ముసలిదంపతులు ఇద్దరికి పిల్లలులేరు, భూమీ లేదు. వాళ్లు కడు పేదలు. అడవిలోదొరికే వేళ్లనీ, దుంపల్నీ ఏరుకుని, తినటం వాళ్ల రోజువారీ పని.

అంతపెద్ద వయసులో ముసలమ్మ గర్భం ధరించింది. నెలలు నిండాక, ఒక రోజున అడవిలో దుంపలు తవ్వుకొంటుండగా ఆమె ప్రసవించి, మగబిడ్డ ఒకడు పుట్టాడు. ఆమె భర్తను పిలిచి "ముసలాయనా! ఇదిగో, మగపిల్లాడు పుట్టాడు. వీడిని ఏం చేద్దాం?” అని అడిగింది.

“మనం తినేందుకే ఏమీలేదు. పైన వీడినేం పెంచుతాం?” అన్నాడు ముసలాయన.

“ఇక్కడే వదిలేసి పోదాం. వాడి రాత బాగుంటే వాడిని ఎవరో ఒకళ్లు పెంచుకుంటారు" అన్నది ముసలమ్మ.

ఇద్దరూ ఆ పసిగుడ్డును అక్కడే వదిలి ఇంటికి వెళ్లిపోయారు. పిల్లవాడు గట్టిగా ఏడుస్తుంటే విని, పులి ఒకటి అటు వైపుకు వెళ్లింది. అది ఆ పిల్లవాడిని నోట కరుచుకొని తన ఇంటికి తీసుకుపోయింది. అక్కడ అది తాగేందుకూ, తినేందుకూ వసతులు ఏర్పరిచి, వాడిని తన సొంత కొడుకులాగా పెంచింది.

పులిబిడ్డడు పెరిగి పెద్దై అందంగా, బలంగా తయారయ్యాడు. ఒకనాడు పులి వాడిని చూసి "నా కొడుకు ఇప్పుడు పెళ్లి యీడుకొచ్చాడు. ఇక వీడి కోసం ఒక భార్యను వెతకాలి" అనుకున్నది. “నేను వెళ్లి నీకోసం ఒక ఆడపిల్లను తేనా?” అని అది కొడుకును అడిగింది.

వాడన్నాడు - “నీ ఇష్టం, నాన్నా. నువ్వు నన్ను పెళ్లి చేసుకొమ్మంటే చేసుకుంటాను. నీకిష్టమైన అమ్మాయిని చూడు మరి" అని.

పులి బయటికి పోయి, ఒక ఆడపిల్ల ఎవరైనా వస్తారేమోనని ఎదురుచూసి, ఆ దారిన పోతున్న పిల్లనొకదాన్ని పట్టుకున్నది. కానీ ఆ అమ్మాయి చెవుల్ని చూస్తే దానికి నోట్లో నీళ్లూరాయి. ఒక చెవిని కొరుక్కోకుండా ఉండలేకపోయిందది. అట్లా అది ఆ పిల్లను తీసుకొచ్చి "కొడుకా, ఇదిగో నీకోసం ఒక పిల్లను తెచ్చాను. బయటికి వెళ్లి చూడు, నీకెలా అనిపిస్తుందో" అన్నది.

కొడుకు బయటికెళ్లి చూసి "ఆమెకు ఒక చెవిలేదు నాన్నా! నాకు సగం చెవుల పిల్ల వద్దు!!" అన్నాడు పులితో. పులి ఇక వరసగా ఆడపిల్లల్ని ఎత్తుకు రావటం మొదలుపెట్టింది - ప్రతిసారీ ఆ పిల్లల చెయ్యో, ముక్కో, చెవో ఉండేది కాదు. చివరికి విసిగిపోయిన కొడుకు అన్నాడు - "నాన్నా! నాకో పూర్తి అమ్మాయిని తెచ్చిపెట్టు - ఎవరైనా ఓ మంచి అమ్మాయిని -పూర్తి అమ్మాయిని- గాయాలు లేని అమ్మాయిని తీసుకురా" అని.

ఇక అప్పుడు పులి వెళ్లి, ఈసారి ఓ పెళ్లి పందిర్లోకి దూరింది. పెళ్లికి వచ్చిన బంధువులంతా భయపడి తలోదిక్కుకూ పరుగెత్తగానే, అది పోయి, పెళ్లి కూతుర్ని జాగ్రత్తగా ఎత్తుకెళ్లి, తన కొడుక్కిచ్చి పెళ్లి చేసింది. పులి కొడుకూ, ఆ అమ్మాయీ కొన్నాళ్ళపాటు సుఖంగా కాలం గడిపారు.

ఒక రోజున పులి కోడలు కూరగాయలు తరుగుతూండగా ఆమె వేలు తెగి రక్తం కారింది. ఆమె ఆ రక్తపు చుక్కల్ని దగ్గర్లో కనబడ్డ ఆకులతో తుడిచి, వాటిని బయట పడేసింది. పులి ఆ వాసన పట్టి, వెళ్లి, ఆకుల్ని నాకి చూసింది. వెంటనే మానవ రక్తం రుచి మళ్ళీ ఓసారి గుర్తుకొచ్చింది దానికి. “వీళ్ల రక్తమే ఇంత బాగుందంటే, ఇక వీళ్ల మాంసం ఎంత బాగుంటుందో! నేను వీళ్లను తినేస్తాను" అనుకున్నదది, ఉత్సాహంగా.

ఆ ఉత్సాహంలో అది ఆ మాటల్ని బయటికే అనేసిందో, లేకపోతే దాని కళ్లల్లో మార్పు అంత కొట్టొచ్చినట్లు ఉన్నదోగాని, కొడుకూ-కోడలూ పులి ఉద్దేశాన్ని పసిగట్టేశారు. అదే రోజున రాత్రి వాళ్లిద్దరూ ఇళ్లు వదిలిపెట్టి పారిపోయారు. ఉదయం నిద్రలేవగానే పిల్లలు లేరన్న సంగతిని కనుక్కున్నది పులి. వెంటనే అది వాళ్ల అడుగుజాడల్ని పట్టుకొని వాళ్లని వెంబడించింది.

పులి ఉద్దేశం స్పష్టంగా తెలిసిపోయిన భార్యాభర్తలిద్దరూ ఇప్పుడో చెట్టెక్కి కూర్చున్నారు. వాళ్లని వెతుక్కుంటూ పులి ఆ చెట్టుకిందికి రాగానే పులి కొడుకు దానిమీదికి దూకి, చేతనున్న కత్తితో దాన్ని పొడిచి చంపేశాడు.

ఆ తర్వాత వాళ్లిద్దరూ ఆ అమ్మాయి ఊరికి చేరుకున్నారు. ఆ అమ్మాయి తల్లిదండ్రులూ, అన్నదమ్ములూ అందరూ ఆ పిల్లపైన పూర్తిగా ఆశలు విడిచి ఉన్నారు. ఇంకా ఆమెను పులి తినేసిందనే అనుకుంటున్నారు, వాళ్లంతా. ఇప్పుడా పిల్ల భర్తతో సహా తిరిగి రావటం చూసి, వాళ్ళంతా ఎంతో సంతోషించారు. అటుపైన పులి కొడుకూ, కోడలూ ఆ ఊరిలో స్థిరపడి, సుఖంగా జీవించారు.