అనగా అనగా ఒక ఇంట్లో ఒక బియ్యపుమూట ఉండేది. ఆ మూటలో లక్క పురుగుల గుంపొకటి హాయిగా నివసిస్తుండేది. ఇంటివాళ్లు ఏదో ఊరెళ్లారేమో, ఆ పురుగులు ఒక్కోటీ పదహారై, మూట అంతా కులాసాగా తిరగటం మొదలెట్టాయి.
వాటిలో ఒక కుర్ర లక్క పురుగు, చాలా తెలివైనది, ఉండేది. తన తెలివిని చూసుకొని, అది నిజంగానే చాలా గర్వపడుతుండేది. బస్తా దాన్ని ఎన్నోసార్లు హెచ్చరించినా, అది మాత్రం గర్వపడటం మానలేదు. -ఎందుకంటే, అంతకు ముందే ఓ సారి ఇంటామె గ్లాసుతో లెక్కబెట్టి రెండుసార్లు బియ్యం తీసుకున్నది చాటలోకి. మన కుర్ర లక్కపురుగు తోటి పిల్ల పురుగులతోబాటు ఆ బియ్యంలోనే ఆడుకుంటూ ఉండింది. అయితే అది చాటలోకి పోకుండా వెంటనే తెలివిగా గ్లాసునే కరచుకొని కూర్చున్నది. ఇంటామె గ్లాసును వెనక్కి వెయ్యగానే, అది దర్జాగా నడుచుకొని బస్తాలోకి దూరింది మళ్లీ. అప్పటినుండే దానికి తన తెలివి తేటలమీద చాలా విశ్వాసం ఏర్పడిపోయింది.
ఆ తర్వాత నుండీ దానికి ఒక అనుచర బృందం ఏర్పడింది. అది వాటి ముందు ఏవేవో కోతలు కోసేది. అనుచరులు దాన్ని మరింత ఉబ్బించేవి. వాటి ఖర్మమా అని ఓ సారి ఇంటామె బియ్యం కొలుచుకుంటుంటే అవి అన్నీ చాటలో పడిపోయాయి. అయితే ఈసారి కుర్ర లక్కపురుగు చాటనే గట్టిగా కరచుకొని కూర్చున్నది. ఇంటామె చెరిగేసరికి, అనుచర బృందం అంతా ఎగిరి బయట పడిపోయింది. వాటికి ఏమయిందో-ఏమికాలేదోగాని, ఇంటామె చెరిగిన బియ్యాన్ని గిన్నెలో పోసుకొని, చాటను బస్తామీద పెట్టెయ్యగానే కుర్రపురుగు మాత్రం చాలా సంబరపడిపోయింది. అది ఠీవిగా చాట దిగి వచ్చేసరికి మిగిలిన పురుగులన్నీ దానికి ఓ చిన్నపాటి ఊరేగింపును కూడా నిర్వహించాయి! ప్రమాద సమయంలో దేన్ని కరచుకొని- ఎలా ఉండాలో కుర్రపురుగు ఉదాహరణ పూర్వకంగా వివరిస్తుంటే, అవన్నీ గుమిగూడి విన్నాయి. ఇప్పుడు కుర్రపురుగుకు మరిన్ని శిష్యులు ఏర్పడ్డాయి.
మర్నాటిరోజే ఇంటామె బియ్యం తీసుకొని చాటలోకి వేసుకున్నది. కుర్రపురుగు గ్లాసుని కరచుకొని ఉండలేక, చాటలోకి పడిపోయింది. ఇంటామె బియ్యం చెరిగినప్పుడు, కుర్రపురుగు చాటని కరచుకొని నిల్చింది- కానీ బియ్యం గిన్నెలోకి పోసేటప్పటికి, ఇక ఆగలేక అదీ గిన్నెలోకి పడిపోయింది. దానితో బాటే గిన్నెలోకి వచ్చిన పురుగు ఒకటి-బియ్యం కడిగినప్పుడు తేలి, ఆ నీళ్లతో బాటు బయటికి వెళ్లిపోయింది గాని, ఇది మాత్రం గిన్నెనే పట్టుకొని కూర్చుని, తనమాట వినలేదని దాన్ని తిట్టుకున్నది.
కానీ విధి లీల ఎలా ఉంటుందో చూడండి! -అది గిన్నెను కరచుకొని నిలిచి, జలప్రళయానికి అయితే తట్టుకున్నది గానీ, ఆ గిన్నెను పొయ్యిమీద పెట్టి ఉడికించినప్పుడు, పాపం ఆ అగ్నిప్రళయానికి బలైపోయింది!
అందుకనే, 'పురుగులకు అహంకారం కూడదు' అని చెబుతారు.