కాంచన పురం అనే రాజ్యాన్ని ధర్మధరుడనే మహారాజు పరిపాలిస్తుండేవాడు. పేరుకు తగినట్లే ఆయన ధర్మాన్ని అనుసరించి పరిపాలన సాగించేవాడు. ఆయన రాజ్యంలో ప్రజలంతా పాడి పంటలతో సుఖంగా జీవించేవాళ్లు. ప్రజలందరికీ రాజు అందుబాటులో ఉండేవాడు. ఎవ్వరైనాసరే, ఆయనను నేరుగా కలిసి, తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చు; ఏ పరిపాలనా విషయంలోనైనా తమ అభిప్రాయాలను రాజుకు నేరుగా తెలియజేయవచ్చు.

ఒకసారి దసరా ఉత్సవాల సమయంలో బలశాలి అయిన యువకుడొకడు ధర్మధరుని వద్దకు వచ్చి- "మహారాజా! నా పేరు సింహబలుడు. నేనొక మల్లయోధుడిని. ఈ యావత్ సామ్రాజ్యంలో- నీతో సహా- ఎవ్వరైనా సరే- నాతో కుస్తీకి తలపడవచ్చు. నేను ఏ ఒక్కరితో ఓడినా, నాకు శిరచ్ఛేద శిక్ష విధించండి. అయితే, నేను మీ అందరినీ గెలిస్తే మాత్రం, ఇక ఈ రాజ్యానికి నన్నే రాజును చేయాలి" అన్నాడు.

అతని మాటలకు ప్రజలలో స్తబ్దత ఏర్పడింది. అందరిలోనూ తెలియని దిగులు మొదలైంది. రాజుగారు సింహబలునితో ఎట్లా ప్రవర్తిస్తారో, తన సింహాసనాన్నే అపేక్షిస్తున్నందుకు అతనిని ఏం చేస్తారోనని ప్రజలందరూ ఊపిరి బిగబట్టి ఎదురుచూడసాగారు.

ధర్మధర మహారాజు చిరునవ్వు నవ్వాడు. మహామంత్రితో "మంత్రి వర్యా, ఒక మంచి ఆయుధం తనంతట తానుగా మన రాజ్యంలోనికి వచ్చింది. చాలా సంతోషించాల్సిన విషయం" అన్నాడు. సింహబలునితో "ఓయీ సింహబలా! ఇక్కడ జరుగుతున్నవి శక్తి సామర్థ్యాలకు సంబంధించిన వ్యక్తిగత పోటీలు కావు. ఇవి ఉత్సవాలు. ఉత్సవాల్లో వ్యక్తిగత విజయాలకంటే, సంతోషానికీ, సంబరానికీ పెద్దపీట వేయటం జరుగుతుంది. నువ్విక్కడ పోటీలలో పాల్గొనవచ్చు. అయితే బహుమతులు మా అభీష్టం మేరకు ఇవ్వబడతాయి. ఒకవేళ నీ షరతులపైనే నువ్వు పోటీ‌చేస్తానంటే, అలాగే కానివ్వు- అయితే దానికి సమయం ఇది కాదు. సరైన సమయం, సందర్భం వచ్చేంతవరకు నువ్వు మా అతిథిగా మా రాజ్యంలోనే నివసించేందుకు ఏర్పాటు చేయగలం" అన్నాడు.

సింహబలుడు పోటీల్లో పాల్గొని రాజ్యంలోని మల్లయోధులందరినీ క్షణాల్లో‌ మట్టి కరిపించాడు. బహుమతులందుకున్నాడు. ఆపైన మరోసారి తన కోరికను వ్యక్తం చేశాడు- 'తాను ఓడితే తనకు శిక్ష వేయవచ్చు. తాను గెలిస్తేమాత్రం తనకు రాజ్యాధికారం ఇవ్వాలి' అని. రాజుగారు "అయితే సరే, నువ్వు మారాజ్యంలో అతిథిగా కొంతకాలం ఉండమ"న్నారు. 'సరే' అన్న సింహబలునికి రాజుగారు అన్ని వసతులతోటీ నివాసం ఏర్పాటు చేశారు.

