాగాన్ని మాత్రమే నేను తీసుకున్నాను. నీ వాటాను నువ్వు ఎప్పుడంటే అప్పుడు తీసుకెళ్లచ్చు" అన్నాడు రంగన్న.

లోపల అంతా తవ్వి చూస్తే వేర్లు, మట్టి గడ్డలు తప్ప ఏమీ దొరకలేదు భూతానికి. దానికి చాలా కోపం వచ్చి, "రంగన్నా, నువ్వు నన్ను మోసం చేశావు!" అన్నది.

"నా మోసం ఏముందమ్మా, నువ్వేది అడిగావో అదే కదా నేను ఇచ్చింది?" అన్నాడు రంగన్న.

"సరే అయితే. ఈసారి పంటలో పైభాగం నాది, లోపలి భాగం నీది- సరేనా?" అన్నది భూతం.

"సరే" అని ఒప్పుకున్న రంగన్న, బాగా ఆలోచించి, ఈసారి వేరుశనగ సాగు చేయాలని నిశ్చయించుకున్నాడు. దుక్కి దున్ని, ఎరువు వేసి, విత్తనాలు విత్తి, పంటకు కాపలా కాసి, కంటికి రెప్పలా దాన్ని సంరక్షించుకుంటూ వచ్చాడు. తీరా పంటచేతికొచ్చే సమయానికి భూతం రానే వచ్చింది: "ఏమి, రంగన్నా! పంట తయారైనట్లుందే!" అన్నది.

"అవును తల్లీ, ఇక చేతికొచ్చినట్లే. ఈసారి మన ఒప్పందం ప్రకారం పంటలో పైభాగం అంతా నీదే కదా, నీ భాగం నువ్వు తీసుకెళ్ళు" అన్నాడు రంగన్న, నేల లోపల ఉన్న వేరుశనగ కాయలు పీక్కుంటూ. ఎంత వెతుక్కున్నా పంట పై భాగంలో పనికి వచ్చేది ఏమీ దొరకలేదు భూతానికి.

ఏం చేయాలో దిక్కుతోచక, అది "ఒరే, రంగన్నా మళ్ళీ మోసం చేశావు గదరా!" అన్నది.

"నేనేమీ చెయ్యలేదు గద తల్లీ, నువ్వేది కోరితే నేను దాన్నే కద, ఇచ్చాను?" అన్నాడు రంగన్న.

"అయితే ఈసారి పంటలో పైభాగమూ, క్రిందిభాగమూ రెండూ నాకే కావాలి" అన్నది భూతం.

"అదెట్లా కుదురుతుంది తల్లీ, నేనూ బ్రతకాలి గద!" అన్నాడు రంగన్న.

"అయితే మధ్యభాగం‌ నువ్వు తీసుకో, పర్లేదు!" అన్నది భూతం దయచూపిస్తున్నట్లు.

ఈసారి రంగన్న చెరకు పంట వేశాడు. పంట చేతికందే సమయానికి హాజరైన భూతానికి చెరకు మొదళ్ళూ, ఆకులూ తప్ప వేరే ఏమీ దొరకలేదు. రంగన్న తన వాటాక్రింద చెరకు గడలన్నీ బళ్ళలోకి ఎత్తాడు.

"ఇదిగో, ఈసారి పంటలో మధ్యభాగం నాది, చివర్లు నీవి- సరేనా?" అన్నది భూతం. "తల్లీ, మూడు సార్లుగా చూస్తున్నాను- ఒక్కోసారీ ఒక్కోలాగా మాట్లాడుతున్నావు. ఈసారి చివరిది- చెబుతున్నాను. ఇకపైన పంటమొత్తమూ నాదే. నీదంటూ ఏమీ ఉండదు. అలా అయితేనే, ఈ సారి నేను ఏ పంటైనా వేసేది. చెప్పు మరి. ఇంకా తనివి తీరలేదా?" అన్నాడు రంగన్న కొంచెం గట్టిగానే.

"సరేలే, ఈ ఒక్కసారికీ నాకు పంటలో‌మధ్యభాగం ఇచ్చెయ్. ఆపైన ఎప్పుడూ నీ జోలికి రాను. ఈ పొలాన్నే వదిలి పోతాను-సరేనా?" అన్నది భూతం.

ఈసారి రంగన్న జొన్న విత్తాడు. జొన్న కంకులు నిండుబారి, ముత్యాల్లాంటి జొన్నలు తయారవ్వగానే భూతం మళ్ళీ హాజరైంది. అయితే ఈసారి దానికి చొప్ప మాత్రం దక్కింది! రంగన్న జొన్నల్ని అన్నిటినీ బస్తాలకెత్తి బళ్ళలో ఇంటికి తోలాడు.

"అబ్బా ఈ రంగన్న చాలా తెలివైనవాడు" అనుకొన్న భూతం, తన మాట నిలుపుకునేందుకు గాను ఆ పొలం విడిచిపెట్టి పోయింది. విముక్తుడైన రంగన్న, హాయిగా పంటలు మార్చి మార్చి తన ఇష్టం కొద్దీ పండించుకుంటూ నేలను భద్రంగా కాపాడుకున్నాడు.