ఒక ఊరిలో ఒక అవ్వ ఉండేది.ఆ అవ్వకు మేకలు,ఆవులు,కోళ్ళు చాలా ఉండేవి.
ఒక రోజు కోడి ఒక చిన్నగుడ్డు పెట్టింది. ఆ గుడ్డు లోంచి బారెడు మీసం,బారెడు గడ్డం ఉన్న అబ్బోడు బయటకు వచ్చాడు.
పుట్టీ పుట్టగానే ఆ అబ్బోడు "అవ్వా! నాకు పెద్ద కొడవలి ఇవ్వు!" అన్నాడు. "సరే" అని తెచ్చి ఇచ్చింది అవ్వ.
దాన్ని పట్టుకొని , అబ్బోడు రాజుగారి వరి మడికి పోయాడు. అక్కడ ఉన్న సగం వరినంతా కోసేశాడు.
ఆ సగం వరి మొత్తాన్నీ అబ్బోడు ఎత్తుకు పోతూ ఉంటే, అదే సమయానికి రాజు వచ్చాడు. ఆయన అబ్బోడిని, అతని శక్తిని చూసి, అబ్బుర పడ్డాడు. "నీకు ఏమి వరం కావాలో కోరుకో" అన్నాడు.
అప్పుడు ఆ అబ్బోడు "నా ఎడమ చెవి నిండా వరి పొయ్యమ"న్నాడు, అలాగే 'కుడి చెవి నిండా వరిబియ్యం పొయ్యమ'న్నాడు. అప్పుడు రాజు నవ్వి అన్నాడు, "నీ ఎడమచెవి,కుడి చెవి నిండా పిడికెడు బియ్యం కూడా పట్టవే, వాటిని ఇచ్చీ ఏమి లాభం? ఇంకా వేరేదేదైనా అడుగు." అన్నాడు.
"నేను అడిగేది నేను అడిగాను. నువ్వు ఇచ్చేది నువ్వు ఇవ్వు. కావాలంటే మళ్ళీ వచ్చి ఇంకోటేదో అడుగుతానులే!" అన్నాడు అబ్బోడు.
"సరే" అని, రాజు అబ్బోడి చెవుల్లోవరి బియ్యం పోశాడు. ఎడమ చెవి అర్ధానికి ఏనుగంత రాశి వచ్చింది. కుడి చెవి అర్ధానికి ఇంకో ఏనుగంత రాశి వచ్చింది.
ఆ అబ్బోడు ఇంటికి వచ్చాడు. ఎడమ చెవిలోవుండే రాశినంతా కిందికి వేసేశాడు.అలాగే కుడిచెవి నిండా వుండే రాశినంతా కిందికి పడేశాడు. అవ్వ సంతోష పడ్డది.
అప్పుడు ఆ అబ్బోడు "అవ్వా! నేను రాజకుమారిని పెళ్ళి చేసుకుంటాను" అన్నాడు అవ్వతో. "రాజు నీకు బిడ్డను ఇవ్వడేమోరా, అయినా సరే, అడిగి చూడు" అనింది అవ్వ.
ఆ అబ్బోడు రాజభవనానికి వచ్చాడు. మిగిలిన వరినంతా కోశాడు. అప్పుడు రాజు "ఈసారి నీకు ఏం వరం కావాలో కోరుకో" అన్నాడు. అప్పుడు అబ్బోడు "నీ కుమార్తె కావాలి" అన్నాడు.
మాట తప్పలేక, రాజు తన కుమార్తెను ఇచ్చి పెళ్ళి చేశాడు. పెళ్ళికాగానే అబ్బోడు గొప్ప రాజకుమారుడైపోయాడు. అటు తర్వాత ఆ రాజకుమారుడు, రాజకుమార్తె సంతోషంగా జీవించారు.