అయితే రాజుగారి చర్యలు ప్రజలెవ్వరికీ అర్థం కాలేదు- 'రాజుగారినే సవాలు చేస్తున్న వ్యక్తికి రాజద్రోహనేరం క్రింద కారాగార శిక్ష విధించకుండా, రాజుగారు అతిథి సత్కారాలు చేయటం ఎందుకు?' అనుకున్నారందరూ.

కాంచనపురానికి పొరుగున భైరవపురం అనే రాజ్యం‌ ఉన్నది. దానికి రాజు వక్రసేనుడు, పేరుకు తగినట్లే వక్రబుద్ధి. ఏదో ఒక వంకతో ఇతర రాజ్యాలను కబళించటం, విలాసాలకోసం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయటం వక్రసేనుడికి అలవాటు. ఆ వక్రసేనుని వక్రదృష్టి ఇప్పుడు కాంచన పురంపై పడింది. "వక్రసేన మహారాజు ఇందుమూలంగా తెలియజేసేదేమంటే, మీరు మర్యాదగా మీ ఓటమినంగీకరించి, భైరవపురాధీశునికి తలవంచి తగిన కప్పం చెల్లించండి. లేదా, యుద్ధం తప్పదు." అని అతను ధర్మధరునికి కబురంపాడు.

మంత్రితో సహా సభలోని ఉద్యోగులందరూ అకస్మాత్తుగా వచ్చిన ఆ సందేశం పట్ల భయమూ, విచారమూ వ్యక్తం చేశారు. వక్రసేనుడి శక్తి వాళ్ళందరికీ తెలుసు. అతనితో తలపడితే కాంచననగరం మట్టిలో కలిసిపోక తప్పదు. కానీ ధర్మధరుడు వాళ్లందరికీ ధైర్యం చెప్పి, తాను సింహబలుడిని ఉంచిన వసతి గృహానికి బయలుదేరాడు.

అక్కడ సింహబలుడు అతిథిగా తనకు ఇచ్చిన వసతులను సద్వినియోగం చేసుకున్నాడు. తన బలాన్ని మరింతగా వృద్ధి చేసుకున్నాడు. అయితే ఈ క్రమంలో‌ అతనికి ధర్మధరుని ప్రవర్తన చాలా నచ్చటం మొదలెట్టింది. ధర్మధరుడిని ప్రజలంతా ఎంత గౌరవిస్తారో అతను తెలుసుకున్నాడు. 'మంచివారికి సహాయం చేయటంకోసం నీ శక్తి యుక్తులను వినియోగించు' అని చెప్పిన తన గురువు మాటలు అతనికి జ్ఞాపకం వచ్చాయి. అతని రాజ్య కాంక్ష నశించింది. 'తాను ధర్మధరునికి సహాయం చేయగలిగే అవకాశం ఏమైనా వస్తే బాగుండును' అని అతను ఎదురుచూడసాగాడు.

ధర్మధరుడు నేరుగా సింహబలుని దగ్గరకు వెళ్లి- "సింహబలా! నీ కోరిక తీరే సమయం ఆసన్నమైంది. మన రాజ్యంలో అందరికన్నా బలశాలివైన నీవు, మన రాజ్య సింహాసనాన్ని అధిష్టించేందుకు కూడా తగినవాడివే. అయితే నీ బలాన్ని మనరాజ్యంలోని వ్యక్తులపై కాదు నాయనా, మనమీదికి దండెత్తి వస్తున్న విదేశీ శక్తులపై చూపించగలిగితే బాగుంటుందని నా అభిప్రాయం. నిన్ను వక్రసేనుడి వద్దకు రాయబారిగా పంపనెంచాను. ప్రజలకు నష్టం కలిగించే యుద్ధాలు వద్దని వక్రసేనుడికి చెప్పి ఒప్పించు. నువ్వు తిరిగి వచ్చాక, నేను స్వయంగా నీకు పట్టాభిషేకం చేయగలను" అన్నాడు.

"మహారాజా! నా అజ్ఞానాన్ని మన్నించండి. రాజవ్వటం సుఖాస్వాదనకోసం కాదనీ, ప్రజలు మెచ్చిన రాజు అవ్వటమే పరిపాలకుని పరమార్థం అనీ గ్రహించాను. నాకు రాజ్యం అవసరం లేదు. మీ సేవకునిగా, మన రాజ్యంకోసం నా చేతనైన సహాయం నేను చేయగలను. మీ ఆదేశాన్ని శిరసా వహిస్తాను. మీకూ, మన రాజ్యానికి మచ్చరానీయనని ప్రమాణం చేస్తున్నాను" అన్నాడు సింహబలుడు రాజుతో.

