యుద్ధంలో గాయపడి కదలలేక పడి ఉన్న వాళ్లకు నీళ్లు అందిస్తుంటాడు నిహాల్ సింగు. భుజంమీద గొర్రెచర్మంతో చేసిన నీళ్లసంచీని మోసుకొని, అతను యుద్ధభూమిలో ధైర్యంగా తిరుగాడేవాడు. కానీ నిహాల్ సైనికుడు కాదు- ఒక పేద 'సేవాదార్' మాత్రమే. సేవాదార్లు రణరంగంలో శవాలను ఎత్తి పూడ్చటం, కాల్చటం లాంటి తక్కువ రకపు పనులు చేస్తుంటారు.
అయితే నిహాల్ సింగుకు ఆభరణాలు- అతని వినయశీలత, కార్య క్షమత. అతను చేసే పని కఠినమైనదే కాదు, చాలా ప్రమాదాలతో కూడుకున్నది కూడా. బరువైన 'మషాక్'ను మోసుకుంటూ, ఒక చదరపు కిలోమీటరు పరిధిలో రోజంతా తిరుగుతూ, గుర్రాలమీద, నేలమీద కత్తులు పట్టుకొని తిరిగే వీరయోధుల పాలబడకుండా తప్పించుకుంటూ- అవసరమున్నవారికి నిరంతరంగా నీళ్లదించటం మామూలు పనికాదు.
ఆ సమయంలో పంజాబులో ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. వారికి నాయకుడు గురుగోవిందసింగ్. గురుగోవిందసింగ్ మామూలు రాజకీయ నాయకుడు కాదు- సిక్ఖు సంస్కృతికి మూలస్తంభంగా నిలచిన మహనీయుల్లో ముఖ్యుడు, ఆయన. ఆ రోజుల్లో పంజాబుకు ఢిల్లీ రాజధానిగా ఉండేది. డిల్లీని మొగల్ షాదుషా ఔరంగజేబు పరిపాలించేవాడు. ఆయన విధానాలు పక్షపాత భరితంగా ఉండేవి. ఇతర మతాలను ఆయన అణచివేయనెంచాడు. గురుగోవిందసింగ్ నాయకత్వంలో ఔరంగజేబుకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం మొదలైంది. గురూజీ పిలుపుమేరకు, పంజాబ్ లోని ప్రతి హిందూ కుటుంబమూ ఒక కొడుకును వీరసైనికుడుగా ఆయన పరం చేసింది.
నిహాల్ సింగ్ తన పనిని శ్రద్దగానే నెరవేర్చేవాడు- కానీ అతనికి వ్యతిరేకంగా గురుగోవిందసింగ్ కు అనేక ఫిర్యాదులు అందేవి. అలా ఫిర్యాదు వచ్చినప్పుడల్లా ప్రతిసారీ గురూజీ వాటిని ప్రక్కకు నెట్టేసేవారు. నిహాల్ సింగ్ భక్తి శ్రద్ధలపైన, అతని వ్యక్తిత్వంపైన గురూజీకి విపరీతమైన నమ్మకం ఉండేది. కానీ రానురాను నిహాల్ సింగుపైన ఫిర్యాదుల వెల్లువ ఎక్కువ అవ్వటంతో, ఏమైనా చేయక తప్పని పరిస్థితి ఎదురైంది గురూజీకి.
గురూజీ న్యాయనిర్ణేతగా నిహాల్ సింగ్ పనితీరును పరిశీలించే కమిటీ ఒకటి ఏర్పడింది. వందలాది మంది సిఖ్ఖులు అక్కడ కూర్చొని చూస్తుండగా విచారణ మొదలైంది. నిహాల్ సింగ్ పై ఇలా అభియోగం మోపారు- “యుద్ధంలో గాయపడిన సిఖ్ఖు సైనికులకు నిహాల్ శ్రద్ధగా త్రాగునీళ్లందిస్తున్నాడు. ఇది చాలా మంచిపనే. కానీ మా పరిశీలనలో తేలింది ఏంటంటే- అతను గాయపడిన శతృ పక్షపు సైనికులకు- ముస్లిం సైనికులకు కూడా అంతే శ్రద్ధగా నీళ్ళందిస్తున్నాడని! ఇది ఒట్టి పొరపాటు కాదు- ఎందుకంటే శతృ సైనికులను వాళ్ల యూనిఫాం ద్వారా సులభంగానే గుర్తుపట్టవచ్చు. ఒకరు కాదు, ఇద్దరు కాదు- ఇలా చేయవద్దని నిహాల్ సింగుకు చాలామందిమి, అనేక సార్లు సూచించాం. అయినా అతను వినటం లేదు- ఎందుకు? ఈ ప్రశ్నకు అతను సరైన సమాధానం ఇవ్వకపోతే, అతన్ని కఠినంగా శిక్షించాల్సిందే!" అని.
గురువుగారు నిహాల్ ను సభలో నిలబెట్టి అడిగారు- “నిజమేనా, నిహాల్? నువ్వు ముస్లిం సైనికులకు నీళ్లు ఇస్తున్నావట, నిజమేనా?” అని.
నిహాల్ చేతులు మోడ్చి అన్నాడు " అవును, గురూజీ. నేను యుధ్దంలో గాయపడిన సైనికులందరికీ త్రాగునీళ్లు అందిస్తున్నాను. ఒకవేళ అది తప్పైతే నేను దోషినే- నాకు శిక్ష విధించండి" అని.
గురువుగారు అడిగారు- “కానీ ఎందుకు నిహాల్, అట్లా చేస్తున్నావు? మనకు 'కొందరు మిత్రులు, కొందరు శత్రువులు' అని నీకు తెలియదా? వాళ్లిద్దరికీ తేడా కనుక్కోలేవా, నువ్వు?”
నిహాల్ అన్నాడు- “నేను ఆ మషాక్ మోసుకొని వెళ్లి, గురూజీ- గాయపడిన వాళ్ళను ఎవరినైనా చూసినప్పుడు- వాళ్లంతా నాకు మీ మాదిరే కనబడతారు. హిందూ-ముస్లిం తేడాలేవీ కనబడవు నాకు, వాళ్లలో. అందరి ముఖాలలోనూ కాంతులీనుతున్న నా దైవం- తమరి ముఖమే దర్శనమిస్తుంది- నాకు అంతటా మీరే కనబడతారు- నేనేం చేసేది?” అని.
సభలోని వారంతా నిశ్చేష్టులయ్యారు. గురూజీ పట్ల నిహాల్ సింగుకు ఉన్న భక్తి తత్పరత వాళ్లందరినీ మంత్రముగ్ధుల్ని చేసింది. గురుగోవింద్ సింగ్ లేచి నిలబడి , నిహాల్ సింగ్ దగ్గరికి వెళ్లి, అతన్ని ప్రేమగా అక్కున చేర్చుకున్నారు. నిహాల్ సింగ్ చేస్తున్న పనిని మరింత శ్రద్ధగా కొనసాగించాలని గురూజీ చెప్పినప్పుడు, అందరూ ఆమోదిస్తూ హర్షధ్వానాలు చేశారు!