ఒక జమిందారుగారు పనిమీద వేరే ఊరికి వెళ్లారు. ఆ సమయంలో ఆయన ఇంట్లో ఘోరమైన అగ్నిప్రమాదం జరిగి, ఆయన పిల్లాపాపల్తో సహా ఆస్తి సర్వం కాలిపోయింది. జమీందారుగారికి ఈ సంగతి తెలిస్తే గుండె ఆగిపోతుంది, ఆయనకు అసలే గుండె జబ్బు కూడాను. అలాగని ఆయనకు చెప్పకుండా దాచటం ఎలా? గ్రామపెద్ద సంకటంలో పడ్డాడు. చివరికి ఓ మంగలి ముందుకొచ్చాడు - తను వెళ్లి జమీందారుకు సంగతి చెప్పి వస్తానన్నాడు.

“ఒరే, ఏదైనా తప్పు జరిగిందంటే‌ జమీందారుగారు మనకు దక్కరు. జాగ్రత్త!" అన్నాడు గ్రామపెద్ద.

"నేను చూసుకుంటాను లెండయ్యా!" అన్నాడు మంగలి, బయలుదేరుతూ.

పొరుగూర్లో ఉన్న జమీందారు మంగలిని చూడగానే -“ఏమయ్యా! ఊర్లో అంతా బాగున్నారా?” అన్నాడు.

“ఓ, మా బాగా ఉండారయ్యా! నల్లకుక్క మాత్రం చచ్చిపోయింది" అన్నాడు మంగలి.

“అయ్యో! పాపం, చచ్చిపోయిందా? నేను బయల్దేరినప్పుడు బాగానే ఉండిందే?” అన్నాడు జమీందారు కొంచెం ఆశ్చర్యంగా.

"పాపం, బాగా అరిగినట్లు లేదండయ్యా! అంతంత గుర్రపు మాంసం తింటే మరి, ఎట్లా అరుగుతుంది?” అన్నాడు మంగలి.

“గుర్రపు మాంసం తిన్నదా? అదెక్కడ దొరికిందట దానికి?”

“ఊర్లో ఇంకెవరికి ఉన్నాయండయ్యా, గుర్రాలు? తమరి గుర్రపుశాలలో తప్ప?”

“ఏంటీ, మా గుర్రాలు చచ్చిపోయాయా?!”

“పాపం, మరి వాటిని మేపే మనుషులు లేకపోతే, అవి మాత్రం ఏం బ్రతుకుతాయి లెండయ్యా!”

”ఏమి, ఏమి అయిందట, పనివాళ్లకేమి అయిందట?!”

“అన్నం తినకుండా ఊరికే ఉపవాసం ఉండీ ఉండీ ఎవరికైనా ఏం అవుతుందండయ్యా? అదే అయ్యింది. పాపం వాళ్లకి జీతం ఇచ్చేవాళ్లే లేకపోతే, ఇక వాళ్లెట్లా ఉంటారు?”

“ఏంట్రా నువ్వనేది? వాళ్లకి జీతం ఎందుకు అందలేదు? మా దివానుకు ఏమి అయింది? మా భార్య అక్కడే ఉన్నది గదా!?”

“వాళ్లెట్లా బ్రతికి ఉంటారండయ్యా, పాపం, వాళ్లకి భోజనం పెట్టే వంటాయనే లేడు కదా!”

“ఏమి!? వంటాయనకేమి అయింది?!”

“పాపం, వాడెట్లా బ్రతుకుతాడయ్యా, వాడు పనిచేస్తున్న గదికే మంటలు వచ్చి, అవి ఇల్లంతా వ్యాపించి, ఇంట్లో ఉన్న అందరినీ కాల్చేస్తేనూ?”

జమీందారు గారికి మంగలంటే అసహ్యం వేసి, వెంటనే ఊరికి ప్రయాణమయ్యారు.

కానీ ఆయన గుండెకు మాత్రం ఏమీ కాలేదు!