ఎ.కె.రామానుజన్ గారు చెప్పిన హాస్యకధ ఒకటుంది-
కాబూల్ నుండి భారతదేశాన్ని చూసిపోయేందుకుని వచ్చాడట, అబు అనేవాడు. ఓ పట్టణంలో వీధివెంబడి నడుస్తూ నడుస్తూ, వాడు ఒక మిఠాయిలమ్మే దుకాణం ముందుకొచ్చి నిలబడిపోయాడు. ఆ దుకాణంలో నిండుగా మిఠాయిలు! కళ్లు చెదిరే రంగుల్లో, వేర్వేరు ఆకారాల్లో, వేరువేరు సైజుల్లో అందంగా, ఆకర్షణీయంగా అమర్చి ఉన్నాయి!

అబుకు భారతదేశపు భాషలేవీ రావు. హిందీలో ఒకటి రెండు ముక్కలు మాత్రం ఎక్కడో విని ఉన్నాడు-అంతే. మరి, మిఠాయిలేమో నోరూరిస్తున్నాయి. వాటిలో "చాలా బాగుంటుందేమో" అనిపించేలా ఉండింది ఓ మిఠాయి. గుండ్రంగా, చక్రాలుగా, చక్కెర చల్లినట్లున్న ఆ మిఠాయిని చూసి అబు ఆగలేకపోయాడు. ఆ దుకాణదారు దగ్గరికి వెళ్లి నిలబడి, ఆ మిఠాయికేసి చేత్తో చూపించాడు.

దుకాణదారుకు అబు 'పరదేశీ' అని అర్థం అయింది. 'పరదేశం వాడు ఆ మిఠాయి పేరు అడుగుతున్నాడేమో' అని అతననుకొని, గట్టిగా చెప్పాడు "ఖాజా" అని.

హిందీలో "ఖాజా" కు ఇంకో అర్ధం కూడా ఉంది- “తినేసెయ్యి!" అని. దురదృష్టం కొద్దీ, అబుకు "ఖాజా" అంటే " తెనేసెయ్యి!" అని తెలుసు! అందుకని వాడు వెంటనే పోయి, సంతోషంగా ఆ మిఠాయిల్ని అన్నిటినీ తీసుకొని, ఒకదాని తర్వాత ఒకటి కడుపారా మెక్కేశాడు! బాగా తిన్నాక, 'ఇక చాల్లే' అనుకొని వాడు వెనుతిరిగి పోతుంటే‌, దుకాణంవాడు ఆపి, డబ్బులు చెల్లించమన్నాడు.

కానీ దుకాణదారు ఏమంటున్నదీ చెవి చింపుకున్నా అబుకు అర్థం కాలేదు! దుకాణంవాడు ఏదేదో అంటూపోయాడు గానీ, కడుపునిండిన సంతోషంలో ఉన్న అబు వాటిని అసలు పట్టించుకోలేదు. ఇక వాడిని ఏమనీ ప్రయోజనం లేదని అర్థమైన దుకాణదారు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

వాళ్లొచ్చి అబును పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తీసుకుపోయారు. అక్కడ పోలీసు ఇన్స్పెక్టరు ఏమన్నా అబుకు అర్థంకాక, చిద్విలాసంగా నవ్వు ముఖం పెట్టుకొని నిలబడ్డాడు తప్పిస్తే, మరేమీ జవాబివ్వలేదు. చివరికి విసిగిపోయిన ఇన్స్పెక్టరు తనే సొంతంగా శిక్ష వేయాలని నిశ్చయించుకున్నాడు. 'అబు తల నున్నగా గొరిగించి, తారుతో గుండుకు పెయింట్ వేయించి, వాడినో గాడిద మీద కూర్చోబెట్టి, మేళతాళాలతో నగర వీధుల్లో ఊరేగించాలని, చట్టాన్ని అతిక్రమిస్తే ఏమౌతుందో అలాగైనా అందరికీ తెలిసివస్తుందని' ఆదేశించాడాయన.

పోలీసులు ఆ శిక్షను ఉత్సాహంగా అమలు పరిచారు. ఊళ్లో జనాలంతా గాడిద వెంబడి నడుస్తూ, గుమిగూడి వినోదంగా నవ్వితే అబుకు చాలా సంతోషం అయింది. ఆ చర్యని ఇక్కడ గొప్ప అవమానంగా భావిస్తారని కూడా వాడికి అర్థం కాలేదు. పైపెచ్చు, తనని భారతీయులు ఎంత ఉత్సాహంగా గౌరవించారో తలచుకొని వాడు పొంగిపోయాడు.

ఆ తరువాత కొన్నిరోజులకు, అబు కాబూలుకు తిరిగి వెళ్లిన తర్వాత, అక్కడి వాళ్లు అడిగారు వాడిని- 'భారతదేశం ఎట్లా ఉన్నది?' అని.

“ఆహా! ఏం చెప్పేది?! అద్భుతమైన దేశం,అది! చాలా ధనిక దేశం, నిజంగా! ఏ వస్తువైనా సరే, మనకు ఊరికే ఇచ్చేస్తారు అక్కడ! మనం ఏమీ చెల్లించనక్కర్లేదు!! మనం ఏదైనా మిఠాయిల దుకాణం ముందు నిలబడి, మనకు నచ్చిన మిఠాయిలకేసి చెయ్యెత్తి చూపిస్తే చాలు- “మీకు నచ్చినన్ని తీసుకొని తినండి" అంటారు వాళ్ళు. ఆపైన మనం ఇష్టమున్నట్లు తినచ్చు. ఇక అక్కడి పోలీసులు- బాజా భజంత్రీలు పట్టుకొని వస్తారు. వాళ్ళు మనకు చక్కగా తలపని చేసి, తలకు హెయిర్ డై పట్టిస్తారు. అంతేకాదు, మనల్ని ఓ మంచి గాడిద మీద కూర్చో బెట్టి, పట్టణం అంతా తిప్పి చూపిస్తారు కూడా. -అదీ ఒంటరిగా కాదు! చక్కటి సంగీతం వాయించే సంగీతబృందాన్నొకదాన్ని మనతోబాటుగా పంపిస్తారు! ఇదంతా ఉచితమే,మనం ఒక్క దమ్మిడీ కూడా చెల్లించాల్సిన అవసరం లేదు!! గొప్ప దేశం అది, నిజంగా! చాలా మంచి ప్రజలు; అతిథుల్ని గౌరవించేదెలాగో మనం వాళ్ల నుంచి నేర్చుకోవాలి!” అన్నాడు అబు, మనందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలర్పిస్తూ!

దేన్ని గురించైనా మనం అనుకునే తీరు మన ఆలోచనల్ని బాగా ప్రభావితం చేస్తుంది. అందుకని మనం అనుకునేవి వాస్తవానికి దగ్గరగా ఉంటే మంచిది. అలాకాక మనం బండరాళ్లను కొండలుగాను, కొండల్ని మట్టి బెడ్డలుగాను అనుకుంటే, వాటికేమీ అవ్వదు- ఎప్పుడో ఒకసారి మనమే నవ్వులపాలయ్యే ప్రమాదం ఉన్నది. ఏమంటారు?

ఈనెల పతాకచిత్రం "చలి" చిత్రకారుడు శ్రీ.వీరాంజనేయులుగారి సృజన. వారికి ధన్యవాదాలు.

అభినందనలతో,

కొత్తపల్లి బృందం.