ఆపైన అతను బయలుదేరి, వక్రసేనుడి దర్బారు చేరుకున్నాడు. సింహబలుడిని చూడగానే వక్రసేనుడు "ఏమిరా, ధర్మధరుడి దూతగా వచ్చావట. ఏమంటున్నాడు, ఆ పిరికిపంద?" అని గట్టిగా నవ్వాడు. సింహబలుడికి కోపం వచ్చినా తమాయించుకొని, "మహారాజా! ప్రజలకు నష్టం కలిగించే యుద్ధాలు వద్దని ధర్మధర మహారాజుగారు తమకు మనవి చేయమన్నారు" అన్నాడు. "ఒరేయ్! యుద్ధం వద్దనే పిరికి పందలు, రాజ్యాన్ని నాకు సమర్పించండిరా. నా బాహుబలానికి తలవంచి, నా కాళ్ళు మ్రొక్కండి" అన్నాడు వక్రసేనుడు . ఇక సింహబలుడు ఆగలేకపోయాడు-"మేం పిరికిపందలం కాదు మహారాజా! కేవలం ధర్మధరుని ఆదేశాన్ని అనుసరించి మీతో మర్యాదగా మాట్లాడుతున్నాం తప్పిస్తే, మాతో మల్లయుద్ధంలో తలపడి గెలిచినవాడు లేడు" అన్నాడు వేడిగా. "ఓహో! మల్లయోధుడినే పంపాడే! మా బాహువులు మర్దించటానికి ఉవ్విళ్ళూరుతున్నై. రా,రా దూతా! నాతో మల్లయుద్ధం చెయ్యి!" అన్నాడు వక్రసేనుడు.

చెలరేగిన సింహబలుని ముందు వక్రసేనుడు ఐదునిముషాలు కూడా ఆగలేకపోయాడు. ఆ మల్లయుద్ధం ముగిసేసరికి వక్రసేనుడి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. ఆ రాజ్యపు మంత్రులతో సహా అందరూ సంతోషంతో సింహబలుడిని అభినందించి, అతన్నే తమరాజుగా ఉండమన్నారు!

సింహబలుడు వారందరి మన్ననలూ పొంది, తిరిగి ధర్మధరుని వద్దకు వచ్చాడు. వక్రసేనుడి మృతి అతని రాజ్య ప్రజలకు సంతోషం కలిగించటం చూసి సింహబలుడికి మతిపోయినట్లైంది. 'ఇద్దరు రాజుల మధ్యా ఎంత తేడా! ఒక రాజును ప్రజలు కంటిపాపగా కాపాడుకుంటున్నారు. ఒక రాజును ఆ రాజ్య ప్రజలే చీదరించుకుంటున్నారు.' ఇదేమాట అతను ధర్మ ధరునితో అంటే, ఆయన "ఆ సంగతి నీకు తెలీటం కోసమే నిన్నక్కడికి పంపాను నాయనా! రాజన్నవాడికి కేవలం ఆవేశం, బాహుబలం ఉంటే చాలదు. పరిపాలన అంటే బాహుబలపరీక్ష కాదు. పరిపాలన ఎప్పుడూ ప్రజా క్షేమం కొరకే ఉండాలి. ఈ సంగతి నీకు అర్థం అయిందిగనక, ఇక నా రాజ్యాన్ని సంతోషంగా నీకు సమర్పిస్తాను" అన్నాడు.

సింహబలుడు ధర్మధరుని పాదాలపైబడి క్షమాపణ కోరుకున్నాడు. అజ్ఞానం కొద్దీ రాజ్యాధికారాన్ని ఆశించినందుకు ఏ శిక్ష విధించినా స్వీకరిస్తానన్నాడు. ధర్మధరుడు అతనిని గౌరవించి మెచ్చుకొని, తన ప్రతినిధిగా అతన్ని తిరిగి భైరవపురానికి పంపాడు! సింహబలుడు భైరవపురానికి రాజై, ధర్మధరుని అడుగుజాడలలో నడిచి, మంచిరాజుగా పేరు తెచ్చుకున్నాడు. ఇరు రాజ్యాల మైత్రీ బంధం ఆపైన చిరకాలం వర్థిల్లింది.